VPN
-
గూగుల్ క్రోమ్ యూజర్లకు ముఖ్య గమనిక!
ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. తద్వారా వీపీఎన్ అవసరం లేకుండా వెబ్సైట్లలోని ఐపీ అడ్రస్‌లు కనిపించకుండా హైడ్ చేసుకోనే అవకాశం యూజర్లకు కల్పించనుంది. సాధారణంగా ఐపీ అడ్రస్‌ను ఉపయోగించి క్రోమ్ యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.దీన్ని నివారించేలా గూగుల్ ప్రాక్సీ సర్వర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో ఒరిజనల్ ఐపీ అడ్రస్ స్థానంలో ట్రాక్ చేసేందుకు వీలులేకుండా గూగుల్ ప్రొక్సీ ఐపీ అడ్రస్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా, యూజర్ల ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుందని ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రియానా గోల్డ్‌స్టీన్ మాట్లాడుతూ..అమెరికాలో ఎంపిక చేసిన క్రోమ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. వీళ్లు మాత్రమే గూగుల్.కామ్, జీమెయిల్,గూగుల్ యాడ్ సర్వర్లతో పాటు గూగుల్ ఆదీనంలో ఉన్న డొమైన్లకు ఈ ప్రోక్సీ ఐపీ అడ్రస్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఉద్దేశం ఇదే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం క్రోమ్ వెబ్ సైట్ల ఐపీ అడ్రస్‌లను దాచడమే కాదు. యూజర్లను ట్రాక్ చేసేందుకు వినియోగించే కూకీలను సైతం బ్లాక్ చేస్తుంది. అయితే, ఐపీ అడ్రస్ మీద ఆధారపడే చట్టబద్ధమైన కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ యూజర్లకు హామీ ఇస్తోంది. ముందంజలో యాపిల్ ఈ లేటెస్ట్ టెక్నాలజీని యాపిల్ ఐక్లౌడ్ ప్రైవేట్ రిలే ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇది నెట్వర్క్ ప్రొవైడర్లు యాపిల్ వినియోగదారుల ఐపి అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ముందుగా డీఎన్ఎస్ రికార్డులను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. తరువాత వెబ్సైట్లను యాక్సెస్ చేసేందుకు తాత్కాలిక ఐపీ అడ్రస్‌ను క్రియేట్ చేసేలా థర్డ్ పార్టీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తుంది. థర్ట్ పార్టీ సైట్ల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా ప్రైవసీ ఆప్షన్లను మెరుగుపరచడానికి గూగుల్ తీసుకున్న చర్య, థర్డ్ పార్టీ కుకీల వల్ల ఎదురయ్యే సవాళ్లకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ప్రైవసీ శాండ్ బాక్స్‌ను విడుదల చేసింది. 2024 నాటికి కుకీలను నిలిపివేయాలన్నది గూగుల్ ప్రణాళిక. ఐపీ ప్రొటెక్షన్‌తో వెబ్ సైట్లలో వినియోగదారులను ట్రాక్ చేయడానికి థర్డ్ పార్టీ సైట్లను తగ్గించనుంది. -
గూగుల్ ఫారమ్ ఫిల్ చేస్తున్నారా?..6 లక్షల మంది భారతీయులపై హ్యాకర్ల పంజా!
పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్‌కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్(ఆన్లైన్ మార్కెట్ ప్లేస్) లో అమ్ముకున్నట్లు తేలింది. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. 2018 నుండి ప్రపంచంలో అతి పెద్ద వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ కు చెందిన లూథూనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్‌ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ వీపీఎన్ దృష్టిసారించగా..యూజర్ల వివరాలు బోట్ మార్కెట్లో లభ్యమవుతున్నట్లు గుర్తించింది. తన రిసెర్చ్‌లో భాగంగా ప్రధానమైన జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీ బోట్ మార్కెట్లతో పాటు దొంగిలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లు చెప్పింది. రూ.490కే నాటి నుంచి బోట్ మాల్వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది. ఆటో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారా? ఆటో ఫామ్స్ అంటే? ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్ ఎలా ఉందో తెలిపేలా లేదంటే.. ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుకు గూగుల్ ఫారమ్స్ తరహాలో ఆటో ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫారమ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 5లక్షల 38 ఆటో ఫారమ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్లు, వెబ్ క్యామ్ స్నాప్‌ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ తెలిపారు. డార్క్ వెబ్ వర్సెస్ బోట్ మార్కెట్ డార్క్ వెబ్ మార్కెట్ల కంటే బోట్ మార్కెట్లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక్క డివైజ్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రీడిస్ అన్నారు. ఐసీఎంఆర్‌పై 6వేల సార్లు దాడులు వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు.ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారు. విఫలమయ్యారు. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తుల ఐసీఎంఆర్ వైబ్ సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
గూగుల్ డ్రైవ్‌లు వాడొద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్!
క్లౌడ్ ఫ్లాట్ ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు..ప్రైవేట్ సంస్థలకు చెందిన థర్డ్ పార్టీ క్లౌడ్ ఫ్లాట్ ఫామ్స్ గూగుల్ డ్రౌవ్, డ్రాప్ బాక్స్‌లను వినియోగించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. వీటితో పాటు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు విధించింది. భారత్ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని,లేదంటే భారత్ నుంచి శాస్వతంగా నిష్క్రమించుకోవచ్చని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్‌లు భారత్‌లు వీపీఎన్ నెట్ వర్క్‌లను తొలగించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త వీపీఎన్ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..వీపీఎన్ చట్టాలకు సంబంధించి నేషనల్ ఇన్ఫ్రమెటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అన్నీ మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని,ఈ కీలక ఉత్తర్వులపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆమోదం తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీపీఎన్ సంస్థలకు కేంద్రం విధించిన నిబంధనలు ఇవే గత మే నెలలో కేంద్రం వీపీఎన్ సంస్థలపై నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి సదరు సంస్థలు వ్యవహరించాలని ఆదేశించింది. లేదంటే భారత్ నుంచి కార్యకలాపాలు నిలిపి వేయాలని సూచించింది. ఇక కేంద్రం వీపీఎన్ సర్వీసుల విషయంలో విధించిన నిబంధనల్ని ఒక్కసారి పరిశీలిస్తే ► సబ్స్క్రయిబర్, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి ► సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి ► యూజర్లకు ఐపీలను కేటాయించాలి ► రిజిస్ట్రేషన్ టైంలో.. ఈ-మెయిల్, ఐపీ అడ్రస్, టైమ్ స్టాంప్ వివరాలను పొందుపర్చాలి ► అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్ తెలియజేయాలి. ► సరైన చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలి. ► సబ్స్క్రయిబర్ల