స్మార్ట్ కార్డు పథకాన్ని నిలిపేసిన రవాణాశాఖ
- ముగిసిన పాత కాంట్రాక్ట్ గడువు
- అయినప్పటికీ టెండర్లు పిలవని ప్రభుత్వం
- విధిలేక సీబుక్‌ల జారీ
సాక్షి, వాహనాల భద్రత కోసం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు పథకాన్ని రవాణా శాఖ నిలిపివేసింది. పాత కాంట్రాక్ట్ గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించ లేదు. గతంలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని పుస్తకం రూపంలో జారీ చేసింది. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఓ ద్వారా జారీఅయ్యే పత్రాలు మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వాటి స్థానంలో స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించి అర్హతగల కంపెనీకి 2006లో కాంట్రాక్టునిచ్చింది. దీని గడువు జూన్‌లోనే ముగిసినప్పటికీ నవంబరు వరకు పొడిగించింది. అయితే ఆ గడువు కూడా పూర్తి కావడంతో డిసెంబరు నుంచి నగరంలో ఉన్న మూడు ఆర్టీఓల నుంచి స్మార్ట్ కార్డులు జారీ కావడం లేదు.
పాత పద్ధతి ప్రకారం తాత్కాలికంగా పుస్తకం రూపంలోనే ఇస్తున్నారు. ఇందువల్ల వాహనాలు కనుక చోరీకి గురైతే నకిలీ పత్రాల ద్వారా ఇతరులకు విక్రయించడం ఎంతో తేలికవుతుంది. అదే స్మార్ట్ కార్డు ఉంటే పట్టుబడే ప్రమాదం ఉంటుంది. దీంతో అప్పట్లో ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి గడువు ముగియకముందే కొత్తగా టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది.
అధికారుల నిర్లక్ష్యంవల్ల ఇంతవరకు ఆ ప్రకియకు శ్రీకారం చుట్టలేదు. దీంతో చేసేది లేక ఆర్టీఓ సిబ్బంది వాహన యజమానులకు తాత్కాలికంగా సీ బుక్కులను జారీ చేస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ కనుక తిరిగి ప్రారంభమైతే మళ్లీ ఆర్టీఓకి వెళ్లాల్సిందే. వారు అడిగినంత రుసుం మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. అధికారుల అలసత్వంవల్ల రెండు విధాలా నష్టపోవల్సి వస్తోందని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.