రైళ్లలో అనధికార విక్రేతలపై చర్యలు
ఆర్పీఎఫ్ బృందాల నియామకం
విశాఖపట్నం సిటీ: రైళ్లలో అనధికార విక్రేతలపై రైల్వే పోలీసులు దృష్టి పెట్టారు. రైళ్లలోకి అక్రమంగా ప్రవేశించే అనధికార విక్రేతలను పట్టుకునేందుకు ఆర్పీఎఫ్ బృందాలను నియమించారు. ఇకపై రైళ్లలో అనధికార విక్రేతలు ఎవరు కనిపించినా ఆర్పీఎఫ్ జవాన్లదే బాధ్యతగా రైల్వే గుర్తిస్తుంది. ఆ రోజు విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ జ వాన్లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్పీఎఫ్ అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో రక్షక దళ సభ్యులు అప్రమత్తమై విక్రేతలను పట్టుకుని కేసులు బనాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్థలాల్లోకి అనుమతి లేని విక్రేతలు రావడానికి వీల్లేదు. ఆర్పీఎఫ్ పోలీసులు చేతివాటంతో రైల్వే స్టేషన్లు, రైళ్లలోకి అనధికారిక విక్రేతలు వస్తున్నారని ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి.
ఇటీవల రాజమండ్రి రైల్వే స్టేషన్లో అనధికారిక విక్రేతలు ప్యాంట్రీకార్ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడడంతో ఈ కేసు మరింత ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తే రాజమండ్రి స్టేషన్లో విక్రేతలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేనప్పటికీ యథేచ్ఛగా అమ్మకాలు సాగించడంతో పాటు ప్యాంట్రీకార్ సిబ్బందిని అకారణంగా గాయపరచినట్టు నిర్ధారించారు. దీంతో అనధికారిక విక్రేతలను ఏరిపారేసేందుకు ఉన్నత స్థాయిలో ఉత్తర్వులు వెలువడడంతో అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ స్టేషన్లో ఇప్పటికే అనధికార విక్రేతలు చొరబడకుండా చర్యలు తీసుకున్నారు.