పన్ను వివాదాల పరిష్కారానికి పెద్దపీట: సీబీడీటీ
న్యూఢిల్లీ: పన్ను అపరిష్కృత అంశాలు న్యాయస్థానాల్లో పెరిగిపోకుండా చూడ్డంలో భాగంగా అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కీలక సూచనలు చేసింది. ఏకమొత్తంగా ఒకేసారి పన్ను సమస్య పరిష్కార పథకంపై అసెస్సీలకు అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సూచించింది.
జూన్ 1న ప్రారంభించిన ఈ పథకం డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఈ పథనిర్దేశం చేసింది. కమిషనర్ (అప్పీల్) ముందు పెండింగులో దాదాపు 2.59 లక్షల కేసులు ఉన్న నేపథ్యంలో సీబీడీటీ మార్గదర్శకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 29 వరకూ లభిస్తున్న ఐటీ గణాంకాల ప్రకారం పేరుకుపోయిన కేసుల్లో రూ.10 లక్షలపైబడిన అప్పీళ్ల సంఖ్య 73,402 కాగా, రూ.10 లక్షల లోపు కేసుల సంఖ్య 1,85,858.