రాకుమారుడి స్కూల్లో దొంగతనం.. టెన్షన్
లండన్ : బ్రిటన్ బుల్లి రాకుమారుడు చదువుతున్న పాఠశాలలో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె స్కూల్‌కు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. బ్రిటన్ రాకుమారుడైన నాలుగేళ్ల జార్జ్ అందులోనే చదువుతున్న నేపథ్యంలో పాఠశాల వివరాలు తస్కరించే ప్రయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. యువరాజు భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణనలోకి తీసుకొని తీవ్రంగా విచారణ చేపట్టారు. జార్జ్ గత వారం నుంచే థామస్ బ్యాటర్‌సీ అనే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విషయం తెలిసిందే.
దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్లో విద్యార్థులు బెస్ట్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు.
'మేం థామస్ స్కూల్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ స్కూల్లోనే రాయల్ కుటుంబానికి చెందిన ప్రిన్స్ జార్జ్ చదువుతున్నారు. తాజా సంఘటన తర్వాత మేం భద్రత విషయాన్ని పునఃసమీక్షించబోతున్నాం' అని పోలీసులు తెలిపారు. అయితే, ప్రిన్స్ విలియమ్స్ ఆయన కుటుంబ సభ్యుల దీనిపై స్పందిస్తూ జరిగిన ఘటన తమకు తెలిసిందని, భద్రత విషయాల్లో మేం ఎలాంటి కామెంట్లు చేయబోమని అన్నారు.