sivraj singh chouhan
-
ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? అమలవుతున్న 7 పథకాలు ఏవి?
మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను మధ్యప్రదేశ్ మహిళల సోదరునిగా అభివర్ణించుకుంటారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వడం, వితంతువులకు పింఛన్ ఇవ్వడం వంటి అనేక పథకాలను శివరాజ్ ప్రభుత్వం అమలు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ఏఏ పథకాలు అమలు చేస్తున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాడ్లీ బెహన్ యోజన శివరాజ్ ప్రభుత్వం ‘లాడ్లీ బెహన్’ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ పథకం కింద అక్కాచెల్లెళ్లకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెలకు రూ. 1,250కి పెంచారు. 2. నారీ సమ్మాన్ కోష్ శివరాజ్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో నారీ సమ్మాన్ కోష్‌ను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చిన్న వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని పీఎం స్వనిధి యోజన, ముఖ్యమంత్రి వీధి వ్యాపారుల పథకాల కింద అందజేస్తారు. 3. లాడ్లీ లక్ష్మీ యోజన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్‌లో ఆడపిల్లలు పుడితే ప్రోత్సాహం, లింగ నిష్పత్తిలో మెరుగుదల, విద్యా స్థాయి, బాలికల ఆరోగ్య స్థితిపై ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందేందుకు ప్రారంభించారు. ఈ పథకం 2007 నుండి అమలులో ఉంది. లాడ్లీ ఇ-సంవాద్ యాప్ ద్వారా, ప్రజలు నేరుగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకోవచ్చు. 4. ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్యా వివాహ-నిఖా పథకం అమలవుతోంది. దీని కింద పేదలకు రూ.51వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. 5. ఉజ్వల పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్‌ను రూ. 450కి అందిస్తోంది. లాడ్లీ బెహనా లబ్ధిదారులతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు, ప్రత్యేక వెనుకబడిన తెగల (బైగా, భరియా, సహరియా) మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 6. స్కూటీ పథకం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల కోసం స్కూటీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 12వ తరగతి టాపర్లు స్కూటీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తుంది. 7. మహిళా జర్నలిస్టులకు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్తో పాటు చిన్న వార్తాపత్రికలకు ప్రకటనల హామీని కూడా ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం ఐదుగురు మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్ అందజేస్తారు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్‌నాధ్ అధ్యక్షతన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతిరాధిత్య ‘సింధియా టైగర్ అభి జిందాహై’ (టైగర్ ఇంకా బతికే ఉంది) అంటూ వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన కమల్‌నాధ్ ‘ఏ టైగర్ బతికి ఉంది. పేపర్ మీద ఉన్నదా? సర్కస్‌లో ఉన్నదా?’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన దేశంలో రెండు రకాల గుర్రాలు ఉంటాయని, ఒకటి పెళ్లి ఊరేగింపులో ఉండేది, మరొకటి రేసులో ఉండేది అంటూ కమల్‌నాధ్ వ్యాఖ్యానించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్రమోదీ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) తాను టీ ఎప్పుడూ అమ్మలేదు అన్న కమల్‌నాధ్ ... కొంతమంది తమకు తాము టైగర్స్ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసని అన్నారు.ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ గురించి మాట్లాడుతూ, అది బేరసారాల ప్రభుత్వమని, అందులో ఉన్నవారు ఎమ్మెల్యేలు కాదని, బేరమాడి కొనుకున్నవారు అని కమల్‌నాధ్ అన్నారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) -
శభాష్.. శివరాజ్..!
‘గెలుపైనా.. ఓటమైనా... నేను భయపడను.కర్తవ్య నిర్వహణ పథంలో ఏది ఎదురయినా దాన్ని స్వీకరిస్తాను’ సీఎం పదవికి రాజీనామా చేసే ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు 2018 ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్న మాటలివి. శివ మంగళ్ సింగ్ అనే కవి రాసిన కవితలోని పంక్తులివి. గత పదిహేనేళ్లుగా అనుభవిస్తున్న ముఖ్యమంత్రిత్వం చేజారిపోయిందన్న బాధ ఆయనలో కనిపించడం లేదు. తన కుర్చీని లాక్కున్న ప్రతిపక్షంపై ఆగ్రహమూ వ్యక్తం చేయ లేదు.ఓటమికి సాకులు వెతకలేదు. స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంత చిత్తంతో పదవి నుంచి హుందాగా తప్పుకున్న చౌహాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తానే వహిస్తున్నట్టు చెప్పారు. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. ఒక కుటుంబ సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్నదే తన కోరికన్నారు. తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కూడా కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ట్రై చేద్దాం తాజా ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఏ పార్టీకీ కూడా సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుదామని బీజేపీ అధినాయకత్వం చౌహాన్‌కు సూచించింది. అయితే, ప్రజలు మనకు మెజారిటీ ఇవ్వలేదు, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కులేదు అన్ని స్పష్టంగా చెప్పడం చౌహాన్ నిజాయితీకి నిదర్శనం. