spcial status
-
బాబు ప్రగల్భాలకు ఇక చెల్లుచీటీ
ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు అతి ప్రధాన శత్రువైన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడగల సమర్థుడిని నేనే.. నేనే.. అంటూ ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు కొన్ని నెలలుగా ఇంటా బయటా ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు. పైగా మోదీపై తాను విరుచుకుపడుతున్నట్లు వైఎస్ జగన్ విరుచుకుపడటం లేదని బాబు ఆరోపణ. కానీ ప్రజల కోసం మాటతప్పనని, తాననుకున్న ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి తీరుతానని, తన తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడవడమే కాకుండా, మరింత నిబద్ధతతో, మరింతగా ప్రజాశ్రేయస్సు మార్గాన పయనిస్తాను అని హుందాగా, ధైర్యంగా ప్రకటించిన యువనేత జగన్. ఆయన ఔచిత్యం ముందు బాబు ఉన్మత్త ప్రేలాపనలు అపహాస్యం పాలవుతున్నాయి. ‘ఇలాగే ఐటీ దాడులు, ఈడీ సోదాలు సాగిస్తుంటే మోదీని రాజకీయంగా ఫినిష్ చేస్తాను’ అంటున్న బాబు ప్రగల్భాలకు మే 23తో తెరపడనుంది. ఇటీవల ఆపద్ధర్మ (నిజానికి అధర్మ) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గమనిస్తున్న వారికెవరికైనా ఆయనకు చిత్తచాంచల్యం, డిమెన్షియా (మతిమరుపు, అప్రస్తుత, హేతురహిత ప్రసంగాలు), నార్సిజం (తానే ప్రపంచంలో గొప్పవాడిననీ, తన నీడకు కూడా ఎవరూ సరిపోలరనీ భావించడం) ఇంకెవరికైనా తనకంటే ఏ విషయంలో అయినా గొప్పవాడంటే భరించలేకపోవడం (సెల్ఫ్ ఎస్టీమ్డ్ పర్వర్షన్) ఇలా పలు మానసిక సంబంధ రుగ్మతల్లో దేనితోనైనా లేక అన్నింటితోనైనా బాధపడుతున్నారని అనిపిస్తుంది. మరీ సన్నిహితులు బాగా గ్రహించగలుగుతారు కానీ ఇంకా ఇలాంటివారితో తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవలసి ఉందనుకునే ఆశ్రితులు మాత్రం తమ నేత పై రుగ్మతలతో ఏది మాట్లాడినా, మాయాబజార్లో దుశ్శాసనుడు ‘సెభాష్ మామా, సెభాష్.. అదే మన తక్షణ కర్తవ్యం’ అని శకునికి వంతపాడినట్లు తమ నేతను పొగడుతూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాస్త హేతుబద్ధంగా వివరించబూనుకుంటే ఆ నేత శిరచ్ఛేదన వంటి శిక్ష విధించలేడు గనుక తత్సమానమైన శిక్షతో అలా వివరించబూనిన ఆశ్రితుడిని అణగదొక్కే యత్నం చేస్తారు. గతంలో తెలంగాణ టీడీపీ దళితనేత మోత్కుపల్లి నర్సింహులు అందుకు మంచి ఉదాహరణ. ఆ సత్యం గ్రహించిన లౌక్యులు వర్ల రామయ్య వంటివారు బాబుకు వంతపాడుతూ, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతున్నారు. అయినా యూటర్న్ బాబు ఎప్పుడే టర్న్ తీసుకుం టాడో తామూ అదే యూటర్న్లు తీసుకుందామని సర్వవేళలా, ఆయన కనుసన్నల్లో కదలాడుతుంటారు ఆ ఆశ్రితుల్లో చాలామంది. ప్రధాని మోదీ నేడు ఏపీ ప్రధాన శత్రువనీ, మోదీకి వ్యతిరేకంగా పోరాడగల సమర్థుడు తానేనని ఏడెనిమిది నెలలనుంచీ బాబు చెబుతున్నారు. ఇంతకుముందు మోదీ వంటి మహోన్నత నేత ‘నభూతో నభవిష్యతి’ అని ఈయనగారే అన్నారన్న విషయం అటుంచుదాం కానీ టీడీపీ నేతలు సైతం వారికీ తప్పదు కనుక అంతేగా, అంతేగా అంటున్నారు. ఇంతగా మోదీపై ఆగ్రహం ఎందుకువచ్చిందో తెలుసా? చంద్రబాబే స్పష్టంగా చెప్పారు. ‘ఇలాగే ఐటీ దాడులు, ఈడీ సోదాలు సాగిస్తుంటే మోదీని రాజకీయంగా ఫినిష్ చేస్తాను’ అన్నారాయన. ఇలా ఫినిష్ చేస్తాను అనడం ఆయన ఆగ్రహ తీవ్రతను తెలియచేస్తుంది. ఇప్పుడు మోదీని రాజకీయంగా ఫినిష్ చేస్తారట. మోదీ ఐటీ దాడులను, ఈడీ సోదాలను తన బినామీలపై, తన ఆశ్రితులపై ఆపితే ఫినిష్ చేయరన్నమాట. గతంలోలాగే మోదీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారన్నమాట. నాలాంటి అమాయక చక్రవర్తులు మాత్రం మోదీ తన మెజారిటీ మతతత్వ ధోరణితో దేశాన్ని మెజారిటీ–మైనారిటీ అనే విభజన చేసి మరోసారి భారత్‌ను విచ్ఛిన్నం చేస్తారని భయపడుతున్నారు. ఈ విషయంలో బాబు మోదీని నిలదీయరు సరికదా.. 