రాజ్ బబ్బర్కు యూపీ కాంగ్రెస్ పగ్గాలు
న్యూఢిల్లీ: దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికార పీఠాన్ని కౌవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నామని భావిస్తోన్న కాంగ్రెస్.. బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్షుడిగా నియమించింది. యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బబ్బర్ నియామకాన్ని వెల్లడించారు. ప్రియాంక గాంధీ ప్రచార కార్యక్రమాలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.
ప్రియాంక గాంధీ మంగళవారం మధ్యాహ్నం గులాం నబీ నివాసానికి వచ్చారు. గంటలపాటు జరిగిన భేటీలో అనేక విషయాలు చర్చించారు. చివరికి ఆజాద్ ప్రెస్ మీట్ పెట్టి.. ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటారని తెలిపారు. యూపీసీసీ చీఫ్ గా రాజ్ బబ్బర్ పేరు ప్రకటించారు. 'మరి సీఎం అభ్యర్థి ఎవరు?' అన్న ప్రశ్నకు మాత్రం 'ఇంకా సమయం ఉంది' అంటూ దాటవేశారు. (చదవండి:'పెద్ద రాష్ట్రంలో పాగా'కు కాంగ్రెస్ కీలక నిర్ణయం)
యూపీసీసీ చీఫ్ గా బబ్బర్ నియామకంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆజాద్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే లక్నోలోని పార్టీ కార్యాలయంలో కొందరు మిఠాయిలు పంచుకోగా, మరి కొదదరు అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘజియాబాద్(యూపీ) స్థానం నుంచి పోటీచేసి వీకే సింగ్ (బీజేపీ- కేంద్ర మంత్రి) చేతిలో ఓడిపోయిన రాజ్ బబ్బర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల కిందట రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా గులాం నబీ ఆజాద్ ను నియమించిన అధిష్టానం ఇప్పుడు యూపీసీసీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ పేరును ప్రకటించింది.
ఫిరోజాబాద్ జిల్లా తుందల్ పట్టణంలో జన్మించిన రాజ్ బబ్బర్ 70వ దశకం చివర్లో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. 1989లో వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీలో చేరారు. అనంతరం ములాయం అధ్యక్షుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీలో చేరారు. రెండు సార్లు ఆగ్రా స్థానం నుంచి, ఒక సారి ఫిరోజాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2006లో ఎస్సీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్ బబ్బర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన రాజ్ బబ్బర్.. కుల సమీకరణాలకు ప్రాధ్యాన్యమున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి.