
టేకులపల్లి : పాములు పగబడతాయా అంటే ఏమో ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువమంది పగబడుతుందనే చెబుతారు.. కాస్త చదువుకున్నవాళ్లయితే మాత్ర ఆ ఛాన్సే లేదంటారు.. అలా వారన్నప్పటికీ వారి మనసులో మాత్రం ఏమో నిజంగా పగబట్టవచ్చునేమో అని లోలోపల భయపడుతుంటారు కూడా. అలాంటి ఊహనే నిజం చేస్తూ కొన్నిసార్లు అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటుంటాయి.. అరుదుగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఒక నాగు పాము ఒకే వ్యక్తిని పగబట్టి మూడు రోజులుగా కాటేసిందని చెబుతున్నారు ఓ గ్రామస్తులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం పంచాయతీ బావోజీతండాలో చోటు చేసుకుంది. 'అది నాగు పాము. పగబట్టింది. మూడు రోజులుగా అతడినే కాటు వేసింది.. మూడుసార్లు కూడా సకాలంలో చికిత్స అందడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇల్లు మారాడు. అయినా ఎక్కడినుంచి వచ్చిందో కాటు వేసి వెళ్లిపోయింది. చివరకు గ్రామస్తులంతా కలిసి నిప్పు పెట్టి పామును చంపేశారు' అని ఆ గ్రామస్తులు కొంతమంది చెప్పారు.