2014 ఎన్నికల్లో ఒక్క మైనారిటీ వ్యక్తినయినా తన తెలుగుదేశం పార్టీ తరపున విభజనానంతర ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టకుండా చేసి మోదీ తాత్వికతను ఆచరణాత్మకంగా అనుసరించి, మోదీ భక్తిని చాటుకున్నారు. ఇక మోదీ తనవంతుగా ఆర్ఎస్ఎస్ మతతత్వంతో మతితప్పి మాట్లాడుతున్న వారిని నిస్సంకోచంగా వెనకేసుకొస్తున్నారు. మాలెగావ్ మెజారిటీ మతోన్మాద దాడుల్లో నిందితులను పట్టుకోవడంలో తీవ్రంగా శ్రమించడమే కాకుండా, ముంబై ఉగ్రవాద దాడుల్లో ఉగ్రవాదుల కాల్పులకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం వల్లే మరణించాడని బాహటంగా ప్రకటించిన సాధ్వి ప్రజ్ఞను, నోరుతెరిస్తే పరమత ద్వేషంతో ప్రసంగించే యూపీ సన్యాసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటివారిని మోదీ వెనకేసుకొస్తున్నారు. లౌకికరాజ్యంలో ఇలాంటి మతోన్మాద కువిమర్శకులపై చర్య తీసుకునే బదులు వారిని మోదీ సమర్థించడం కుదరదు. మోదీని రాజకీయంగా ఫినిష్ చేస్తాను అని చంద్రబాబు బెదిరించడం తప్ప మోదీని ఈ కోణంలో పల్లెత్తుమాట అనరు. మోదీ పాలనలో మన లౌకికరాజ్యాన్ని పొరుగున ఉన్న పాకిస్తాన్ లాగా మతతత్వ రాజ్యంగా మార్చే తీవ్ర ప్రయత్నం చేసినా బాబు ఉలకరు. ఐటీ దాడులు, ఈడీ సోదాలు తనపై, తనవారిపై జరగకుండా ఉంటే చాలు. తన సంపూర్తి, సహాయ సహకారాలను బాబు.. మోదీకే అందించగలరన్నమాట. మోదీ ఈ ఎన్నికలలో గెలవడమే ప్రధానమైనట్లు అందుకు వాడుకునేందుకు కాదేదీ అనర్హం అంటున్నట్లు వ్యవహరిస్తారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అమర జవానుల శవాలను కూడా తన రాజకీయ ప్రయోజనం కోసం మోదీ వాడుకుంటూ ఆ అమర జవానులకు అంకితం చేస్తూ వారికోసం మీ ఓటు వేయండి అంటూ అమరవీరుల పేరుమీద బీజేపీకి ఓటు అడిగేంతగా దిగజారిన మోదీని మన చంద్రబాబు ఏమాత్రం నిలదీయరు. మన సైన్యం మన లౌకిక రాజ్యానికి నిబద్ధతతో ఉంటుంది కానీ అల్పత్వంతో ఎన్నికల్లో ఒక పార్టీకి కొమ్ముకాసే కిరాయి దళాలు కావంటూ చంద్రబాబు మోదీని విమర్శించలేరు. ఈయన నైజమే అది. ప్రధాని సైన్యాన్ని కూడా రాజకీయం చేస్తారా, ఇంతటి దివాళాకోరుతనమా అని చంద్రబాబు.. మోదీ కాలర్ పట్టుకోరు. రేపు ఖర్మం చాలక తిరిగి మోదీ ప్రధానమంత్రి అయితే, ఇంకేమన్నా ఉందా? తన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, సెక్స్ రాకెట్ కుంభకోణాలు ఇలాంటి వందలాది ఘటనలపై సత్వర విచారణ జరిపించి న్యాయస్థానాల ద్వారా తనకు జైలు శిక్ష విధిస్తే... తన తదనంతరం తన పుత్రుడికి కూడా ఇదే గతి పట్టిస్తే.. పైగా మోదీ వ్యవస్థలను వాడుకోవడంతో ఎవరికీ తీసిపోరు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే తనపై 17 కేసులను విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకోగలిగినప్పుడు, తనకంటే కుటిల విద్యలో రెండాకులు ఎక్కువే చదివిన మోదీ ప్రధాని హోదాతో కోర్టు ద్వారానే అంతటి శిక్ష వేయిస్తాడేమో.. ఈ కోణంలో ఓట్ల కోసం మోదీ అవలంబిస్తున్న పతనమార్గాన్ని