tngo leader
-
టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి.. మీ ఆస్తులన్నీ బయట పెడతా: బండి సంజయ్
సాక్షి, నల్గొండ: మునుగోడు అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్ అంతర్జాతీయ అంశాలు మాట్లాడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దని సూచించారు. కేసీఆర్ ముందు కొందరు ఉద్యోగులు మోకరిల్లుతున్నారని.. ప్రమోషన్ల కోసం టీఎన్జీవో ఉద్యోగులు సాగిలపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు నాంపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నలుగురు టీఎన్జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు .టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని. మీరే చెప్పాలని తెలిపారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే ఉంటానని. తమ ఆస్తులను మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. ‘కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. ఆయన హామీలను ప్రజలు నమ్మడం లేదు. మా కార్యకర్తలు ప్రలోభాలకు లొంగలేదు. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోంది. కుల సంఘాలు మరోసారి ఆలోచించాలి. ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో సర్కస్ చూపించారు. బెల్ట్ షాప్‌లు పెట్టి గౌడ కులస్తుల పొట్టకొట్టారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. కౌలు రైతులు, పత్తి రైతులకు ఏం చేశారు.’ అని టీఆర్ఎస్పై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
సీపీఎస్‌ను రద్దు చేసే వారికే మద్దతు
సంగారెడ్డి జోన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో అనేక సమస్యలతోపాటు పీఆర్సీపై ఏళ్ల తరబడి పోరాటం చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో ఒక్క రోజులో 43 శాతం పీఆర్సీని, 9 నెలల బకాయిలని సాధించుకోగలిగామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో నవంబ ర్ 6 వరకు మాత్రమే ఓటర్ నమోదుకు గడువు విధించారని, దానిని మరో పక్షం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న క్రమంలో గతంలో అనేక పర్యాయాలు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్క నియోజకవర్గంలో వందకు మించి అవకాశం కల్పించాలేదన్నారు. ఈ సారి ఆన్లైన్లో ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వారం ముందుగానే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొండల్‌రెడ్డి, కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్
హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్ పేరు ఖరారైంది. మరోవైపు వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లె రాజేశ్వరరెడ్డి పేరును టీఆర్ఎస్ అధినాయకులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం అధికారికంగా పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సి ఉంది.