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన తర్వాత ఇప్పుడు నేను హాయిగా ఉన్నానని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘నా రాజీనామాను గౌరవనీయ గవర్నర్‌కు అందజేశాను. ఈ ఓటమి బాధ్యత పూర్తిగా నాదే. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ను అభినందిస్తున్నాను’ అన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటు వేసినందుకు ఓటర్లకు ట్విట్టర్లో కృతజ్ఞతలు కూడా చెప్పారు. ‘మీరు చూపించిన అపరిమిత ఆప్యాయత, విశ్వాసాలను, మీ దీవెనలను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన 59 ఏళ్ల చౌహాన్‌ను రాష్ట్ర ప్రజలు అభిమానంతో మామ అని పిలుచుకుంటారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతితో నిండిన ప్రస్తుత రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ అవలక్షణాలు ఏమాత్రం అంటని సచ్చీలుడు చౌహాన్. చౌహాన్‌కు అభినందనల ట్వీట్లు ప్రజల ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించారు. ప్రజాభీష్టం ఏమిటో తెలిసి ప్రశాంతంగా అధికార మార్పిడికి సిద్దపడ్డారు. -సాగరిక ఘోష్, సీనియర్ జర్నలిస్ట్ మధ్య ప్రదేశ్ ప్రజల తీర్పును గౌరవిస్తూ కర్ణాటకలోలా బేరసారాలకు దిగకుండా హుందాగా తప్పుకోవడం ద్వారా చౌహాన్‌జీ మన అత్యంత హుందాగల రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిరూపించుకున్నారు. వాజ్‌పేయి మలిచిన బీజేపీ నాయకుడాయన. -శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నప్పుడు ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ చౌహాన్జీని ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో హుందాగా, సౌమ్యంగా మాట్లాడతారని, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. మన్మోహన్జీ మాటలు నిజమేనని చౌహాన్ ఈ రోజు నిరూపించారు. -అల్కా లాంబ, ఢిల్లీ ఎమ్మెల్యే (ఆమ్ ఆద్మీ పార్టీ) -
ఎంపీలో హ్యాట్రిక్ దిశగా చౌహాన్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ముచ్చటగా మూడోసారి కూడా ‘కమలం’ వికసించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ ఎన్నికలతో ‘హ్యాట్రిక్’ సాధించే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి సీట్లు కొన్ని తగ్గినా, అధికారానికి కావలసిన సీట్లు బీజేపీకి సునాయాసంగానే వస్తాయని చెబుతున్నాయి. ఆర్థిక రంగంలో సాధించిన అభివృద్ధిని, సుపరిపాలనలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌కు ఈసారి కూడా అధికారం అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, ఇటీవల దంతెవాడ ప్రాంతంలో తమ పార్టీ నేతలపై జరిగిన మావోయిస్టుల దాడి నేపథ్యంలో సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపు 55 శాతం ఉన్న అగ్రకులాలు, ఓబీసీలలో అత్యధికులు ఈసారి కూడా బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉండటంతో, బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లలో గిరిజనులు 19 శాతం, ముస్లింలు 10 శాతం ఇదివరకు కాంగ్రెస్ వైపు ఉండేవారు. పదేళ్ల కిందట ఈ వర్గాల్లోనూ పట్టు కోల్పోయిన కాంగ్రెస్, తిరిగి ఈ వర్గాలను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈసారి కూడా శివరాజ్‌సింగ్ చౌహాన్ కాగా, కాంగ్రెస్ ఇంతవరకు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లో మునిగిపోవటంతో రాష్ట్రంలో ఒక విధమైన నాయకత్వ శూన్యత కాంగ్రెస్‌ను పీడిస్తోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవాలని కాంగ్రెస్‌లోని ఒకవర్గం నేతలు భావిస్తున్నా, ఇంతవరకు అధిష్టానం ఈ అంశంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథిగా జ్యోతిరాదిత్యను ముందుకు తేవటంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి చౌహాన్ ‘లౌకిక’ ముద్ర కోసం కూడా తాపత్రయపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హజ్‌హౌస్‌కు శంకుస్థాపన చేయడం, ఈద్-ఉల్-ఫిత్ ్రవేడుకల్లో ముస్లిం టోపీ ధరించడం, ముఖ్యమంత్రి కన్యాదాన పథకం కింద ముస్లిం యువతులకూ పెళ్లిళ్లు చేయించడం వంటి చర్యల ద్వారా ముస్లిం ఓటర్లకు చేరువయ్యే యత్నాలు సాగిస్తున్నారు. ‘కాషాయ’ పార్టీకి ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయబోరని, వారు తమవైపే ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, బీజేపీ నేతలు వారి వాదనను తోసిపుచ్చుతున్నారు. చౌహాన్ పాలనలో రాష్ట్రంలోని ముస్లింలు కూడా హిందువులతో సమానంగా లబ్ధి పొందుతున్నారని, ఎన్నికల్లో వారు తమకే అండగా నిలుస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలలో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. రాజధాని భోపాల్ నగరం పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 42 శాతానికి పైగానే ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లింల ప్రాబల్యం గల మిగిలిన స్థానాలను చూసుకున్నా, వాటిలో ప్రస్తుతం 60 శాతం స్థానాలు బీజేపీ అధీనంలోనే ఉన్నాయి. భోపాల్ ఉత్తర నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ అధీనంలో ఉంది. ఆరిఫ్ అకీల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఈ సీటు బీజేపీకి దక్కుతుందా లేదా అనేదానిపైనే ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా, గత 2008 ఎన్నికల్లో బీజేపీ 21 స్థానాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందింది. మధ్యప్రదేశ్ ఎన్నికల తేదీ: నవంబర్ 25 ఓటర్ల సంఖ్య: 4.65 కోట్లు ప్రస్తుత అసెంబ్లీలో బలాబలాలు పార్టీ సీట్లు బీజేపీ 143 కాంగ్రెస్ 71 బీఎస్పీ 7 భారతీయ జనశక్తి 5 సమాజ్‌వాదీ పార్టీ 1 స్వతంత్రులు 1 మొత్తం 230