ఒనర్షిప్ ప్యాటర్న్‌ను సమర్పించాలి. అంటూ కేంద్రం వీపీఎన్ సర్వీసు సంస్థల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తుండగా.. తాజా కేంద్ర నిర్ణయంతో వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీ నష్టం చేకూరనుంది. వీటితో పాటు క్లౌడ్ సర్వీసులైన గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్‌ల వినియోగం నిలిపి వేయాలని కేంద్రం ఉద్యోగుల్ని ఆదేశించిందని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఎనీడెస్క్ సైతం వీపీఎన్, క్లౌడ్ సర్వీసెస్‌తో టీమ్ వ్యూయర్, ఎనీడెస్క్, యామ్వీ అడ్మిన్లను సైతం వినియోగించొద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, విధులకు సంబంధించిన కార్యకలాపాలపై జరిగిన ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను సైతం ప్రభుత్వేతర, థర్డ్ పార్టీ మెయిల్స్ వినియోగించొద్దని స్పష్టంచేసింది. రిమోట్, వర్చువల్ సమావేశాల థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు పొందవద్దని సూచించింది. చదవండి👉 వీపీఎన్ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన -
VPN: వీపీఎన్ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: వీపీఎన్.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇంటర్నెట్ను విపరీతంగా వాడే వాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంటర్నెట్ సురక్షిత వాడకంగానే కాదు.. నిషేధించిన, మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్ సేవలపై ఓ విమర్శ ఉంది. అయితే ఈ సేవలపై కేంద్రం ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి నడుచుకోవాలని.. కుదరదనుకుంటే భారత్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించొచ్చని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటన చేశారు. కేంద్రం ఇదే మొండి నిర్ణయంతో ముందుకు వెళ్తే.. వీపీఎన్ సేవలను ఉపయోగిస్తున్న 27 కోట్ల మంది యూజర్లపై ప్రభావం పడడం ఖాయం. భారత్ చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా ఉండనివాళ్లకు అవకాశం ఇచ్చేదే లేదు. కుదరదని అనుకుంటే.. నిర్మొహమాటంగా సర్వీసులను దేశంలో నిలిపివేసుకోవచ్చు అని స్పష్టం చేశారాయన. అంతేకాదు వీపీఎన్ కంపెనీలు, డేటా సెంటర్ కంపెనీలు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ప్రొవైడర్లు.. యూజర్ల డాటాను కనీసం ఐదేళ్లపాటు భద్రపరచ్చాల్సిందేనని స్పష్టం చేశారాయన. కొత్త రూల్ సైబర్ సెక్యూరిటీ లొసుగులకు దారితీయవచ్చని, సైబర్ దాడులు జరగవచ్చని కొన్ని VPN కంపెనీలు పేర్కొన్నాయి. కానీ, ఈ వాదనను కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాత్రం తిరస్కరిస్తున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన టెక్ ఇండస్ట్రీ బాడీ ఐటీఐ (ఇందులో గూగుల్, ఫేస్బుక్, ఐబీఎం, సిస్కో లాంటి ప్రముఖ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి) నిబంధనలపై సమీక్షించుకోవాలని భారత ప్రభుత్వ ఆదేశాన్ని సవరించాలని కోరింది. కానీ, భారత్ మాత్రం అందుకు ససేమీరా చెబుతోంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగానే నడచుకోవాలని స్పష్టం చేస్తోంది. దేశంలోని సైబర్ వాచ్‌డాగ్‌గా పేరున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ద్వారా ఈ ఆదేశాన్ని జారీ చేసింది కేంద్రం. కొత్త మార్గదర్శకాలు 60 రోజుల జారీ తర్వాత అమలులోకి వస్తాయి. ఇప్పటికే జారీ కాగా.. జూన్ చివరి నాటికి అమలులోకి రానున్నాయి. వీపీఎన్ సర్వీసుల విషయంలో నిబంధనలు ► సబ్స్క్రయిబర్, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి ► సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి ► యూజర్లకు ఐపీలను కేటాయించాలి ► రిజిస్ట్రేషన్ టైంలో.. ఈ-మెయిల్, ఐపీ అడ్రస్, టైమ్ స్టాంప్ వివరాలను పొందుపర్చాలి ► అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్ తెలియజేయాలి. ► సరైన చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలి. ► సబ్స్క్రయిబర్ల ఒనర్షిప్ ప్యాటర్న్‌ను సమర్పించాలి మెజార్టీ యూజర్లు వీటిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఇవేవీ చేయలేవు గనుకే వీపీఎన్ ప్రొవైడర్లు వెనకాడుతున్నాయి. -
క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..!
క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వీటి వాడకం ఎంతగా ఉందో..అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయి. అమాయక ప్రజలను మోసం చేస్తూ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను కొట్టేసి, డబ్బులను లాగేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. వీరి నుంచి దూరంగా ఉండేందుకుగాను క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఇతరులతో పంచుకోవద్దంటూ బ్యాంకులు కూడా హెచ్చరిస్తుంటాయి. ఇక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును హ్యాక్ చేయడానికి కేవలం ఆరు సెకన్ల సమయం సరిపోతుందంటూ ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గ్లోబల్ వీపీఎన్ సర్వీసెస్ ప్రొవైడర్ నార్డ్‌వీపీఎన్ అనే సంస్థ క్రెడిట్, డెబిట్ కార్డుల హ్యకింగ్‌పై ఒక నివేదికను రిలీజ్ చేసింది. కోవిడ్ 19 కారణంగా ఆన్లైన్ లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. ఇప్పుడు ఇదే సైబర్ నేరస్తుల పాలిట వరంలా మారిందని నార్డ్ వీపీఎన్ పేర్కొంది. 140 దేశాల నుంచి 40 లక్షల కార్డు పేమెంట్లను పరిశీలిస్తే.. బ్రూట్ ఫోర్స్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఎక్కువగా హ్యాక్ చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి మోసాలు చాలా వేగంగా జరుగుతాయని, కేవలం సెకన్ల వ్యవధిలోనే సదరు డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్ల నుంచి డబ్బులను ఇట్టే స్వాహా చేస్తోన్నట్లు పేర్కొంది. డార్క్ వెబ్‌లో వివరాలు..! పెద్ద సంఖ్యలో కార్డు పేమెంట్స్ వివరాలు డార్క్ వెబ్‌లో కనిపించడానికి ముఖ్య కారణం బ్రూట్ ఫోర్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సదరు డెబిట్, క్రెడిట్ కార్డుల నెంబర్లను, సీవీవీను అంచనా వేస్తున్నారని నార్డ్‌వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజూస్ బ్రిడీస్ తెలిపారు. హ్యకింగ్‌లో భాగంగా.. తొలి 6 - 8 డిజిట్స్ అనేవి కార్డు ఇష్యూయర్ ఐడీ నెంబర్‌ను సూచిస్తుండగా...ఇక మిగతా 7 - 9 నెంబర్లను హ్యాకర్లు గెస్ చేస్తే సరిపోతుందని తెలిపారు.దీంతో హ్యకర్లు సులువుగా కార్డులను హ్యక్ చేస్తున్నట్లు తెలిపారు. సెకన్లలో కార్డు డిటేల్స్..! మనం వాడే క్రెడిట్, డెబిట్ కార్డులపై 16 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. కార్డుల నెంబర్లను గేస్ చేయడానికి అనేక కాంబినేషన్లను ప్రత్యేకమైన కంప్యూటర్ సహాయంతో సైబర్ నేరస్తులు హ్యక్ చేస్తోన్నట్లు బ్రీడిస్ అభిప్రాయపడ్డారు. గంటకు 25 బిలియన్ కాంబినేషన్లను ప్రయత్నించవచ్చని తెలిపారు. డెబిట్ , క్రెడిట్ కార్డులను సులువుగా హ్యక్ చేయడానికి వారికి కేవలం 6 సెకన్ల సమయం సరిపోతుందని వెల్లడించారు. ఈ చర్యలు కచ్చితంగా..! క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ ఎప్పటికప్పుడూ హెచ్చరికలను జారీ చేస్తోంది. పలు సూచనలు పాటించడంతో డెబిట్, క్రెడిట్ కార్డుల హ్యకింగ్ నుంచి దూరంగా ఉండవచ్చును. ► డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లు ఎప్పటికప్పుడు వారి నెలవారీ స్టేట్మెంట్లను సమీక్షించడం మంచింది. ► మీ బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి భద్రతా నోటిఫికేషన్‌కు త్వరగా స్పందించాలి. ► తక్కువ మొత్తంలో డబ్బును ఖాతాలో ఉంచుకోవడం బెస్ట్ ఆప్షన్. ► వివిధ ప్రయోజనాల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం మంచింది. ► ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు సదరు బ్యాంకులు అందించే తాత్కాలిక వర్చువల్ కార్డులతో లావాదేవీలను జరపడం ఉత్తమం. ► టెలిఫోన్లు/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ప్రకటనలను అసలు నమ్మకూడదు. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..! -
పండక్కి ఊరెళుతున్నారా?
