Sulab Complex
-
సులభ్ కాంప్లెక్స్‌లో నవజాత శిశువు మృతదేహం.. ఎన్నో అనుమానాలు!
సాక్షి, కరీంనగర్: నగరంలోని రాంనగర్ సులభ్ కాంప్లెక్స్‌లో శనివారం ఉదయం నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్ చేపల మార్కెట్ వద్ద గల సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఉదయం లోపలికి వెళ్లగా దుర్వాసన వచ్చింది. పరిశీలించి, శిశువు మృతదేహమని గుర్తించి, పోలీసులకు సమచారం అందించారు. అదనపు డీసీపీ ఎస్.శ్రీనివాస్(లాఅండ్ఆర్డర్), సీఐ లక్ష్మీబాబు, ఎస్సై తోట మహేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శిశువు ఇక్కడే జన్మించి, చనిపోయిందా లేదా మృతిచెందిన శిశువును తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ మహిళ వచ్చి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి -
మంటలకు కాంప్లెక్స్ నిర్వాహకుడి ఆహుతి
రాజమహేంద్రవరం క్రైం: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(65) కొంతకాలంగా భార్య, పిల్లలతో గొడవపడి రాజమహేంద్రవరం వచ్చేశాడు. ఇతడు గోదావరి గట్టున మార్కండేయస్వామి గుడి సమీపంలో ఉన్న సులభ కాంప్లెక్స్‌ను రెండు నెలలుగా కంచిపాటి గోవింద్ వద్ద సబ్ లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సులభ కాంప్లెక్స్ నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికుల అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటలలో చిక్కుకున్న వెంకటేశ్వరరావు పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా పెట్రోల్ పోసి అంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటైతే సులభ కాంప్లెక్స్ మొత్తం మంటలు వ్యాపించి ఉండేవి. కేవలం నిర్వాహకుడు కూర్చొనే క్యాబిన్ మాత్రమే అంటుకోవడం, మంటలలో పూర్తిగా కాలిబూడిద కావడం బట్టి చూస్తే ఇది హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు ఎప్పుడు రాజమహేంద్రవరం వచ్చాడనేది స్థానికులు చెప్పలేకపోతున్నారు. స్థానికులకు వెంకటేశ్వరరావుగా పరిచయమయ్యాడు. ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఎవరికీ చెప్పలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడు పూర్తిగా కాలిపోవడం బట్టి చూస్తే ఎవరైనా కావాలనే అంటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్ పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. సులభ కాంప్లెక్స్ ప్రధాన నిర్వాహకుడు కంచిపాటి గోవింద్‌ను ప్రశ్నించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నరకయాతన
కంపుకొడుతున్న సులభ్ కాంప్లెక్సులు అక్కరకురాని వ్యక్తిగత మరుగుదొడ్లు బాగుకు నిధులు విదల్చని ప్రభుత్వం మహిళల బహిర్భూమికి చాటు మార్గాలే గతి సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతర్ బహిరంగ మలవిసర్జన సామాజిక నేరమంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేపడుతున్నాయి. వాస్తవానికి సామూహిక మరుగుదొడ్లు, సులాబ్ కాంప్లెక్స్‌లతో పాటు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నిధులు విదల్చకపోవడంతో ముఖ్యంగా మహిళలు బహిర్భూమి అవసరాలకు నరకయాతనకు గురవుతున్నారు. ఇప్పటికీ చాటు మార్గాలను వెతుక్కోవలసి వస్తున్నది. ఇటీవల సుప్రీంకోర్టు బృందం పర్యటనలతో ఉరుకుల పరుగుల మీద ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్లు నిర్మించినా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేని వారు ఇప్పటికీ జిల్లాలో వేలాది మంది అవమానాలకు గురవుతూనే ఉన్నారు. జిల్లాలో 10.97 లక్షల కుటుంబాలకు కేవలం లక్షా 50వేలకే వ్యక్తిగత మరుగుదొడ్లున్నాయి. మిగిలిన వారంతా సులభ్‌కాంప్లెక్స్‌లు..బహిర్భూమిలనే ఆశ్రయిస్తున్నారు. విశాఖపట్నం: జిల్లాలోని ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో 20వేలకుపైగా సులభ్ కాంప్లెక్స్‌లున్నాయి. వీటిలో సుమారు పదివేలకు పైగా శిథిలావస్థకు చేరుకోగా. దాదాపు అన్నింటిలోనూ నిర్వహణ అధ్వానంగానే ఉంది. ఏఒక్క దానిలోనూ ఒక్క మరుగుదొడ్డి కూడా సక్రమంగా ఉన్న దాఖలాలు లేవు. లోపలకు వెళ్తే చాలు ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్గంధం వెలువడుతుంటుంది. వీటిలో మలమూత్ర విసర్జించాలంటే ఏ రోగమొస్తుందోననే భయం వెంటాడుతుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలన్న లక్ష్యం నీరుగారిపోతున్నది. జిల్లాలో ఉపాధి హామీలో 2,52,257 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 7,498 మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేయగలిగారంటే వీటి నిర్మాణం పట్ల అధికారులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం వీటి నిర్మాణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు అప్ప గించడంతో మార్చి నాటికి కనీసం 60వేలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక నుంచి ఏడాదికి లక్ష చొప్పున 2019 అక్టోబర్-2 నాటికి జిల్లాలో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా విశాఖ ను తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే స్థాయిలో అవసరాన్ని బట్టి సులభ్‌కాంప్లెక్స్‌ల సంఖ్యను కూడా పెంచుతామని చెబుతున్నారు.