ఒకళ్లని జడ్జ్చేయటం నా దృష్టిలో తప్పు!
బా..పు..
రెండు అక్షరాల్లో కొండంత వినయం..
ఎవరెస్టంత జ్ఞానం, కోట్ల నిమిషాల మౌనం...
తెలుగు జాతికి వన్నె తెచ్చిన వైనం..!
తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్ బాపు...
ప్రతి తెలుగింట్లోనూ నిక్షిప్తమైన ‘బొమ్మల’ కొలువు బాపు! ఈయన చిత్రకారుడు, చలన చిత్రకారుడు,
చరిత్రకారుడు, విచిత్రదారుడు!
చాలా థాంక్స్ ముళ్లపూడి వెంకటరమణగారూ!
బాపుగారి గురించి ఈ వ్యాసం రాయాల్సి వస్తుందని, అప్పుడు నాకు బాపుగారి స్థాయి పదకోశం, భావజాలం అవసరమవుతాయని, నా చిన్నప్పట్నుంచే మీరు
రచనలు చేసి, నాలుగక్షరమ్ముక్కలు కాయితం మీద పెట్టే ధైర్యాన్ని మీ పాఠకుడిగా నాకిచ్చినందుకు...
బాపు వంటి నిరాడంబర, మొహమాటపు, మౌనిని
సినిమాల్లోకి తీసుకొచ్చి, సినిమాలిన్యం అంటకుండా,
నిర్‘మాత’గా కాపాడుకుంటూ, కథ ‘కుడి’ భుజమై
ఎడాపెడా మంచి సినిమాలు రాసేసి ఇచ్చినందుకు...
బాపుగారు, సినిమాలు తీసేసి మనందరి గుండెల్లో
పదికాలాలు నిలిచేలా చేసినందుకు..!
చివరిగా... బాపుగారు లాంటి మహోన్నత వ్యక్తిని ఆవిష్కరింపజేసే మహాద్భుత అవకాశాన్ని కల్పించి, పాఠకులకన్నా ముందే నాకు ఉగాది పండుగను అందించిన సాక్షికి కృతజ్ఞతాభివందనాలతో...
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు
చెన్నై... బాపురమణల ఇల్లు...
ఉదయం పదకొండు గంటల సమయం. డోర్ బెల్ కొడితే ఆయనే స్వయంగా తలుపు తీశారు. ‘‘ఎలా ఉన్నావు? నాన్నగారు కులాసానా? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు?’’ అని అడిగారు. ‘‘బాగానే ఉన్నానండి. నాన్నగారు బావున్నారు. ఇప్పుడు ‘పార్క్’ అని ఒక లవ్‌స్టోరీ చేస్తున్నానండి. త్వరలో రిలీజ్’’ అన్నాను. ‘‘బావుంది. చిన్న సినిమాలు ఈ మధ్య బానే ఆడుతున్నట్టున్నాయ్’’
‘‘అవును సార్. మీరు ఫాలో అవుతున్నారా?’’
‘‘ఎందుకవ్వను? నెట్లో కూచుంటే సినిమాలు చూస్తూనే ఉంటాను. థియేటర్‌కి వెళ్లడం ఈ మధ్య తగ్గింది కాబట్టి సీడీల్లో చూస్తున్నాను’’ అని చిన్న గ్యాప్ ఇచ్చి, ‘‘పైరసీ కాదులే’’ అన్నారు.
నేనూ నవ్వాను.
ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరెందుకు సార్ పబ్లిసిటీకి, ఇంటర్వ్యూలకి దూరంగా ఉంటారు?
‘‘నాకేమి తెలుసని మాట్లాడాలి? నా గురించి ఏవన్నా ఉంటే రమణగారు చెప్పారు. మిగిలినవి ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకున్నారు. నేను చెప్పడానికేమీ లేదు’’ అన్నారు క్లుప్తంగా.
కషాయ: చేదు....
మాత్ర మింగుదామంటే గొంతులో ఆగిపోయినట్టుంది నా పరిస్థితి!
ఈయనతో నాలుగు నిముషాలకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదేమో అనుకున్నాను మనసులో! కానీ, అది నాలుగున్నర గంటల నాలెడ్జ్ నదీ ప్రవాహం అవ్వబోతోందని ఆ నిమిషంలో నాకు తెలీదు.
‘‘మీరే మీకేమీ తెలీదంటే, ఎంతో కొంత తెలుసనుకుని కాన్ఫిడెంట్‌గా బతికేస్తున్న మాలాంటి వాళ్లకి కన్ఫ్యూజన్, డిప్రెషన్ వచ్చేస్తాయండి. మీకు చాలా తెలుసని ఒప్పుకోండి ప్లీజ్’’
పెద్ద మనసుతో, చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు, నన్నేమీ అనకుండా. ‘రావికొండలరావుగారు ఎలా ఉన్నారు? కలుస్తున్నారా?’ అని అడిగారు.
‘‘నాన్నగారు ఆయనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారండి. ఇవాళ కూడా వాళ్లింటికే భోజనానికి వెళ్లారు. నేను కొంచెం తక్కువే...’’ అంటూ... ‘‘మీ ‘పెళ్లిపుస్తకం’ కథ రావికొండలరావు గారిదే కదా! ఆయనకి ఉత్తమ కథకుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. మీరు తీసిన సినిమాల్లో బైట కథలు తీయడం అదొక్కటేనా సర్?’’ అన్నాను.
‘‘రమణగారు, నేను వేరే కథ చర్చిస్తున్నాం. అనుకోకుండా కొండలరావు గారు కలిసినపుడు ఈ లైన్ చెప్పారు. బావుందనిపించి అది పక్కన పెట్టేసి ఇది చేయడం మొదలుపెట్టాం’’
‘‘ఎంత బాగా తీశారు సర్! సినిమా చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు ఇంటర్మీడియెట్ కాబట్టి కుదర్లేదు. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి కొన్నేళ్ల దాకా ఎవరింట్లో పెళ్లికెళ్లినా మా సైడ్ నుంచి ఆ సినిమా విహెచ్ఎస్ క్యాసెట్టే గిఫ్ట్’’
‘‘అవును చాలామంది అదే చెప్పేవారు’’
‘‘కృష్ణంరాజుగారు ప్రభాస్‌తో ‘భక్తకన్నప్ప’ మళ్లీ తీస్తానని ఏదో ఇంటర్వ్యూలో అన్నారు. మీ డెరైక్షన్లోనేనా?’’ అన్నాను.
‘‘ఆ విషయం నాకు తెలీదు గానీ, మొన్నామధ్య భరణిగారు సునీల్ హీరోగా తీస్తున్నానని చెప్పారు’’
‘‘ఓ... రైట్స్ అడిగారా?’’
‘‘పురాణం కథలకి రైట్స్ ఏవిటి నా మొహం... ఎవరికి నచ్చితే వాళ్లు తీస్కోవచ్చు. భరణిగారు శివుడిపైన మంచి మంచి పాటలు రాశారు. మీరు వినే ఉంటారు... ఆటగదరా శివా... అని, గంగావతరణం అని... బహుశ వాటిని సినిమాకి ఉపయోగించే అవకాశం భక్తకన్నప్పతో వస్తుందనుకుంటాను’’ అన్నారు.
‘‘నెక్ట్స్ ఏవన్నా ప్లాన్ చేస్తున్నారా సర్...’’
‘‘ఏమీ అనుకోలేదండి...’’
‘‘మీరు, రమణగారు ‘శ్రీరామరాజ్యం’ తర్వాత చేద్దాం అనుకున్న స్క్రిప్టు ఏదైనా ఉందాండి?’’
‘‘ఆ సినిమా మధ్యలోనే వారు కాలం చేశారు కదా! మేం ఎప్పుడూ ఓ సినిమా మధ్యలో ఇంకో సినిమా గురించి ఆలోచించలేదు. ఒక సినిమా అయ్యాక కొంత గ్యాప్ తర్వాతే ఇంకో సినిమా గురించి ఆలోచించడం మొదలుపెట్టేవాళ్లం’’
‘‘మీ సినిమాలంటే పడి చచ్చిపోయే నిర్మాతలున్నారు సర్... జీవితకాలంలో మీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా తియ్యాలని ఉందని నాతో కొంతమంది మంచి వ్యాపారవేత్తలు అన్నారు కూడా...’’
‘‘అలా అన్నవాళ్లూ ఉన్నారు, అలాగే అని మమ్మల్ని చీట్ చేసిన వాళ్లూ ఉన్నారు’’ అన్నారు నిర్లిప్తంగా.
‘‘ఛ... మిమ్మల్నెవరు మోసం చేస్తారు సార్... మీరిద్దరూ చాలా సీనియర్లు! ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ సమకాలీనులు, స్నేహితులు. మిమ్మల్ని చీట్ చేయగలరా? పైగా, మీ సినిమాలన్నీ మీ పేర్ల మీదే సేల్ అవుతాయి గదా!’’ అన్నాను.
‘‘అలాగే అమ్మేవాళ్లు... తీరా డబ్బులొచ్చాక మాకెగ్గొట్టిన ప్రొడ్యూసర్లున్నారు. నా దగ్గర లేవని అడ్డం తిరిగిన వాడిని మేం దబాయించేవాళ్లం కాదు. వదిలేసే వాళ్లం’’
‘‘అయ్యో....’’
కొంచెంసేపటి తర్వాత నేనే అన్నాను...
‘‘ఎలాగైనా మీ సినిమాలు అనుకరించడం గానీ, కాపీ కొట్టడం కానీ కుదరని పనండి. పూర్తిగా వేరే బాణీ మీది’’
‘‘అదేం లేదు. షాట్లు తీయడంలో ఎవరి స్టైల్ వాళ్లదనుకో - కథని, సీన్స్‌ని కూడా కాపీ కొట్టేవాళ్లున్నారు. ఓసారి రమణగారు రైటర్స్ అసోసియేషన్‌లో కంప్లైంట్ చేస్తే, ఓ ప్రబుద్ధుడు ‘ఓ మీరింకా బతికే ఉన్నారా?’ అని ఆయన మొహం మీదే అడిగాడు ఇరవయ్యేళ్ల క్రితం. దాంతో ఆయనకి ఇంకా ఒళ్లు మండి ఆ ఇష్యూని ఫార్వర్డ్ చేశారు. అప్పటికీ వాడు పశ్చాత్తాపపడకపోగా, రమణగారితో ‘అదేంటండీ! మీ సినిమాలు చూసి మేం ఇన్స్పైర్ అయి తీస్తే... మీ తరం వారు సంతోషిస్తారనుకున్నాంగానీ ఇలా బాధపడతారేంటి?’ అన్నాట్ట’’
‘‘మొత్తం మీద అసోసియేషన్ కాంపెన్సేట్ చేసిందా సర్?’’
‘‘కొంత చేసింది. దాన్ని పక్కన పెడితే, అప్పట్లో ఆ కాపీ కొట్టినవాడు చాలా పీక్‌లో ఉన్నాడు. పీకల్దాకా పొగరుండేది... కానీ, ఎలా ఎదిగాడో, అలాగే డౌనయ్యాడు. అంతే! ప్రారబ్ధం.’’
‘‘రమణగారిని ఇంకో దర్శకుడు చాలా బాధపెట్టాడని విన్నాను సర్. ఆయనే మాటలు రాయాలని పట్టుబట్టి, హైదరాబాద్ తీసుకొచ్చి, గెస్ట్‌హౌస్‌లో పెట్టి ఇరవైరోజులు ఎడ్రస్ లేకుండాపోయి, తర్వాత ఫోన్ చేస్తే - ‘ఓ మీరింకా ఇక్కడే ఉన్నారా? ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, మళ్లీ పిలిపిస్తాను రండి’ అన్నాట్ట కదా! దానికి రమణగారు చాలా బాధపడ్డారని తెలిసింది..?’’
‘‘మాకు ఇలాంటివి ఇంకా ఎన్నో జరిగాయి. ఇప్పుడు తల్చుకోవడం అనవసరం. ఏ జనరేషన్‌కి ఆ జనరేషనే - కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అందరూ సుఖపడుతూనే పైకొచ్చారనుకోవడం తప్పు. ఏదేమైనా, మేం మా సొంత సంస్థలో సినిమాలే హాయిగా తీశాం. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఎవర్నీ ఏమీ అనుకునే పనిలేదు. నిర్మాతగా రమణగారు నా వరకూ ఏ కష్టమూ రానీయలేదు’’
కటు: కారం... ఛీత్కారం....
‘‘మీ సొంత సినిమాల్లో పైచేయి డెరైక్టర్‌గా మీది వుండేదా? రైటర్ కమ్ ప్రొడ్యూసరైన రమణగారిదా?’’
‘‘ఏ రోజూ రమణగారు నా వర్క్‌లో వేలు పెట్టలేదు. ఇద్దరం కొన్నాళ్లపాటు చర్చించుకున్నాక ఆయన రైటర్‌గా ఫుల్ వెర్షన్ రాసిచ్చేవారు. చిన్నప్పట్నుంచి ఆయన చేతి రాత నాకే బాగా అర్థమయ్యేది కాబట్టి, నేనది ఫెయిర్ కాపీ చేస్తూ పక్కనే బొమ్మలేసుకునేవాణ్ని. అది నా హోమ్‌వర్క్ అన్నమాట! అలా స్టోరీ బోర్డ్ కంప్లీట్ అయ్యాక నేను కాన్ఫిడెంట్‌గా సెట్కెళ్లేవాణ్ని’’
‘‘మీరు ఎక్కువగా మాట్లాడరు కదా? సెట్లో ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మీ స్టోరీ బోర్డ్ ఇచ్చేసేవారా?’’
మళ్లీ పెద్దమనసు చేసుకుని, చిన్నగా నవ్వుతూ - ‘‘సెట్లో నా స్టోరీబోర్డ్ ఎవ్వరికీ అర్థం కాదు... నాకు తప్ప! నేను ఎక్కువ మాట్లాడనంటే... అనవసరమైన విషయాల్లో ఎక్కువ మాట్లాడననిగానీ, సెట్లో డెరైక్టర్ గా అవసరమైనవన్నీ చెప్పనని కాదు. ఆర్టిస్టులకి యాక్షన్ కూడా చేసి చూపిస్తాను’’
మీరా? అని అనబోయి, మళ్లీ పెద్ద మనసు చేసుకుంటారని భయమేసి ఆగిపోయాను.
‘‘మీరు ఎవ్వరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయకుండానే డెరైక్ట్‌గా ‘సాక్షి’తో డెరైక్టరైపోయారు. పైగా ఆ సినిమా మీకు చాలా మంచి పేరు తెచ్చింది..’’
‘‘ఎవ్వరిదగ్గరా పని చెయ్యలేదు కానీ, రమణగారితో షూటింగులకి వెళ్తుండేవాణ్ని. చాలా సినిమాలు మేం కలిసే చూసేవాళ్లం, డిస్కస్ చేసుకునేవాళ్లం. ‘సాక్షి’కి మంచిపేరు వచ్చినా, పర్సనల్‌గా నా వర్క్ నాకు సంతృప్తిగా అనిపించలేదు. నేను మళ్లీ చూసినప్పుడు నా డెరైక్షన్ నాకు నచ్చలేదు. అయినా అది బాగా ఆడిందంటే ఆ క్రెడిట్ మొత్తం రమణగారి కథనం, మాటలు; కృష్ణ-విజయనిర్మలగార్ల యాక్టింగ్... అదే ‘సాక్షి’కి హైలైట్!
‘‘మీ ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాకి కో-డెరైక్టర్ కె.వి. రావుగారి ద్వారా అప్రెంటిస్‌గా అవకాశం వచ్చింది నాకు. అదే సమయంలో రావికొండలరావుగారి ద్వారా సింగీతం గారి ‘బృందావనం’ సినిమాకి అబ్జర్వేషన్ ఛాన్స్ వచ్చింది. రెండిట్లో హీరో రాజేంద్రప్రసాద్గారే. మీరు హైదరాబాద్‌లో, సింగీతంగారు చెన్నైలో. చెన్నైలో పనిచేయాలన్న యాంబిషన్ కోసం మీ సినిమా త్యాగం చేశాన్నేను. ఆ బాధ ఉండకూడదనే మీ ‘శ్రీరామరాజ్యం’ సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా వచ్చి మీకు సహాయంగా ఉంటానని నేను ఫోన్ చేసి అడిగితే మీరు వద్దన్నారు. ఎందుకని?’’
‘‘అప్పటికే మీరు ఏడెనిమిది సినిమాలు తీసిన డెరైక్టరు. మీరు మళ్లీ అసిస్టెంట్ డెరైక్టరుగా రావడం నాకిష్టం లేదు. మీరింకా చాలా సినిమాలు తీయాలి. బోలెడు సక్సెస్, పేరు, డబ్బు సంపాదించుకోవాలి’’
మమకారం- మధుర: తీపి
లేచి వెళ్లి పాదాభివందనం చేశాను.
‘‘నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ నాన్నగారంటే చాలా అభిమానం నాకు. మంచి వ్యక్తి’’
‘‘నాన్నా! నువ్వెంత అదృష్టవంతుడివి? బాపుగారితో ప్రశంస....’’ (అనుకున్నాను మనసులో)
‘‘ఇంతకీ మీకు చిత్రలేఖనం ఎలా వచ్చిందండి? సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు?’’ అన్నాను.
‘‘మా నాన్నగారే. ఆయన అడ్వకేటు. ఆయనకి డ్రాయింగ్, పెయింటింగ్ హాబీ. అది నాకూ అలవాటయింది. కానీ నాన్నగారికి చిత్రలేఖనం హాబీయేగానీ, దాన్ని వృత్తిగా చేసుకోవడం ఇష్టం లేదు. కూడు, గుడ్డ పెట్టదనేవారు. అందుకే నన్ను కూడా ‘లా’ చదివించారు కానీ, అది హాబీ అయింది’’
చమత్కారం.... ఆమ్ల: పులుపు
‘‘కోర్టుకి ఒక్కసారే వెళ్లాను... అది డిగ్రీ పూర్తయ్యాక, బార్ కౌన్సిల్లో పేరు ఎన్రోల్ చేయించుకోవడానికి’’ అన్నారు బాపుగారు.
‘‘కేసులేవన్నా వాదించారా?’’
‘‘అబ్బే.... ఒక్క కేసూ వాదించలేదు. మళ్లీ కోర్టుకెప్పుడూ వెళ్లలేదు కూడా’’ అన్నారు నవ్వుతూ.
‘‘మీరు వాదించడం ప్రాక్టీసు చేసుంటే మీ నిర్మాతల నుంచి రావల్సిన బకాయిలన్నీ వసూలైపోయేవి’’
పెద్దమనసు చేసుకుని, మళ్లీ చిన్నగా నవ్వారు.
ఫొటోగ్రాఫర్ శివ మౌనంగా కెమెరాతో తన పని తను చేసేస్తున్నారు. కానీ మధ్యమధ్యలో మంచి ఉపయోగపడే ప్రశ్నలు ఒకటిరెండు సంధించారు...
‘‘అన్నీ తెలిసిన మీరే ఇంత అణకువగా ఉంటే... ఏవీ రాని వాళ్లు మీ ఎదురుగా విర్రవీగుతున్నప్పుడు వాళ్లని చూస్తే మీకేమనిపిస్తుంది?’’ అంటూ...