‘అవును, మా ఇంట్లో అందరం కలిసి మా అమ్మమ్మగారి ఊరెళుతున్నాం. భలే ఆనందంగా ఉంది..’ అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్.. వంటి యాప్‌ల వేదికగా ఔత్సాహికులు చెబుతుంటారు. సన్నిహితులు, స్నేహితుల మధ్య తమ ఆనందాలను పంచుకోవాలనుకోవడం బాగానే ఉంటుంది. కానీ, ఈ విధానాల ద్వారా ‘ఫలానా వారి ఇంట్లో ఎవరూ లేరు’ అనే సందేశం పంపి, దొంగలకు మీ ఇంటి ‘కీ’ మీరే ఇచ్చినట్టవుతుంది. ఎంగేజ్మెంట్, విడాకులు, గర్భం దాల్చడం.. వంటివన్నీ సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్షిప్ స్టేటస్‌లను ప్రకటించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, తప్పులను అంగీకరించడం వరకే కాదు ‘స్వలింగ సంపర్కులం’ అంటూ లైంగిక గుర్తింపునూ ప్రకటిస్తున్నారు. అడ్డుకట్ట అవసరం పై వ్యక్తికరణలతో ఆన్లైన్ పరువు నష్టం, ట్రోలింగ్ భావప్రకటనా స్వేచ్ఛపై స్వల్ప, దీర్గకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్లైన్ దుర్వినియోగం మానసిక, శారీరక ఒత్తిడులను కలిగిస్తుంది. వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపు. విశ్వసనీయత, ఆర్థికపరమైనవే కాకుండా ఇతర విపరిణామాలకూ దారితీసే అవకాశాలే ఎక్కువున్నాయి. ఇటీవలి కాలంలో పోస్ట్‌లకు ప్రత్యుత్తరాలు, వ్యాఖ్యల ద్వారా సాంకేతిక దుర్వినియోగం అమితంగా జరుగుతోంది. మన ప్రొఫైలింగ్‌పై మన అదుపు ఉండటం లేదు. భావవ్యక్తీకరణకు హద్దులే లేనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తుంటే ఈ ప్రవాహాలకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి అని స్పష్టం అవుతుంది. అతి అనర్థమే! మన రెజ్యూమ్ చూసి జాబ్ ఎలా ఇస్తారో.. ప్రస్తుత రోజుల్లో మీ సోషల్ ప్రొఫైలింగ్ చూసి కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఎంచుకుంటున్నారనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. మనదైన సృజనను, ఉత్పత్తిని నలుగురితో పంచుకోవడానికి, ప్రోత్సాహం లభించడానికి సోషల్ మీడియా మంచి మార్గం. ప్రజలు కూడా మన గురించి సానుకూలంగా ఆలోచించేలా చేయడానికి ఇది గొప్ప మార్గంగా ఎంచుకుంటున్నారు. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి సరైన మార్గమైంది సోషల్ మీడియా. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. సోషల్ మీడియాలో పరస్పర చర్యల ఆధారంగా వ్యక్తి ప్రతి ప్రవర్తనా అంశాన్ని డాక్యుమెంట్ చేస్తుంది. దీనివల్ల సాంకేతిక సంస్థలు గతంలో మీరు వాడిన మీ వ్యక్తిగత పదాలు, చర్యలు, సంభాషణలు, ఫొటోలను దొంగిలించి, ఆ పై వాటిని పబ్లిక్ చేసే అవకాశాలు లేకపోలేదు. వాటిని తిరిగి నలుగురిలో పంచి, అవమానించే సందర్భాలూ కూడా ఉంటాయి. ఈ రోజుల్లో క్లిక్‌ల ద్వారా డబ్బు సంపాదన ఓ మార్గమైంది. ఎన్ని ఎక్కువ క్లిక్‌లు వస్తే ప్రకటనల ఆదాయం అంత పెరుగుతుంది.. కాబట్టి ‘ఫేమస్’ జాబితాలో ఉండాలనుకొని అడ్డూ ఆపు లేకుండా భావ వ్యక్తీకరణ జరుగుతోంది. గోప్యత తప్పనిసరి సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం వల్ల సైబర్‌స్టాకింగ్, లైవ్ లొకేషన్ డిస్క్లోజర్, సోషల్ ప్రొఫైలింగ్, ఫిషింగ్, ఐడెంటిటీ థెప్ట్, బ్లాక్‌మెయిలింగ్, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం,సెర్చ్ వారెంట్ లేకుండా ప్రభుత్వం వారిని తమ అధీనంలోకి తీసుకోవడం వంటివి .. ఇటీవల సమస్యలకు దారితీస్తుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే అవి మన జీవితాలను నాశనం చేస్తాయి. సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం కారణంగా డిజిటల్, వ్యక్తిగత, ఆరోగ్య శ్రేయస్సు సమస్యలపై ఆందోళన పెరుగుతుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను గందరగోళానికి గురి చేశాయి. సోషల్ మీడియా విధానం ఎలా ఉందంటే గోప్యతగా ఉండాల్సినదంతా బయటపెట్టాల్సిందే అన్నట్టుగా ఉంటోంది. వ్యక్తులను నిరోధించే మార్గం, ఇంటర్నెట్లో శాశ్వతంగా తొలగించేది లేదు. ఒకవేళ మీరు సెలబ్రిటీ లేదా వ్యాపారి లేదా రాజకీయ పార్టీ సభ్యుడు లేదా సామాజిక కార్యకర్త అయితే తప్ప మీ సోషల్ మీడియా ఖాతాలను ‘ప్రైవేట్’గా ఉంచడం తెలివైన పని. సోషల్ మీడియాలో మెరుగ్గా ఉండాలంటే.. ►Google రివర్స్ ఇమేజ్ చెక్ చేయండి. లేదా ఫొటో వెరిఫికేషన్ కోసం www.tineye.com ని ఉపయోగించండి. ►ఫొటో లేదా వీడియో ((https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) బ్రౌజింగ్ కోసం ఇన్విడ్ టూల్ కిట్ ఎక్స్టెషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ►సమాచారాన్ని పంచుకోవడం నియంత్రించడానికి కుకీలను బ్లాక్ చేయాలి. లేదంటే గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాలి. ►సోషల్‌మీడియాలో షేర్ చేసే వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయాలి. అజ్ఞాత లేదా ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేయాలి. ►అవసరమైతే వర్చువల్ ప్రైవేట్నెట్వర్క్ (VPN)ని ఉపయోగించాలి. ►వెబ్సైట్, రూటర్ యాడ్–బ్లాక్‌లను ఉపయోగించాలి. ►ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో మెసేజ్ అప్లికేషన్లను ఉపయోగించాలి. ►పెద్ద అక్షరం, ప్రత్యేక అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. ►రెండు కారకాల ప్రమాణీకరణ, సురక్షిత క్లౌడ్‌ను సెటప్ చేసుకోవాలి. ►మీరు క్లిక్ చేసే లింక్ విషయంలో జాగ్రత్త అవసరం.https:// (ప్యాడ్‌లాక్ సింబల్)మాత్రమే ఉపయోగించి వెబ్సైట్లను సెర్చ్ చేయండి. – ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇతర యాప్స్‌ను సైన్ ఔట్ చేయండి. ►హానికరమైన దాడులను నిరోధించాలంటే ప్రతి లింక్‌నూ క్లిక్ చేయకుండా ఉండటమొక్కటే ఉత్తమ మార్గం. ►ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెసెంజర్లను ఉపయోగించవచ్చు. ►ఆన్లైన్లో సున్నితమైన సమాచారాన్ని అంటే ఆర్థిక, లాగిన్ ఆధారాలు మొదలైన వాటిని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ►నిజ జీవితంలో మీకు తెలిసిన వ్యక్తులు, నమ్మకం కలిగిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వడం మంచిది. ►ఆన్లైన్–ఆఫ్‌లైన్ పరస్పర చర్యలు ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తపడాలి. -
అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కథ కంచికి!
