జాబిల్లిని చేరే యంత్రం ఏది?
సుమారు 40 ఏళ్ల క్రితం మనిషి జాబిల్లిపై అడుగుపెట్టినప్పుడు అంతరిక్ష రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఇందులో డౌటేమీ లేదు. ఇన్నేళ్ల తరువాత మరోసారి అలాంటి ఘట్టానికి రంగం సిద్ధమైంది. విషయం ఏమిటి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఎడమవైపు ఉన్న ఫొటో చూశారుగా... ఈ ఏడాది జాబిల్లిపైకి చేరే తొలి ప్రైవేట్ వాహనం ఇదే కావచ్చు. ఇక రెండో ఫొటోలో ఉన్నది మన భారతీయ బృందం "టీమ్ ఇండస్"’ సిద్ధం చేసిన మోడల్. ఇది కూడా జాబిల్లిపైకి చేరే చాన్స్ ఉంది! రెండూ వెళతాయా? ఏమో చెప్పలేం.
ఒకటైతే గ్యారంటీ. కాకపోతే మొత్తం ఐదు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఎందులో? గూగుల్ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పోటీలో! పోటీ ఫైనలిస్ట్‌లను ఇటీవలే ప్రకటించారు. దాదాపు మూడు కోట్ల డాలర్ల (దాదాపు 210 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ కోసం జరుగుతున్న ఈ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ స్పేస్‌ఎల్, టీమ్ ఇండస్‌లతోపాటు, జపాన్‌కు చెందిన హకుటూ, న్యూజిలాండ్‌కు చెందిన రాకెట్ ల్యాబ్, వివిధ దేశాల భాగస్వామ్యంతో నడుస్తున్న "సినర్జీ మూన్"లు పోటీ పడుతున్నాయి.
ఈ టీమ్స్‌లో ఏ ఒక్కటి జాబిల్లిపైకి చేరి 500 మీటర్లు ప్రయాణించి, హై డెఫినిషన్ వీడియో, చిత్రాలు ప్రసారం చేసినా చాలు వారికి రెండు కోట్ల డాలర్లు చెల్లిస్తుంది ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్. మరి మిగిలిన కోటి డాలర్ల మాటేమిటి? అనేదేనా మీ సందేహం? చాలా సింపుల్. 50 లక్షల డాలర్లు రెండో ప్రైజ్‌గా ఇస్తారు. ఇంకో 50 లక్షల డాలర్లను జాబిల్లిపై ఒక రాత్రి మొత్తం గడిపిన అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసిన బృందానికి బోనస్ ప్రైజ్‌గా ఇస్తారు. పీటర్ డెమండిస్ అనే వ్యాపార వేత్త చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి పోటీలు అనేకం జరుగుతూంటాయి. ప్రస్తుతం జాబిల్లిపైకి అంతరిక్ష నౌకలను పంపడం మాత్రమే కాకుండా... భూమ్మీద నీటి సమస్యలు తీర్చడం, మహిళల భద్రత, అందరికీ అక్షరాస్యత, వంటి సమస్యల పరిష్కారానికీ కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో పోటీలు నిర్వహిస్తోంది!
- సాక్షి నాలెడ్జ్ సెంటర్