ఎత్తిచూపి, ‘ఇలా చేస్తే నిన్ను రాజకీయంగా ఫినిష్ చేస్తాను’ అని చంద్రబాబు అనగలరా? అందుకే ఐటీ దాడులు, ఈడీ సోదాలు తన బినామీలపై, తన ఆశ్రితులపై సాగిస్తుంటే మాత్రం మోదీని రాజకీయంగా ఫినిష్ చేస్తానని బాబు ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన సమయంలో కేంద్రం, మోదీ చేసిన అన్యాయాల్లో మొదటిది.. వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం. అప్పుడే ప్రత్యేక హోదా వచ్చి ఉన్నట్లయితే, పరిశ్రమల స్థాపన కారణంగా బాబు, ఆయన అంతేవాసుల రియల్ ఎస్టేట్ దందాకు ఇంత అవకాశం ఉండేది కాదు. ఇన్నేళ్లుగా ప్రత్యేక హోదాపై మౌనంగా ఉండటమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ అంటే అదే మహాప్రసాదమని ప్రకటించారు బాబు. పైగా నాలుగున్నరేళ్లుగా బాహుబలి పత్రికా ప్రకటనల బొమ్మల రాజధానిని చూపించి, ఒక్క శాశ్వత రాజధాని భవనాన్ని కూడా ప్రారంభించని చంద్రబాబు ఇప్పటికైనా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నిన్ను రాజకీయంగా ఫినిష్ చేస్తానని ప్రకటించగలిగారా? పైగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం.. ఐటీ దాడులు, ఈడీ సోదాలు తనపై, తనవారిపై జరపకుండా ఉంటే మోదీ ముందు మళ్లీ సాగిలపడేందుకు బాబు సిద్ధమే. పైగా మోదీపై తాను విరుచుకుపడుతున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడటం లేదని బాబు ఆరోపణ. నలభై ఏళ్ల అనుభవం (ఎందుకు? ప్రజలను వంచించడానికా?) ఉన్నదని ఆయనకు బ్యాండ్ బాజా వాయించేందుకు సిద్ధంగా ఉన్న సొంత మీడియా ఎంతగా పొగిడినా, అది చంద్రబాబు అసమర్థతకు చిహ్నం కాదా? మరోవైపున చిన్నవాడైన వైఎస్ జగన్ తెలుగుదేశం అధినేతలాగా వట్టిమాటలతో కాలక్షేపం చేయకుండా, నిర్దిష్టంగా ప్రత్యేక హోదా కోసం పోరాడినవాడు. ఆయన పార్టీయే కాదు.. స్వయంగా జగనే ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యమాలు చేశారు. హోదా ప్రాధాన్యం గుర్తించినందుకే కోతికొమ్మచ్చి గంతులెయ్యకుండా రేపు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాని ఏపీకి ఇచ్చే బిల్లుపై సంతకం చేస్తే ఆ ప్రభుత్వానికే వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని జగన్ చెప్పారు. పైగా మా రాష్ట్ర ప్రయోజనం మా నిర్ణయాలకు గీటురాయి. మన రాష్ట్ర పురోగమనం కోసం సహకరించే అందరితో ప్రత్యేకంగా మన పొరుగు రాష్ట్రాలతో అందునా మన తెలుగుజాతి ఉన్న మరో రాష్ట్రమైన తెలంగాణతో సఖ్యతతో ఉంటాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం వారి మద్దతు కోరతాం.. అని నిస్సందేహంగా, నిజాయితీగా బహిరంగంగా జగన్ ప్రకటించారు. ప్రజల కోసం మాటతప్పనని, మడమ తిప్పనని, తాననుకున్న ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి తీరుతానని, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవడమే కాకుండా, అంతకు తీసిపోకుండా మరింత నిబద్ధతతో, మరింతగా ప్రజాశ్రేయస్సు మార్గాన పయనిస్తాను అని హుందాగా, ధైర్యంగా ప్రకటించిన యువనేత జగన్. ఆ యువనేత ఔచిత్యం ముందు చంద్రబాబు ఉన్మత్త ప్రేలాపనలు అపహాస్యం పాలవుతున్నాయి. ‘‘కానీ చిరకాలమున్ననే కార్యమగును’’ అన్నది మన చంద్రబాబుకు వర్తిస్తుంది. అయితే మన తెలుగు ప్రజల చొరవ, చైతన్యం, అదృష్టం ఫలితంగా బాబు గారి పదవీభ్రష్టత్వం మే 23న తిరుగులేని సత్యం అని తేలబోతోంది. మోదీతో చంద్రబాబు లాలూచీ కుస్తీ అందరం చూసిందే కదా! ఇక ఇలాంటి ఆటలు సాగవు.. సత్యమేవ జయతే! వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు డాక్టర్ ఏపీ విఠల్ ‘ మొబైల్ : 98480 69720 -
