'ఆయన మృదుస్వభావి కాదు.. ముదురు స్వభావి'
- కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై మంత్రి జూపల్లి విసుర్లు
సాక్షి, హైదరాబాద్: తమ పాలనా కాలంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ రెండు పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు కడిగేసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదన్నారు.
ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జూపల్లి.. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో జరిగిన సంఘటనపై స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంమ్మోహన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కులం పేరుతో దూషించడం వల్లే గొడవ జరిగిందని, ఈ సంఘటనను అడ్డం పెట్టి కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న తంతు కుళ్లు రాజకీయాలను తలపిస్తోందని విమర్శించారు.
వ్యక్తిగత అంశానికి జిల్లా బంద్‌కు పిలుపు ఇస్తారా..? గవర్నర్‌ను కలుస్తారా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మృదు స్వభావి అని సిఎల్పీ నేత జానారెడ్డి కితాబు ఇవ్వడం దారుణమని, రాంమోహన్‌రెడ్డి ముదురు స్వభావి అని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటనను టీడీపీ నాయకులు విమర్శించడం విడ్డూరమని, టీడీపీ నేతల మాదిరిగా దోపిడి చేసిన సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు విహార యాత్రలు చేసే సంస్కృతి టీఆర్ఎస్కు లేదన్నారు. కొద్ది నెలల్లోనే ఏపీ సీఎం రూ.22కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో పర్యటించిన అంశాన్ని టీడీపీ నేతలు మాట్లాడాలని జూపల్లి డిమాండ్ చేశారు.