Tekulapally
-
కొంగుపట్టి లాగి.. జాకెట్ చించి..
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్ ఆఫీసర్ మోతీలాల్ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్ఆర్వోను ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీట్ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. -
బైక్, లారీ ఢీ..ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రోంపేడు గ్రామానికి చెందిన భూక్యా సురేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన రిమోట్ కారు..బాలుడికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఓ రిమోట్ కారు అకస్మాత్తుగా పేలడంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం టేకులపల్లి మండలం పరిధిలోని కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం అరవింద్ (10) రిమోట్ కారుతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అరవింద్ ఎడమ అరచేయి నుజ్జు నుజ్జు అయింది. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. స్థానికంగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. -
మూడు రోజులైనా అతడిని వదలని నాగుపాము
టేకులపల్లి : పాములు పగబడతాయా అంటే ఏమో ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువమంది పగబడుతుందనే చెబుతారు.. కాస్త చదువుకున్నవాళ్లయితే మాత్ర ఆ ఛాన్సే లేదంటారు.. అలా వారన్నప్పటికీ వారి మనసులో మాత్రం ఏమో నిజంగా పగబట్టవచ్చునేమో అని లోలోపల భయపడుతుంటారు కూడా. అలాంటి ఊహనే నిజం చేస్తూ కొన్నిసార్లు అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటుంటాయి.. అరుదుగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నాగు పాము ఒకే వ్యక్తిని పగబట్టి మూడు రోజులుగా కాటేసిందని చెబుతున్నారు ఓ గ్రామస్తులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం పంచాయతీ బావోజీతండాలో చోటు చేసుకుంది. 'అది నాగు పాము. పగబట్టింది. మూడు రోజులుగా అతడినే కాటు వేసింది.. మూడుసార్లు కూడా సకాలంలో చికిత్స అందడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇల్లు మారాడు. అయినా ఎక్కడినుంచి వచ్చిందో కాటు వేసి వెళ్లిపోయింది. చివరకు గ్రామస్తులంతా కలిసి నిప్పు పెట్టి పామును చంపేశారు' అని ఆ గ్రామస్తులు కొంతమంది చెప్పారు. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
టేకులపల్లి : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చబోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పంచాయతీలో జరిగింది. బిల్లుడు తండాకు చెందిన భూక్యా పంతు(80), అతని కొడుకు తార్యాకు ఆస్తి విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా తగాదా జరిగింది. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తండ్రిపై తార్యా కత్తితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావటంతో 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఈ రంగు కప్పలను ఎప్పుడైనా చూశారా?
టేకులపల్లి: మీరు చాలా రకాల కప్పలు(మండూకాలు) చూసి ఉంటారు. ఈ పసిడి రంగు కప్పలను ఎప్పుడైనా చూశారా?. అయితే ఇప్పుడు చూడండి.. పసుపు పచ్చని రంగులో ఉన్న కప్పలు వానచినుకులో చిందేశాయి. ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం దంతెలతండా పరిధిలోని గుంపు కుంటలో మంగళవారం కురిసిన తొలి భారీ వర్షానికి ఈ రకం కప్పలు దర్శనమిచ్చాయి. వాననీటిలో.. గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో నీటిలో తేలియాడుతూ కప్పలు చిందులేశాయి. పసుపు పచ్చగా మెరుస్తూ కనిపించినా ఈ కప్పలను చూసేందుకు వచ్చిన అక్కడి స్థానికులను కనువిందు చేశాయి. -
బైక్ బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద శనివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లికి చెందిన డిప్లొమా విద్యార్థి అలవాల అరుణ్, పదో తరగతి విద్యార్థి గండేపల్లి శ్యామ్ బైక్‌పై కోయగూడెం వైపు వెళుతున్నారు. రైస్‌మిల్లు వద్దకు రాగానే రోడ్డుపై గుంతల కారణంగా బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో అరుణ్, శ్యామ్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పీఏసీఎస్ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు. -
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
టేకులపల్లి (ఖమ్మం) : కూపన్లు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం శంబునిగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై సురేష్ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
పిడుగుపాటుకి చిన్నారి మృతి
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముర్రేడువాగులో మేకలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులపై పిడుగుపడింది. ఇందులో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ బోల్తా : రైతు మృతి
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గోల్‌యాతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బోడ భీమా(35) తన సొంత ట్రాక్టర్ సహాయంతో కిరాయిలు చేస్తూ తన పొలాన్ని సాగు చేస్తున్నాడు. కాగా గురువారం తన పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. కాగా ట్రాక్టర్‌ను బయటకు తీసే క్రమంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న బోడ భీమా బురదలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బురదలో నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి సానుభూతి ప్రకటించారు. -
టేకులపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెగా ఉచిత ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌లకు చెందిన వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని 12 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వైద్యం చేయించుకుంటారని నిర్వహాకులు అంచనా వేస్తున్నారు. -
‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’
ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలంగాణవాదులపై తనకు గల ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు, పీఏసీఎస్ చైర్మన్లకు మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆమె మాట్లాడుతుండగా ఇల్లెందు, టేకులపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఆగ్రహించిన రేణుక ‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’ అని గద్దిస్తూ అధికారులు, కాంగ్రెస్ నాయకుల వైపు చూశారు. నినాదాలు చేసిన వారిని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు. ఖమ్మం జిల్లా ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రారంభమైన అవతరణ వేడుకల్లోనూ రేణుకాచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.