‘లోకేష్ మాటలు వినడం మన ఖర్మ’
సాక్షి, గుంటూరు : 2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్సార్సీపీ నేత, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన చరిత్ర మీ కుటుంబానికి లేదు’ అని విమర్శించారు. ఒక్కసారి జగన్ సీఎం అయితే జీవితాంతం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భయం టీడీపీకి ఉందని ఎద్దేవా చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు. -
అసంబద్ధ వ్యాఖ్యల బాబుదే ‘యూటర్న్’
తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన పిదప ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయస్థాయి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో కొన్ని అసందర్భ విషయాల గురించి అతిగా మాట్లాడటం తెలంగాణవాదులమైన మా బోటి వాళ్లను తీవ్ర మనస్తాపం కలి గించింది. బాబు వినిపించిన మాటలనే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు తిరిగి వినిపించారు. అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుంచే ఇలాంటి అసందర్భ అనుచిత వాక్యాలు రావటం సహజం. అసలు మొత్తంగా వీళ్లు లేవనెత్తుతున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో పరిశీ లిద్దాం. 1.హైదరాబాద్ నా మానసిక పుత్రిక దానికి నేనే రూపమిచ్చా. 2. మోదీ, కేసీఆర్‌ల కన్నముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇద్దరు ప్రధాన మంత్రులను చేయడంలో నాదే కీలకపాత్ర. 3.మాది మెజారిటీ మైనార్టీలకు చెందిన విషయం కాదు మెజార్టీ మొరాలిటికి సంబంధించిన విషయం 4.యూటర్న్ తీసుకున్నది ఎవరు? ముందుగా హైదరాబాద్ నా మానసిక పుత్రిక, దానికి నేను రూపమిచ్చా అనే దాన్ని పరిశీలిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి పుట్టక ముందే ఇక్కడ అన్ని వసతులు, కీలక సంస్థలు నిజాంల కాలంలోనే నెలకొల్పారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలో వెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? ‘‘మీ కంటే నేనే సీనియర్‌ను. మోదీ, కేసీఆర్లకన్న ముందే నేను సీఎంని అయ్యా’! అనే మాటల్లో వ్యక్తికి ఉండే అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపిం చటం లేదు. మీరు మోదీ, కేసీఆర్‌ల కన్న ముందే సీఎం అయిన్రు. కాని ఎట్ల అయిన్రు అన్నది ప్రశ్న. కుట్రజేసి మీ మామను గద్దెదించి గద్దెనెక్కిన వైనం ఎవరికి తెలువదని? రాజకీయాల్లో మీకున్న అనుభవమల్లా ఇదేనా? పైగా మీరు సీఎం అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అని మర్చిపోవద్దు. నైతిక విలువలను ఇతరులకు చెప్పేవాళ్లు కొంతలో కొంతైన తమ నిత్యజీవితంలో ఆచరించడం మంచిది. రాజకీయాలలో ఏ నైతిక నియమాలను పాటించి మీరు సీఎం అయ్యిన్రు. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మీ పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం నైతికమా? మొదట స్పెషల్ హోదాను కాదని స్పెషల్ కేటగిరీకి ఒప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పెషల్ హోదా కోరుతున్నది ఏ నైతిక విలువల ప్రకారం? తాను మొరాలిటి పక్షాన మెజారిటీపై పోరాడుతున్నానని తనది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తనతో అందరూ కలిసిరావాలని కోరడం జరిగింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వారిది ధర్మపోరాటం కాదట. కాని తన ఒక్కనిదే ధర్మపోరాటం అనడం ఆశ్చర్యకరం. తనతో కలసి వచ్చే వాళ్లు నీతిమంతులు, ధర్మకర్తలట. తనతో కలసిరాని వాళ్ళు అవినీతి పరులు, అధర్మకర్తలట. ఇక చివరగా వీరంటున్న యూటర్న్ గురించి చర్చిద్దాం. రాజకీయపార్టీలు తమ అవసరాన్ని ఇతర పార్టీలతో కలిసి జతకడుతూ ఉంటాయి. కానీ బాబులాగా యూటర్న్ మాత్రం తీసుకోవు. యూటర్న్ రాజకీయాలకు శ్రీకారం పడ్డది చంద్రబాబు ద్వారానే. గత ఎన్నికలలో ఎన్డీయేతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసి గెలిచి కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి తీరా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి కాంగ్రెస్ మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం యూటర్న్ రాజ కీయం కాదా? నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన కారకుడు బాబు, అతని యూటర్న్ అనైతిక రాజకీయాలు. తన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పులన్నింటిని ఇతరులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే అతను కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చింది. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ ప్రజలను పోరాటానికి రమ్మని పిలుపునివ్వటం బాధ్యతారాహిత్యమే. గత నాలుగేళ్లుగా ఏపీ సమస్యలపైనా దాని అభివృద్ధి పట్ల దృష్టి సారించక ఈ రోజు మేల్కొని పోరాటానికి పిలుపునివ్వటం, ప్రజ లను తనతో కలిసి రావాల్సిందిగా కోరటం విచారకరం. బాబు ఇప్పటికైనా అనవసరమైన రాద్ధాంతాల జోలికి పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం. ప్రొ‘‘ జి.లక్ష్మణ్, వ్యాసకర్త అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 98491 36104 -
సినీ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర
సాక్షి, తిరుపతి : తన తల్లి మీద చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె శనివారం చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలుగు సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ఇండస్ట్రీని బద్నామ్ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు హోదా రాకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు దొంగ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. బాబు దీక్ష సందర్భంగా మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
ధర్మపోరాట దీక్షలో పాల్గొననున్న మంత్రులు
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొననున్నారు. మిగతా మంత్రులు చంద్రబాబు దీక్షా శిబిరంలో పాల్గొననున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, విజయనగరంలో సజయ, విశాఖలో అయ్యన్న, తూర్పుగోదావరిలో చిన్నరాజప్ప, పశ్చిమగోదావరిలో జవహర్, గుంటూరులో పత్తిపాటి, ప్రకాశంలో శిద్దా, నెల్లూరులో సోమిరెడ్డి, కర్నూలులో కేఈ, అఖిల ప్రియ, కడపలో ఆదినారాయణ రెడ్డి, అనంతరపురంలో పరిటాల సునిత, చిత్తూరులో అమర్నాధ్ రెడ్డిలు దీక్షలో పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు దేశినేని, కొల్లు రవీంద్రలు చంద్రబాబుతో కలిసి దీక్షలో కూర్చోనున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు 12 గంటల దీక్షకు దిగుతున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు విజయవాడలోని బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ దీక్షను చేపట్టనున్నారు. -
