ఆర్టీసీ ఆస్తుల మూల్యాంకనంతో రగడ
షీలాభిడే కమిటీ ఆదేశంతో కసరత్తు షురూ
రంగంలోకి ప్రైవేటు ఏజెన్సీ
ఉమ్మడి ఆస్తులనడంపై భగ్గుమన్న తెలంగాణ అధికారులు
శుక్రవారం నుంచి ఆందోళన?
హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మరోసారి విభజన చిచ్చు రాజు కుంది. కొద్దిరోజుల్లో ప్రశాంతంగా తెలంగాణ ఆర్టీసీ ఏర్పడుతుంది అని అనుకుంటున్న దశలో ఒక్కసారిగా వేడి రగులుకుంది. తెలంగాణ అధికారులు, కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టేం దుకు సిద్ధమయ్యారు. వచ్చే శుక్రవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని తెలంగాణ అధికారులు సంఘం ప్రకటించింది. ఆస్తులు, అప్పుల పంపకంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖకు దరఖాస్తు చేయాలని నిర్ణయించిన తరుణంలో కొత్త వివాదం తలెత్తింది. కార్పొరేషన్ల విభజన అంశాన్ని పర్యవేక్షిస్తున్న షీలాభిడే కమిటీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం తాజాగా అగ్గిని రాజేసింది.
ఇదీ సంగతి...
కార్పొరేషన్ల విభజన కోసం కేంద్రం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్టీసీ సహా ఆయా కార్పొరేషన్ల అధికారులతో భేటీ అయింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పేర్కొంటూ వాటి విలువల మూల్యాంకనం చేయాలని నిర్ణయిం చింది. ఈ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించి మూల్యాంకన మొదలుపెట్టింది. మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకున్నట్టు సమాచారం. దాదాపు పది రోజులుగా జరుగుతున్న ఈ కసరత్తు గురించి తెలుసుకున్న ఆర్టీసీలోని తెలంగాణ అధికారులు అగ్గిమీదగుగ్గిలమయ్యారు. ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ తంతును సాగిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాదాపు వందమంది మంగళవారం బస్‌భవన్‌లో అత్యవసరం గా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తు లు తెలంగాణకే చెందినవని, ‘ఉమ్మడి ఆస్తులు’ అనే పదానికి అర్థమేలేదని పేర్కొంటూ గతంలో ఆర్టీసీ అంతర్గత విభజన కమిటీకి నివేదించి ఆ పదాన్ని తొలగింపచేసినా మళ్లీ కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
వెంటనే ఈ కసరత్తును అడ్డుకోవాలని తీర్మానించారు. ఇందుకోసం గురువారం ఆర్టీసీ ఈడీలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో సానుకూల నిర్ణయం రానిపక్షంలో శుక్రవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని తీర్మానించారు. తొలుత బస్‌భవన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు. ‘తాజా మూల్యాంకనంతో హైదరాబాద్‌లోని అన్ని స్థిరాస్తుల విలువగట్టి దాన్ని 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచే కుట్రజరుగుతోంది. దీన్ని సాగనివ్వం’ అని వారు పేర్కొన్నారు. సమావేశంలో ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేందర్, విజయభాను, వాసుదేవరావు, కృష్ణమోహన్, శ్రీనివాసరావు, రాములు, గిరిమహేశ్, లవన్న తదితరులు పాల్గొన్నారు.