Team Indus
-
జాబిల్లిపైకి మన ల్యాండర్!
అగ్రరాజ్యం అమెరికా జాబిల్లిపైకి ఓ వ్యోమనౌకను పంపుతోందట! ఇందులో మరో విశేషం ఉంది. అదేంటంటే చందమామపై దిగే మూన్‌ల్యాండర్‌ను ఓ భారతీయ కంపెనీ డిజైన్ చేస్తోంది. అది కూడా బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ అనే సంస్థ. కొన్నేళ్ల కిందట గూగుల్ కంపెనీ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పేరుతో ఓ పోటీ పెట్టింది. రోబోను సొంతంగా తయారుచేసుకుని అంతరిక్షంలోకి పంపితే 3 కోట్ల డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కారణాలేవైనా ఈ పోటీ విజయవంతం కాలేదు. కాకపోతే ఇందులో పాల్గొన్న టీం ఇండస్ మాత్రం జాక్‌పాట్ కొట్టేసింది. 2021 నాటికి జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపాలని నాసా నిర్ణయించడం.. సమయం తక్కువగా ఉన్న కారణంగా కొన్ని పనులు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించడంతో టీం ఇండస్కు ఈ అరుదైన అవకాశం లభించింది. దీంతోపాటు ఆస్ట్రోబయోటిక్, ఇంట్యూటివ్ మెషీన్స్, ఆర్బిట్ బియాండ్ అనే మూడు అమెరికన్ కంపెనీలు కూడా నాసా ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఇందులో ఆర్బిట్ బియాండ్ కంపెనీకి సంబంధించిన వ్యోమనౌకను టీం ఇండస్ తయారు చేసి ఇవ్వనుంది. ఈ వ్యోమనౌక జాబిల్లిపై ఉన్న ఓ భారీ లోయలోని మేర్ ఇబ్రియం అనే ప్రాంతంలో ల్యాండ్ కావాలి. నాసాకు మొత్తం 9 మూన్‌ల్యాండర్ల అవసరం ఉండగా.. వాటిని తయారు చేసేందుకు సరిపడా ఉద్యోగులు అమెరికన్ కంపెనీల్లో లేరని.. వేరే కంపెనీలతో వ్యోమనౌకను డిజైన్ చేయిస్తోందని ఇంట్యూటివ్ మెషీన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ చెబుతున్నారు. -
జాబిల్లిని చేరే యంత్రం ఏది?
సుమారు 40 ఏళ్ల క్రితం మనిషి జాబిల్లిపై అడుగుపెట్టినప్పుడు అంతరిక్ష రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఇందులో డౌటేమీ లేదు. ఇన్నేళ్ల తరువాత మరోసారి అలాంటి ఘట్టానికి రంగం సిద్ధమైంది. విషయం ఏమిటి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఎడమవైపు ఉన్న ఫొటో చూశారుగా... ఈ ఏడాది జాబిల్లిపైకి చేరే తొలి ప్రైవేట్ వాహనం ఇదే కావచ్చు. ఇక రెండో ఫొటోలో ఉన్నది మన భారతీయ బృందం "టీమ్ ఇండస్"’ సిద్ధం చేసిన మోడల్. ఇది కూడా జాబిల్లిపైకి చేరే చాన్స్ ఉంది! రెండూ వెళతాయా? ఏమో చెప్పలేం. ఒకటైతే గ్యారంటీ. కాకపోతే మొత్తం ఐదు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఎందులో? గూగుల్ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పోటీలో! పోటీ ఫైనలిస్ట్‌లను ఇటీవలే ప్రకటించారు. దాదాపు మూడు కోట్ల డాలర్ల (దాదాపు 210 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ కోసం జరుగుతున్న ఈ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ స్పేస్ఎల్, టీమ్ ఇండస్లతోపాటు, జపాన్‌కు