అవినీతికి కేరాఫ్ చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చోడవరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరత్నాలు కమిటీ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. విశ్వసనీయతకు, రాజకీయ నిబద్దతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి సత్యారావు, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరదు కల్యాణితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. -
శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ
విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. -
ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే
సీమకు ఖర్చు చేస్తారన్నది అనుమానమే ఏపీ సివిల్ సొసైటీ ప్రతినిధుల సదస్సులో కుసుమకుమారి తిరుపతి సిటీ : కేంద్రం నుంచి వచ్చిన ప్రతి సహాయమూ కోస్తా జిల్లాల వైపే వెళుతోందని, రాయలసీమ వైపు రాని వ్వడం లేదని ఎస్కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ పి.కుసుమకుమారి అన్నారు. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి వైపే ఉందని, ప్రత్యే హోదా, ప్రత్యేక ప్యాకేజీల్లో రాయలసీమకు ఎంత ఖర్చు చేస్తారన్నది అనుమానమేనని పేర్కొన్నారు. ఏసీ సివిల్ సొసైటీ ప్రాంతీయ సదస్సు తిరుపతి యూత్ హాస్టల్లో జరిగింది. సదస్సును ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన ఏపీ సివిల్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు. అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మళ్లీ అభివృద్ధిని కేంద్రీకరించడం బాధాకరమన్నారు. ఏపీ సివిల్ సొసైటీ ప్రాంతీ య కన్వీనర్ భూమన్ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని తెలి పారు. శివరామకృష్ణన్ నివేదికను కూడా లెక్కచేయకుండా భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతంలో రాజధాని కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల కోస్తా జిల్లాల వారంతా తనకు ఓట్లేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేస్తున్నారని ఆరోపించా రు. సీమలో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వలసపోతున్నారని సీనియర్ జర్నలిస్ట్ జగన్నాథనాయుడు తెలిపారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల పంట పొలాలను లాగేసుకున్నారని, మరో 55వేల ఎకరాల అటవీ భూమిని తీసుకోబోతున్నారని, భవిష్యత్తులో ప్రాణవాయువు కూడా కరువైపోతుందని అన్నారు. నీటి వాటా సాధనలో సీమ వెనుకబడడం వల్ల భాషాపరంగా, సాంస్కృతికంగా సీమ వాసులు చిన్నచూపునకు గురవుతున్నారని మరో సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ అన్నా రు. ఇన్ని అన్యాయాలు చూశాక విడిపోదామన్న బలమైన కోర్కె మేధావుల్లో, చదువుకున్న వారిలో కలుగుతోందని సామాజిక కార్యకర్త పురుషోత్తంరెడ్డి అన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సుబ్రమణ్యంరెడ్డి, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, గ్రామ వికాస సంస్థ ప్రతినిధి రాంబా బు, హేతువాది ఊట్ల రంగనాయులు, చలపతి, రామ్మూర్తి, వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ సొదుం రమణారెడ్డి, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు.