వసూల్ రాజా
టీనగర్: కురువై సాగుబడి రాయితీలకు లంచాలు వసూలు చేస్తున్న ఓ అధికారి వీడియో కెమెరాకు చిక్కాడు. వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు పడుతున్న కష్టాల గురించి తెలిసిందే. అయితే, బోరు బావుల ఆధారంగా వ్యవసాయం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వ రాయితీలు ప్రకటించింది. ఈ రాయితీల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. రాయితీల కోసం అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు నాలుగు వేల రాయితీతో పాటుగా, ఇతర సదుపాయాలు అందుకునేందుకు రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంది.
ఇందులో భాగంగా నాగపట్నం జిల్లాలో 30 వేల ఎకరాల్లో రూ.12 కోట్ల రాయితీ ప్రకటించి ఉన్నారు. యంత్రం ద్వారా నాట్లు వేయడానికి తగ్గ రాయితీల కల్పనకు చర్యలు చేపట్టారు. రైతులు సమర్పించే దరఖాస్తుల పరిశీలన మేరకు బ్యాంక్‌ల ద్వారా రాయితీల చెల్లింపు ఉంటుంది. నాగపట్నం జిల్లా కుర్తాలం వ్యవసాయ విస్తరణ కార్యాలయం పరిధిలోని అసిస్టెంట్ వ్యవసాయ అధికారి కన్నన్ కోమల్ దరఖాస్తులు సమర్పిస్తున్న రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పన వసూలు చేయడం మొదలెట్టారు. రూ.500 ఇవ్వని వారి దరఖాస్తులు తిరస్కరించే పనిలో పడ్డారు. కన్నన్ వసూళ్ల వ్యవహారాన్ని కొందరు రహస్యంగా తమ సెల్ కెమెరాతో బంధించి వ్యవసాయ ఉన్నతాధికారులకు అప్పగించారు. వసూల్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.