జాలేస్తుందనో, నవ్వు వస్తుందనో, చిరాకొస్తుందనో చెప్తారనుకున్నాను.
‘‘నేనెవ్వరినీ జడ్జ్ చేయను. ఒకళ్లని జడ్జ్ చేయడం చాలా కష్టం. నా దృష్టిలో అది చాలా తప్పు కూడా’’ అన్నారు.
ఏదో సైకాలజీ బుక్‌లో చదివిన లైను జ్ఞాపకం వచ్చింది నాకు. ‘‘ఇఫ్ యు స్టార్ట్ జడ్జింగ్ సమ్‌వన్, యు విల్ స్టాప్ లవింగ్ దెమ్’’ అని!
ఇంతలో ప్రస్తావన పుస్తకాల మీదకు మళ్లింది. ఆయనకి నచ్చిన పుస్తకాలు, ఆయన మెచ్చిన పుస్తకాలు, ఆయన్ని మలచిన పుస్తకాలు... సంభాషణ అలా కొనసాగుతుండగా డ్రాయింగ్ రూమ్‌లోకి ఎంటరయ్యాం. ఆ టైంలో ఆయన మాతో పంచుకున్న ఒకటిరెండు విషయాలు... ‘‘నా ప్రతి సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకాలు కనపడే షాట్ తప్పనిసరిగా తీస్తాను. పుస్తక పఠనా ప్రాచుర్యం పెంచడానికి ఆ మార్గం ఎంచుకొమ్మని సూచించింది నా గాడ్ ఫాదర్లాంటి వాడైన ఈజెన్‌బర్గ్ (ఫోర్డ్ పౌండేషన్ సౌత్ ఇండియన్ పబ్లిషింగ్ హెడ్)’’ అని!
సరదాగా మరోటి - ‘‘ఓ రోజు మా ఇంట్లో దొంగలుపడ్డారు. ఏవో కొన్ని వస్తువులు, కొంత క్యాష్ పట్టుకుపోయారు. రమణగారి చిన్నల్లుడు తనకి తెలుసని ఈ ఏరియా ఎస్సైని, కానిస్టేబుల్ని తీసుకొచ్చాడు. ఆయన ఇల్లంతా చూసి, నా డ్రాయింగ్ రూమ్‌లోకి వచ్చారు. పాపం దొంగలు ఇలా చిందరవందర చేసేశారా... ఇప్పుడివన్నీ సర్దుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది... అన్నారు సిన్సియర్‌గా. ‘అది నా రూమ్. అదెప్పుడూ అలాగే ఉంటుంది. దొంగలు ఆ గదిలోకి రాలేదు’ అన్నాను. అప్పుడాయన ఫేస్ చూసి ఇంటిల్లిపాదీ నవ్వుకున్నాం.
లవణ: ఉప్పు... నష్టంలోంచి పుట్టిన హాస్యం కాబట్టి!
‘రమణగారు లేని జీవితం ఎలా ఉందండి’ అని ఉన్నట్టుండి అడిగారు ‘సాక్షి’ సినిమా డెస్క్ ఇన్‌ఛార్జి పులగం చిన్నారాయణ.
నేను కంగారుపడ్డాను. ఈ ఉగాది పచ్చడిలో నేను చూడకూడదనుకున్న రుచి అదొక్కటే. కానీ, అది కూడా లేకపోతే పూర్తిగా, పూర్ణంగా ఉండదనుకున్నారేమో చిన్నారాయణ. బాపుగారు కదిలిపోయారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో రమణగారి అనాయాస మరణాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
‘‘నన్ను గోడలేని చిత్తరువుని చేసి ఒంటరిగా వెళ్లిపోయావా వెంకట్రావూ!’’
అన్నమయ్య కీర్తనలో భావాన్ని రమణగారికి అన్వయించి బాపుగారు వేసుకున్న బొమ్మ - రమణగారి నవ్వుతున్న మొహం.
వెంకటరమణుడిపై భక్తి అన్నమయ్యది.
