Talk to AK
-
డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపైన ఏకకాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఢిల్లీ ప్రజలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమేకమయ్యే కార్యక్రమం అయిన ‘టాక్ టు ఏకే’ అనే పేరిట అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు దిగారని సీబీఐకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ తాజాగా డిప్యూటీ సీఎం ఇంటిపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహించింది దాడులు కాదని, నిబంధనల అతిక్రమణల వివరాలు తెలుసుకునేందుకు వచ్చామంటూ ఓ సీబీఐ అధికారి చివరిగా మీడియాకు చెప్పడం గమనార్హం. -
మోదీపైకి తూటాలు ఎక్కుపెట్టిన 'ఏకే'!
-
మోదీపైకి తూటాలు ఎక్కుపెట్టిన 'ఏకే'!
'టాక్ టు ఏకే'.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రశ్న-జవాబుల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన 'వెబ్ టాక్ షో' ఇది. ఆదివారం లైవ్ వెబ్ ప్రసారంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఊహించినట్టే ఢిల్లీ వాసుల నుంచి భారీ స్పందన వచ్చింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోసారి ఘాటైన విమర్శలతో విరుచుకుపడటానికి ఈ టాక్ షోను కేజ్రీవాల్ వేదికగా చేసుకున్నారు. మోదీ సర్కారు హస్తినలో భారత్-పాకిస్థాన్ లాంటి పరిస్థితిని సృష్టిస్తున్నదని మండిపడ్డారు. కేజ్రీవాల్ టాక్ షోలోని హైలెట్స్ ఇవే.. ఢిల్లీలో పరిపాలన స్తంభింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. మేం నిజాయితీగా, నిర్భీతిగా ఉండటం మోదీ సర్కారుకు ఇబ్బందిగా మారినట్టుంది. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలకు చెప్పాను. గుజరాత్ లో ఆప్ కు భారీ స్పందన లభిస్తోంది. ప్రజలు డిమాండ్ చేస్తే వచ్చే ఏడాది గుజరాత్ లో జరిగే ఎన్నికల్లో మేం పోటీ చేస్తాం. ఈ ఏడాది శీతాకాలంలో మళ్లీ ఢిల్లీలో 'సరి-బేసి' నంబర్ ప్లేట్ల విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నాం. -
ఢిల్లీ సీఎంతో నేరుగా మాట్లాడాలని ఉందా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో మీకు మాట్లాడాలని ఉందా.. మీ ఆలోచనలు అభిప్రాయాలు ఆయనకు చెప్పాలని ఉందా.. అయితే మరేం పర్వాలేదు. ఈ రోజు ఉదయం 11గంటలకు సిద్ధంగా ఉండండి. అందరితో ఆయన మాట్లాడతారు. అదే అనుకుంటున్నారా. ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం మాదిరిగానే అరవింద్ కేజ్రీవాల్ కూడా 'టాక్ టు ఏకే' అనే ఓ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. మోదీ కేవలం ఆయన మాత్రమే మాట్లాడి తన సందేశాన్ని ఇస్తుండగా కేజ్రీవాల్ మాత్రం ముఖాముఖి టైపులో ప్రజలతో మాట్లాడనున్నారు. ఫోన్ చేయడం ద్వారా, మెస్సేజ్ చేయడం ద్వారా, సోషల్ మీడియాతో ప్రశ్నించడం ద్వారా కేజ్రీతో మాట్లాడే అవకాశ దక్కనుంది. త్వరలో గోవా, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. టాక్టుఏకేడాట్ కామ్(talktoak.com) అనే ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించనున్నారు. దీనితో నేరుగా కేజ్రీవాల్ ను ప్రశ్నించడంతోపాటు 011-23392999 నెంబర్ కు ఫక్షన్ చేయడం ద్వారా కూడా కేజ్రీతో మాట్లాడవచ్చు. ప్రజల నుంచి మంచి మద్దతు ఉంటే ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
17 నుంచి ‘టాక్ టు ఏకే’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజలతో నేరుగా సంభాషించనున్నారు. ప్రజలతో ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పని తీరు గురించి ప్రజలకు తెలియజెప్పడమేకాక వారి సమస్యలను కూడా విననున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ మీడియా విభాగం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. సీఎంను ప్రజలకు చేరువచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ మీడియా విభాగం కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ‘టాక్ టు ఏకే క్యాపేన్’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. www.talktoak.com వెబ్సైట్ ద్వారా ప్రజలతో సీఎం కేజ్రీవాల్ నేరుగా ముచ్చటించగలిగేలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించేలా కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించింది. ఇది ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న పథకాలను వివరిస్తారు. ప్రభుత్వ పనితీరు గురించి వివరిస్తారు. తర్వాత ప్రశ్నలు-జవాబుల కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు సీఎంకు ప్రశ్నలు సంధించవచ్చు. నెలకొకసారైనా కార్యక్రమం కేజ్రీవాల్ కనీసం నెలకొకసారి అయినా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో ముచ్చటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వెబ్సైట్, సీఎం ఫేస్బుక్ పేజ్, ఎస్ఎంఎస్ ద్వారా ముఖ్యమంత్రిని ప్రజలు ప్రశ్నలు అడగవచ్చని ఆయా వర్గాలు వివరించాయి. ఫోన్ ద్వారా కూడా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నలు అడగవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఫోన్ నంబరును మాత్రం త్వరలో ప్రకటించనున్నారు. ఎస్ఎంఎస్ల కోసం కూడా ఓ టెలిఫోన్ నంబరును వెల్లడించనున్నారు. -
మన్ కీ బాత్ తరహా ప్రోగ్రాం చేయనున్న సీఎం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై సందుదొరికిన ప్రతీసారీ తీవ్ర విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి తన పంథా మార్చుకున్నారు. ఈ సారి ప్రధాని మోదీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించే 'మన్ కీ బాత్' కార్యక్రమం అథ్యదిక ప్రజాధరణ పొందిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమం తరహాలోనే కేజ్రీ ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు. 'టాక్ టు ఏకే' పేరుతో నెలకొక సారి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. www.talktoak.com లోకి లాగాన్ అయి తనతో ఆలోచనలు పంచుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జులై 17 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.