న్యూఢిల్లీ: అక్రమ కేసులు, దాడులు చేపట్టి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో ప్రధాని మోదీ 15 మంది పేర్లను ఢిల్లీ పోలీసులు, ఈడీ, సీబీఐలకు అందజేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ 15 మందిలో ఆప్ నేతలే ఎక్కువమంది ఉన్నారన్నారు. శనివారం ఆయన వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ 15 మంది పేర్ల జాబితాను సీబీఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
వచ్చే ఎన్నికల సమయా నికి రాజకీయంగా దెబ్బతీసేందుకు వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని, దాడులు జరపాలని కోరారు’అని సిసోడియా ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా మోదీజీకి బ్రహ్మాస్త్రం వంటి వారు. ఏదేమైనా ఈ పనిని నెరవేరుస్తానని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ‘సీబీఐ, ఈడీలను మీరు పంపించండి. వారికి మేం ఆహ్వానం పలుకుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆప్ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టినా కేంద్రం ఏమీ సాధించలేక పోయిందని చెప్పారు.
‘గతంలో చేపట్టిన తనిఖీలతో మీరు ఏం సాధించారు? మా నేత సత్యేందర్ జైన్‌పై 12 కేసులున్నాయి. సీఎం కేజ్రీవాల్ కార్యాలయంపై, నా నివాసంపై సీబీఐ దాడులు చేసింది. ఆప్ 21 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ, ఏం సాధించారు?’అని సిసోడియా ప్రశ్నించారు. ‘గతంలో దాడులు, అక్రమ కేసులతో ఏం సాధించారు? ఓట్ల రాజకీ యాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోండి’అని శనివారం ట్విట్టర్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఖండించారు. మరికొద్ది నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఆప్ నేతలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment