థామస్ కుక్-స్టెర్లింగ్ హాలిడేస్ విలీనం
ముంబై: పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ (ఇండియా), స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ ఇండియా విలీనం కాబోతున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 870 కోట్లు ఉంటుందని, ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి కాగలదని థామస్ కుక్ (టీసీఐఎల్) సంస్థ వెల్లడించింది. కొంత నగదుగాను, మరికొంత మేర షేర్ల రూపంలోనూ దశలవారీగా ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. తొలిదశలో స్టెర్లింగ్ మేనేజ్మెంట్ టీమ్ సహా ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి సుమారు 23 శాతాన్ని థామస్ కుక్ రూ.
176 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్హోల్డర్లలో స్టెర్లింగ్ చైర్మన్ సిద్ధార్థ మెహతా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఉన్నారు. అలాగే, ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ కోసం రూ.187 కోట్లు, ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ. 230 కోట్లు టీసీఐఎల్ వెచ్చిస్తుంది. మొత్తం మీద టీసీఐఎల్కి చెందిన ప్రతి 120 షేర్లకు.. స్టెర్లింగ్ సంస్థకి చెందిన 100 షేర్లు లభిస్తాయి. ఈ పరిణామాల దరిమిలా రెండు సంస్థల సగటు విలువ రూ.3,000 కోట్ల పైచిలుకు ఉంటుందని టీసీఐఎల్ ఎండీ మాధవన్ మీనన్ తెలిపారు. విలీనం తర్వాత స్టెర్లింగ్ సంస్థ కనుమరుగైనా బ్రాండ్ మాత్రం కొనసాగుతుందని వివరించారు. ఈ డీల్‌తో దేశవ్యాప్తంగా తమకున్న రిసార్ట్స్.. థామస్ కుక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని మీనన్ పేర్కొన్నారు.
థామస్ కుక్ కొన్నాళ్ల క్రితమే బెంగళూరుకు చెందిన ఐక్య అనే సంస్థలో 74 శాతం వాటాలను రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది. థామస్ కుక్ మాతృ సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్స్. దీని చైర్మన్ అయిన ప్రేమ్ వత్స హైదరాబాదీ కావడం గమనార్హం. సుమారు నెలన్నర రోజులుగా ఈ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రేమ్ వత్స భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగానే స్టెర్లింగ్‌తో ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం. మరోవైపు, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ 1987లో ఏర్పాటైంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లోని రిసార్ట్స్‌లో 1,512 గదులు ఉన్నాయి.