డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపైన ఏకకాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు.
ఢిల్లీ ప్రజలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమేకమయ్యే కార్యక్రమం అయిన ‘టాక్ టు ఏకే’ అనే పేరిట అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు దిగారని సీబీఐకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ తాజాగా డిప్యూటీ సీఎం ఇంటిపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహించింది దాడులు కాదని, నిబంధనల అతిక్రమణల వివరాలు తెలుసుకునేందుకు వచ్చామంటూ ఓ సీబీఐ అధికారి చివరిగా మీడియాకు చెప్పడం గమనార్హం.