ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్,సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకుడు నరేంద్రసింగ్ పర్మార్ హెచ్చరించారు. శనివారం మెదక్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు. అనంతరం పర్మార్ మాట్లాడుతూ ఎన్నికలకోసం దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు ప్రార్థన మందిరాలను వేదికలుగా ఉపయోగించుకోరాన్నారు.
ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను బెదిరించడం, అసలు ఓటర్లకు బదులు వేరే వారిని ఓటర్లుగా వ్యవహరింపజేయడం నేరమన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వసతి కల్పించాలన్నారు.
సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ విడియో కెమెరాలను, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీ జవాన్లచే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఎన్నికల నియమామవళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల పత్రాలను పరిశీలించారు.
ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల సరళిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.కిరణ్‌కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారి దామోదర్‌రావు, డిప్యూటీ తహశీల్దార్ విజయప్రకాశ్‌రావు, స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు.