‘చాట్‌జీపీటీ’తో ఉద్యోగులకు గండం.. టీసీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ముంబై: చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు.. ఉద్యోగుల స్థానాలను ఆక్రమించబోవని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అవి ’కృత్రిమ మేథ (ఏఐ) గల సహోద్యోగులు’గా మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఒక్కో పరిశ్రమలో, ఒక్కో కస్టమరుకు ఒక్కో రకం సేవలు అవసరమవుతాయని చెప్పారు. వివిధ పరిస్థితులను అర్థం చేసుకుని, సందర్భానుసారంగా వాటిని అందించడం మనుషులకు మాత్రమే సాధ్యమని, వాటిని అర్థం చేసుకోవడంలో ’ఏఐ సహోద్యోగి’కి చాలా సమయం పడుతుందని మిలింద్ చెప్పారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సహాయకరంగా మాత్రమే జెనరేటివ్ ఏఐ ఉండగలదని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచుకునేందుకు, డెలివరీ వేగాన్ని మెరురుపర్చుకునేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని వివరించారు. చాట్‌జీపీటీ మొదలైన వాటి రాకతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మిలింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.