Sobhanagireddy
-
అవన్నీ అవాస్తవాలు: భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి
సాక్షి, ఆళ్లగడ్డ: భూ వివాదానికి సంబంధించి టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్డులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపించారు. భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి దీనిపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రెట్టింపు అయింది. అయితే స్థలం అమ్మే సమయానికి తాను మైనర్‌నని, తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితో పాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని, ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కావాలని కోరుతూ జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల చందు రేటూరి, సయ్యద్ ఎతేష్యామ్ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు. కాగా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది (భార్గవరామ్ తమ్ముడు) శ్రీసాయి చంద్రహాస్ కేసు వేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన సోదరుడు తమపై కేసు వేయలేదని అఖిలప్రియ అన్నారు. భూ విక్రయంపై కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లారని, అందులో భాగంగా తమకు తాఖీదులు వచ్చాయన్నారు. మరోవైపు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం సోదరి అఖిలప్రియతో కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు చెప్పారు. -
టీఆర్ఎస్కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్కు సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశానికి వస్తే ఫలితముండేదన్నారు. బీఏసీలో టీడీపీ సభ్యులు ద్వంద్వవైఖరి అవలంబించారని విమర్శించారు. బీఏసీలో తాము సమైక్య వాణి వినిపించినట్లు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై రేపటి చర్చను అడ్డుకుంటామని శోభానాగిరెడ్డి హెచ్చరించారు. -
నిలదీయాల్సిన బాబు లేరు: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు కారణంగా ఈరోజు శాసనసభ జరిగిన తీరును దృష్టిలోపెట్టుకొని సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి మండిపడ్డారు. ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రిది చేతగానితనం అని విమర్శించారు. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు సభలోలేరని ఆమె అడిగారు. సభ అనుమతి లేకుండా బిల్లును తీసుకురావడాన్నితాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సభలో సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో కనుక్కునే వారు లేరని బాధపడ్డారు. బీఏసీ పెట్టిన తర్వాత బిల్లును చర్చకు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దారిమళ్లించడానికి టీడీపీ కుట్ర చేస్తుందని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి ఆరోపించారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబంపై అడ్డగోలు వార్తలు రాపిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే, సిఎం రమేశ్ శాశ్వతంగా పదవి నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. తమని ఎన్ని తిట్టిన పర్వాలేదని చంద్రబాబు విభజన లేఖను మాత్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి చంద్రబాబు ముందుకు వస్తే తాము కూడా సహకరిస్తామని శోభానాగిరెడ్డి చెప్పారు. -
20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 20న వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధుల ధర్నా నిర్వహిస్తున్నట్లు శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి చెప్పారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి అసెంబ్లీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర జరుపుతామని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్,టీడీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆంటోనీ కమిటీ మీ దగ్గరకు వస్తుందని, రాష్ట్రం ఎలా విడిపోతుందో అప్పుడు చూద్దాం అని ఆమె అన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులు వీడాలి, ప్రజాభీష్టాన్ని గౌరవించాలన్నారు. తమ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. సీమాంధ్రలో మాత్రం విభజనకు వ్యతిరేకం అంటున్నారు. తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో మరోవిధంగా వ్యవహరించడం మీ విధానమా? అని అడిగారు. చంద్రబాబూ.. అసలు మీ పార్టీ వైఖరేంటి? అని ప్రశ్నించారు. ఇల్లు గడవకపోయినా సీమాంధ్ర ప్రజలు రోడ్డపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజల ఆవేశాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. తన విధానాలతో చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ.. మీ అనుభవమంతా ఏమైంది? అని అడిగారు. మీ అనుభవమంతా కుట్రలు చేయడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. మీ అనుభవమంతా ఉపయోగించి విభజన ఆపండని శోభానాగిరెడ్డి కోరారు. -
జ్ఞాపక శక్తి కోల్పోయిన చంద్రబాబు:శోభానాగిరెడ్డి
కర్నూలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జ్ఞాపక శక్తి కోల్పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు విభజనన్న బాబు కొత్త రాజధానికి 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారు, ఇప్పుడు యూటర్న తీసుకుని సమైక్యాంధ్ర అంటున్నారన్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ సర్వేకు జీవో 72ను విడుదల చేశారు. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు జలాలపై ఆధారపడుతున్న రాయలసీమను ఆదుకోవాలని కోరారు. జీవో వెనక్కి తీసుకునేంతవరకు రాయలసీమ మంత్రులు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్‌లను నిలదీయాలన్నారు. రాయలసీమకు నీళ్లు అందేంతవరకు వైఎస్ఆర్ సీపీ న్యాయపోరాటం చేస్తుందని హెచ్చరించారు.