ముళ్లపూడి వెంకటరమణుడిపై భక్తి, స్నేహం, గౌరవం బాపుగారిది.
‘‘రమణగారు లేని జీవితం ఊహించలేనిది’’ అన్నారు కన్నీళ్లతో!
తిక్త: వగరు... తప్పనిసరైన నిజాన్ని అంగీకరించడం వగరే.
చెన్నైలో పుట్టి, పెరిగిన తెలుగువారు కాబట్టే తెలుగుదనం వారి ఊహల్లో అంత అందంగా, సున్నితంగా, ఆహ్లాదంగా ఉండి ఉంటుందనిపించింది.
ఒకరు తన ‘రాత’ని ధారపోశారు....
ఒకరు తన ‘గీత’తో దానికి ప్రాణం పోశారు...
ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంతకన్నా మధురమైన స్నేహం ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్యా ఉండదు.
మళ్లీ మధుర: తీపి...
తెలుగువారికి ఇంతకన్నా షడ్రసోపేతమైన ఉగాది ఉంటుందని నేననుకోను. బాపుగారికి అస్సలు ఏ మాత్రం ఇష్టంలేని ఈ పని చేసినందుకు రేపు ఆయన పేపర్లో చూసి, చదివి, మళ్లీ పెద్దమనసు చేసుకుని, చిన్నగా నవ్వేస్తారని ఆశిస్తూ.....
మీ
వి.ఎన్.ఆదిత్య
బొమ్మ పూర్తిగా గీస్తేగానీ సంతకం పెట్టనన్నారు...
నన్ను ఇన్స్పైర్ చేసేది సంగీతం మాత్రమే! కాలేజీ రోజుల్లో మౌత్ ఆర్గాన్ వాయించేవాణ్ని.
బడేగులామ్ అలీఖాన్, మెహదీహసన్ గాత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేస్తాను. బడేగులామ్ అలీఖాన్ కచేరీలకి పి.బి.శ్రీనివాస్ తీసుకెళ్లేవాడు. కానీ, ఆయన్నెప్పుడూ కలవలేదు. మెహదీహసన్ని మాత్రం ఒకసారి కలిశాను. ఆయన పెయింటింగ్ మీద సంతకం పెట్టివ్వమని అడిగాను. పెయింటింగ్ చూసి ‘నా హార్మోనియం సగమే గీశావ్, పూర్తిగా గీసి పట్రా అప్పుడే సంతకం’ అన్నారు. పెద్దవాళ్లకి వాళ్ల కళంటే అంత అభిమానం!
అబ్దుల్ కరీమ్‌ఖాన్ అనే క్లాసికల్ సింగర్ దగ్గరికి ఓ అభిమాని వచ్చి - ‘నేను జాబ్‌కి లీవ్‌పెట్టి ఒక మూడు నెలలు మీ దగ్గర సంగీతం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను’ అన్నాట్ట! దానికాయన తన చేతిలో నున్నగా ఉన్న పొన్నుకర్ర చూపించి, దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిముషాల్లో తయారుచేస్తారు. కానీ నా అరచేయి కింద ముప్ఫై ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు... అన్నారట. ఏ విద్యలోనైనా ప్రాక్టీస్ చాలా అవసరం. నిరంతరం అదే పనిలో ఉండాలి.
ఇప్పటికీ నేలమీద కూర్చునే బొమ్మలేస్తాను!
నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ‘బాల’ పత్రికలో రమణగారు కథలు, వ్యాసాలు రాస్తున్నప్పుడు రేడియో అన్నయ్య, బాల సంపాదకులు న్యాయపతి రాఘవరావుగారు బొమ్మలు గీయమని నన్ను బాగా ప్రోత్సహించేవారు. మదరాసులోని మూర్ మార్కెట్‌కి శని, ఆదివారాలు తీసుకెళ్లి, కావలసిన పుస్తకాలు, పెయింటింగ్ బ్రష్‌లు, డ్రాయింగ్ షీట్లు, రంగులు కొనిచ్చేవారు.
