రాజరాజేశ్వరిగా వనదుర్గ
అమ్మవారికి ప్రత్యంగిర హోమం
ముగిసిన శ్రావణమాస పూజలు
అన్నవరం :
రత్నగిరి వనాన్ని రక్షించే వనదుర్గ అమ్మవారికి గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రావణమాస పూజలు గురువారం ప్రత్యంగిర హోమం, పూర్ణాహుతితో ముగిశాయి. వనదుర్గమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, ఏడు గంటలకు ప్రత్యేక పూజలు, అనంతరం నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణ, సూర్యనమస్కారాలు, లింగార్చన, బాల, కుమారీ, సువాసినీ తదితర పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి కావడంతో అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఈఓ నాగేశ్వరరావు దంపతులు హోమద్రవ్యాలను సమర్పించారు. వేదపండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించి, వేదాశీస్సులందచేశారు. అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారికి కుంభం పోసి గుమ్మడికాయతో దిష్టి తీశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వెంకట్రావు, తదితరులు పూజాదికాలు నిర్వహించారు.