పాఠశాల విద్యలో ‘రా’
సైన్స్, మ్యాథ్స్లకు ప్రాధాన్యమిస్తూ కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 12వ తరగతి వరకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యం పెంచుతూ, వాటిపై ఆసక్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (రా) పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అవసరమైన చర్యలపై ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ పథకం కింద సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ సబ్జెక్టులపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచి, ఆయా రంగాల వైపు వారిని మళ్లించాలని
స్పష్టం చేసింది.
నూతన పథకంలో భాగంగా కేంద్రం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలివి...
* 6 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయాలి.
* ముఖ్యంగా పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులకు ఆయా రంగాలకు సంబంధించిన అంశాలపై బోధన, స్టడీ టూర్లు, విజిటింగ్ల వంటి కార్యక్రమాలను నిర్వహించాలి.
* తరగతి బోధనే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు, ప్రయోగ పద్ధతులను అమలు చేయాలి.
* పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లను అభివృద్ధి పరచాలి. నాణ్యతా ప్రమాణాలు పెంచాలి.
* టీచింగ్ లెర్నింగ్ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చర్యలు చేపట్టాలి.
* ఉన్నత విద్యా రంగానికి చెందిన వారితోనూ పాఠశాలల్లో పాఠాలు చెప్పించాలి. టీచర్ సర్కిళ్లు, సైన్స్, మ్యాథ్స్ క్లబ్బులు ఏర్పాటు చేయాలి
* ఒలింపియాడ్ వంటి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి. స్కూళ్లలో సరిపడా సైన్స్, మ్యాథ్స్ టీచర్లను నియమించాలి.
పాఠ్యాంశాల రూపకల్పనకు కసరత్తు
ఈ కార్యక్రమాలన్నింటికీ అనుగుణంగా సిలబస్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా 11 విభాగాలకు చెందిన వివిధ అంశాల్లో మార్పులు అవసరమని జాతీయ విద్యా పరిశోధన, ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా రాష్ట్ర విద్యా పరిశోధన, ఎస్సీఈఆర్టీ కసరత్తు చేస్తోంది.