ఘనంగా ఏటీఎస్ఏ, తెలంగాణ సంబురాలు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్-ఏటీఎస్ఏ(ఒకప్పుడు ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం) ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఏటీఎఎస్ ప్రారంభమై పదేళ్లు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్త రాష్ట్ర సంబురాలు గొప్పగా జరిగాయి. మొత్తం పదకొండు వందలమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏటీఎఎస్ తన ప్రస్థానం గురించి వివరించింది. 2006లో 120మందితో తొలిబతుకమ్మ ఆడటం ద్వారా ఈ సంస్థ ప్రారంభమై ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా పనిచేసిందని పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధిని విస్తరించడమే ధ్యేయంగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి టీ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ఎంపీ డాక్టర్ వినోద్, ఆస్ట్రేలియా ఎంపీ జూలీ ఓవెన్స్, ఎన్ఎస్ డబ్ల్యూ మల్టీ కల్చరల్ సెక్రటరీ జనరల్ జియాఫ్ లీ తదితరులు హాజరయ్యారు. బంగారు తెలంగాణ దిశగా తాము చేస్తున్న కృషిని, భవిష్యత్ కార్యచరణను ప్రొఫెసర్ కోదండరామ్ వివరించారు. ఈ సందర్భంగా మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్ తోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కత్తి కార్తికా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం వహించారు.