‘‘ఆనంద వికటన్’’ పత్రికలో గోపులుగారనే ఆర్టిస్టు బొమ్మలు వేసేవారు. నాకు వారంటే చాలా ఇష్టం. వారింటికి వెళ్లి బొమ్మలెలా వేస్తారా! అని పరిశీలిస్తూ నేర్చుకునేవాణ్ని.
ఒక్కోసారి రోజుకి పద్దెనిమిది గంటలు బొమ్మలేసేవాణ్ని. ఇప్పటికీ నేలమీద కూర్చునే బొమ్మలేస్తాను.
అమెరికాలో, లండన్‌లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టారు.
నాకు జుత్తు లేదు గానీ, ఇంతమంది అభిమాన చిత్రకారులున్నారు.
మా అమ్మాయి బాగా బొమ్మలేస్తుంది. మా రెండో అబ్బాయి కూతురు (మనవరాలు) దానికి ఎనిమిదేళ్లు అది కూడా బాగా బొమ్మలేస్తుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు - మనవళ్లు, మనవరాళ్లకి నేర్పించరా - అని! దానికి నా సమాధానం ఒకటే - నేనే నిరంతర విద్యార్థిని, నాకొస్తే కదా వాళ్లకి నేర్పించడానికి - అని!
ఈ తరం దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్‌లు జీనియస్‌లు!
నేనొక సినిమాబఫ్ని! ఇప్పటికీ వీడియోలో రోజుకి పది సినిమాలు చూస్తాను.
నేను చేసే హోమ్‌వర్క్ వల్ల ఫిల్మ్ నెగెటివ్ తక్కువ ఎక్స్పోజ్ చేస్తాను.
‘సీతాకల్యాణం’లో మా గురువుగారు పిలకా నరసింహమూర్తిగారుగీసిన దశావతారాలు బొమ్మలు వాడాను.
ఇషాన్ ఆర్య, బాబా అజ్మీ, పీఆర్‌కె రాజు, రవికాంత్ నగాయిచ్ నా కెమెరామెన్లలో ఎక్కువ నాతో వర్క్ చేశారు.
నాతో పని చేయాలంటే నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే కష్టం.
పాతవన్నీ గొప్పవి అనుకోవడం తప్పు. ఈ రోజుల్లో కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. ఈ తరం తెలుగు దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్‌లు జీనియస్‌లు. పరిస్థితులకి తలవంచకుండా సినిమాలు తీస్తున్నారు.
రమణగారి చొక్కా పట్టుకుని పైకొచ్చేశాను!
నాకు ఎనిమిదేళ్లు, రమణగారికి పదేళ్లు ఉన్నప్పట్నుంచి మా స్నేహం.
చిన్నప్పట్నుంచి నేను, రమణగారు హాలీవుడ్ సినిమాలన్నిటికీ నేల టిక్కెట్ తీసుకుని వెళ్లేవాళ్లం. ప్రతి శుక్రవారం మౌంట్రోడ్కెళ్లి మూడు సినిమాలు వరసగా చూసి వచ్చేవాళ్లం. సినిమా, సినిమాకి మధ్యలో ఒక టీ తాగి, బిస్కెట్టు తినడం... అంతే!
నాకు నలుగురితో మాట్లాడాలంటే భయం. జలగండంలాగ నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. కానీ, రమణగారు అలా కాదు. ఇండస్ట్రీలోనూ, బయటా ఆయనకు చాలామందితో మంచి అనుబంధం ఉంది. రామారావుగారు, నాగేశ్వరరావుగారు లాంటి పెద్ద నటులంతా మాతో అన్ని సినిమాలు చేశారంటే ఆయనతో ఉన్న అనుబంధం వల్లే!
రమణగారు వర్క్ చేయకుండా నేను ఏ ఒక్క సినిమా తీయలేదు.
నేను పైకి రావడానికి నా ప్రతిభేం లేదు... రమణగారి చొక్కా పట్టుకుని పైకొచ్చేశాను!