టాప్ టెన్ యూనివర్శిటీల్లో అమెరికాదే హవా
బీజింగ్: ప్రపంచ టాప్ యూనివర్శిటీల్లో ఈ ఏడాది కూడా అమెరికా యూనివర్శిటీలదే హవా. వరుసగా పదమూడవ సంవత్సరం కూడా హార్వర్డ్ యూనివర్శిటీ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. స్టాన్‌ఫర్డ్, మసాచుసెట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ద్వితీయ, తృతీయ స్థానాల్లో, బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ప్రిన్సిటన్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలు ఈసారి కూడా నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. కొలంబియా యూనివర్శిటీ, షికాగో యూనివర్శిటీ ఎనిమిది, తొమ్మిదవ స్థానాలను సాధించాయి.
మొత్తం టాప్ టెన్ యూనివర్శిటీల్లో ఎనిమిది యూనివర్శిటీ అమెరికావే కావడం విశేషం. అమెరికేతర యూనివర్శిటీలైన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలు వరుసగా ఐదు, పదవ స్థానాలను ఆక్రమించాయి. షాంగ్ జియాటాంగ్ యూనివర్శిటీ పర్యవేక్షణలో చైనీస్ రిసెర్చ్ సెంటర్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సారి ఫ్రెంచ్ యూనివర్శిటీలు బాగా వెనకపడి పోయాయి. టాప్ వంద యూనివర్శిటీల్లో ఫ్రెంచ్ యూనివర్శిటీలకు మూడు స్థానాలు మాత్రమే లభించాయి.
ఫ్రాన్స్‌లోని పియరీ అండ్ మేరి క్యూరి యూనివర్శిటీకి 39వ స్థానం, పారిస్ సూద్‌కు 46, ఎకోల్ నార్మేల్ సుపీరియర్‌కు 87వ స్థానం లభించాయి. ఒక్క మాథమేటిక్స్ విభాగంలోనే ఫ్రెంచ్ యూనివర్శిటీలకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే యూనివర్శిటీ ర్యాంకులను నిర్ణయించేందుకు చైనా అనుసరించిన ప్రమాణాలే పూర్తిగా తప్పని, వారు కేవలం సైన్స్ విభాగాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి తియరీ మాండన్ విమర్శించారు. తమ విద్యానాన్నే చైనా తప్పుగా అర్థం చేసుకొందని, ప్రపంచంలో నెంబర్ ర్యాంకును సాధించడం తమ విద్యావిధానం లక్ష్యం కాదని ఆయన చెప్పారు.
అయితే తాము అనేక విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొనే ర్యాంకులు నిర్ణయించామని, పైగా మూడవ పార్టీ అధ్యయనంతోనే ర్యాంకులను శాస్త్రీయ ప్రమాణాలతో ఖరారు చేశామని చైనా యూనివర్శిటీ తెలిపింది. పూర్వ విద్యార్థుల రాణింపును, యూనివర్శిటీ సిబ్బందికి వచ్చే నోబెల్ బహుమతులను, ఫీల్డ్ మెడళ్లను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయించామని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1200 యూనివర్శిటీలను అధ్యయనం చేసి ప్రతి ఏట 500 టాప్ యూనివర్శిటీల ర్యాంకులను నిర్ణయిస్తామని, ఈసారి కూడా అలాగే చేశామని చైనా యూనివర్శిటీ వివరించింది. ర్యాంకింగ్‌ల కోసం అధ్యయనం నిర్వహించిన చైనా జియాటాంగ్ యూనివర్శిటీకి 118వ స్థానం లభించింది. గత ఏడాదికన్నా నాలుగు స్థానాలు ముందుకు జరిగింది.