17 నుంచి ‘టాక్ టు ఏకే’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజలతో నేరుగా సంభాషించనున్నారు. ప్రజలతో ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పని తీరు గురించి ప్రజలకు తెలియజెప్పడమేకాక వారి సమస్యలను కూడా విననున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ మీడియా విభాగం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. సీఎంను ప్రజలకు చేరువచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ మీడియా విభాగం కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ‘టాక్ టు ఏకే క్యాపేన్’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది.
www.talktoak.com వెబ్‌సైట్ ద్వారా ప్రజలతో సీఎం కేజ్రీవాల్ నేరుగా ముచ్చటించగలిగేలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించేలా కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించింది. ఇది ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న పథకాలను వివరిస్తారు. ప్రభుత్వ పనితీరు గురించి వివరిస్తారు. తర్వాత ప్రశ్నలు-జవాబుల కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు సీఎంకు ప్రశ్నలు సంధించవచ్చు.
నెలకొకసారైనా కార్యక్రమం
కేజ్రీవాల్ కనీసం నెలకొకసారి అయినా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో ముచ్చటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వెబ్‌సైట్, సీఎం ఫేస్‌బుక్ పేజ్, ఎస్‌ఎంఎస్ ద్వారా ముఖ్యమంత్రిని ప్రజలు ప్రశ్నలు అడగవచ్చని ఆయా వర్గాలు వివరించాయి. ఫోన్ ద్వారా కూడా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నలు అడగవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఫోన్ నంబరును మాత్రం త్వరలో ప్రకటించనున్నారు. ఎస్‌ఎంఎస్‌ల కోసం కూడా ఓ టెలిఫోన్ నంబరును వెల్లడించనున్నారు.