చెందిన హకుటూ, న్యూజిలాండ్‌కు చెందిన రాకెట్ ల్యాబ్, వివిధ దేశాల భాగస్వామ్యంతో నడుస్తున్న "సినర్జీ మూన్"లు పోటీ పడుతున్నాయి. ఈ టీమ్స్‌లో ఏ ఒక్కటి జాబిల్లిపైకి చేరి 500 మీటర్లు ప్రయాణించి, హై డెఫినిషన్ వీడియో, చిత్రాలు ప్రసారం చేసినా చాలు వారికి రెండు కోట్ల డాలర్లు చెల్లిస్తుంది ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్. మరి మిగిలిన కోటి డాలర్ల మాటేమిటి? అనేదేనా మీ సందేహం? చాలా సింపుల్. 50 లక్షల డాలర్లు రెండో ప్రైజ్‌గా ఇస్తారు. ఇంకో 50 లక్షల డాలర్లను జాబిల్లిపై ఒక రాత్రి మొత్తం గడిపిన అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసిన బృందానికి బోనస్ ప్రైజ్‌గా ఇస్తారు. పీటర్ డెమండిస్ అనే వ్యాపార వేత్త చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి పోటీలు అనేకం జరుగుతూంటాయి. ప్రస్తుతం జాబిల్లిపైకి అంతరిక్ష నౌకలను పంపడం మాత్రమే కాకుండా... భూమ్మీద నీటి సమస్యలు తీర్చడం, మహిళల భద్రత, అందరికీ అక్షరాస్యత, వంటి సమస్యల పరిష్కారానికీ కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో పోటీలు నిర్వహిస్తోంది! - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
త్వరలో చందమామపై బీర్
లాస్ఏంజిలెస్: త్వరలో చంద్రుడిపై బీర్ తయారుకానుంది. టీమ్ఇండస్ అనే సంస్థ నిర్వహించిన ‘ల్యాబ్ టు మూన్ ’పోటీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సంస్థ వచ్చే డిసెంబర్ 28న చంద్రుడికిపైకి అంతరిక్షనౌకను పంపనుంది. ఈ నౌకలో వర్సిటీ విద్యార్థులు రూపొందించిన బీరు క్యాన్ ను పంపి అక్కడ బీరును తయారు చేయనున్నారు. ఈ ప్రయోగంలో మూడు విభాగాలున్న లోహపు డబ్బాలో పులియని బీరు, ఈస్ట్‌ను విడిగా ఉంచి చంద్రుడికిపైకి పంపుతారు. ఇది అక్కడికి చేరాక వాల్వ్ తెరుచుకొని ఈ రెండు మిశ్రమాలు కలుస్తాయి. అనంతరం పులియబెట్టిన బీరు తయారవుతుంది. అక్కడ బీర్‌ను ఎంతవరకు పులియబెట్టవచ్చో దీనిద్వారా తెలుసుకుంటారు. -
చంద్రుడిపైకి ‘టీమ్ఇండస్’!
న్యూఢిల్లీ: చంద్రుడి పైకి రోబోను పంపేందుకు ‘టీమ్ ఇండస్’ను గూగుల్ షార్ట్‌లిస్ట్ చేసింది. భారత్ నుంచి ఎంపికైన ఏకైక కంపెనీ ఇదే కావడం విశేషం. గూగుల్ చేపట్టిన ‘లూనార్ ఎక్స్‌ప్రైజ్’ పోటీకి టీమ్ఇండస్ అంతరిక్ష నౌక ఎంపికైతే వచ్చే ఏడాది లూనార్పైకి వెళ్తుంది. అదే జరిగితే తొలిసారిగా చంద్రుడి పైకి వెళ్లే ప్రైవేటు అంతరిక్ష నౌక ఇదే అవుతుంది. టీమ్ఇండస్.. చంద్రుడిపైకి పంపేందుకు ఓ ప్రాజెక్టును డిజైన్ చేయడానికి యువతను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్ల లోపు వయసున్న అనేక మంది యువకులు తమ ఐడియాలను పంపారు. దాదాపు వచ్చిన 1600 ఆలోచనల నుంచి 20 ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేయనుంది. ఈ టీమ్ ఇండస్ 2017 చివరికల్లా చంద్రుడి పైకి వెళ్లే అవకాశం ఉంది.