శాంసంగ్ నుంచి 44 కొత్త స్మార్ట్ టీవీలు
♦ ఒకే రోజు ఆవిష్కరణ
♦ ఎస్‌యూహెచ్‌డీ శ్రేణిలో రూ.24లక్షల టీవీ
న్యూఢిల్లీ: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం ఒక్కరోజే దేశీయ మార్కెట్లోకి 44 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటి ధరలు రూ.24వేల నుంచి రూ.24 లక్షల స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం 31 శాతం వాటాతో టీవీ మార్కెట్‌ను ఏలుతున్న ఈ కంపెనీ... ఈ ఏడాది చివరికి 35 శాతానికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ప్రీమియం టీవీల విభాగంలో తమకు 46 శాతం వాటా ఉందని, తాజా మోడళ్ల విడుదలతో ఇది 60 శాతానికి పెరుగుతుందని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటాని అన్నారు. వినియోగదారుల బడ్జెట్, వారి జీవన విధానానికి తగ్గట్టుగా ఈ టీవీలను రూపొందించామని, మార్కెట్ లీడర్‌గా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. 2016 అర్ధ సంవత్సరంలో టీవీ పరిశ్రమ వృద్ధి 12-15 శాతంగా ఉందన్నారు.
⇒ ఎస్‌యూహెచ్‌డీ బ్రాండ్ కింద శాంసంగ్ 4కే అల్ట్రా హెడ్డీ టీవీలను విక్రయిస్తుండగా... ఇదే శ్రేణిలో 49 అంగుళాల నుంచి 88 అంగుళాల సైజుల్లో తొమ్మిది టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.1,79 లక్షల నుంచి రూ.23.99 లక్షల వరకు ఉన్నాయి.
⇒ జాయ్ బీట్ శ్రేణిలో ఏడు టీవీలను ఆవిష్కరించింది. వీటి స్క్రీన్ సైజు 32 నుంచి 49 అంగుళాలుగా ఉండగా... ధరలు రూ.27,500 నుంచి రూ.69,500 స్థాయిలో ఉన్నాయి.
⇒ మిగిలినవన్నీ 32-88 అంగుళాల సైజులో ఉన్న స్మార్ట్ టీవీలు. వీటి ధరలు రూ.34,500 నుంచి రూ.7.04 లక్షల వరకు ఉన్నాయి.
⇒ శాంసంగ్ 2015లో దేశీయ మార్కెట్లో మొత్తం 82 లక్షల యూనిట్ల టీవీలను విక్రయించింది.