ఇంటర్నెట్లో సైట్లను బ్లాక్ చేసినా మన దేశంలో అశ్లీల కంటెంట్ వీక్షణకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నాయి. ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లలోనూ వీటి హవా నడుస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు!. అశ్లీల కంటెంట్‌తో పాటు మార్ఫింగ్ వీడియోల తొలగింపు కోసం స్వయంగా రంగంలోకి దిగింది కేంద్రం. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల, మార్ఫింగ్ వీడియోల పని పట్టేలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలోని అకౌంట్లపై వేట(టు) మొదలైంది. ఈ మేరకు కేంద్ర సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ.. ట్విటర్, ఫేస్బుక్, టెలిగ్రాం అకౌంట్లలో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్, అశ్లీల వీడియోల అంశాన్ని ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయా అకౌంట్లను తాత్కాలికంగా లేదంటే పూర్తిగా నిషేధించడమో చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి కూడా. ఆ క్లిప్‌తో గుర్రు! గతంలో పోర్న్ సైట్ల బహిరంగ వీక్షణపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెలికామ్ ఆపరేటర్ల సహకారంతో ఈ చర్యకు ఉపక్రమించింది. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా అశ్లీల కంటెంట్ వైరల్ అవుతూ వస్తుండగా.. ఎప్పటికప్పుడు చర్యల ద్వారా కట్టడి చేస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉంటే ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం అసభ్య, అశ్లీల, మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయిన కేంద్రం.. ఐటీ రూల్స్ 2021 ద్వారా కట్టడికి ప్రయత్నిస్తూ వస్తోంది. అయినా కూడా కంటెంట్ వ్యాప్తి ఆగడం లేదు. కేవలం ఏజ్ లిమిట్ పర్మిషన్తో యూజర్లను ఆయా ప్లాట్‌ఫామ్స్ అనుమతిస్తుండగా.. కేంద్రం మాత్రం ఇది కుదరని కరాకండిగా చెప్తోంది. ఇంతలో క్యాబినేట్ భేటీ సంబంధిత క్లిప్ మార్ఫింగ్ అయ్యి మరి సర్క్యులేట్ అవుతుండడంపై కేంద్రం గరం అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఫటాఫట్ చర్యలు ప్రత్యేకించి కొన్ని అకౌంట్లు, పేజీలు, ఛానెల్స్ నుంచే అశ్లీల కంటెంట్, వర్గాల మధ్య చిచ్చు పెట్టే తరహా కంటెంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫామ్స్ నుంచి సరైన స్పందన లేకపోతుండడంతో స్వయంగా సమాచార మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరగతిన రంగంలోకి దిగిన కేంద్రం.. 73 ట్విటర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇన్స్టాగ్రామ్ గేమ్‌ను తొలగించిందని తెలుస్తోంది. కేవలం తొలగించడమే కాదు.. ఇలాంటి చేష్టలకు పాల్పడే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. ఆడవాళ్ల కోసం.. మరోవైపు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరత్ర కంటెంట్‌ను వ్యాప్తిచెందిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ మేరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ మేనేజ్మెంట్లకు అలాంటి అకౌంట్ల విషయంలో జాప్యం చేయకుండా(విచారణ, దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా) త్వరగతిన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి ప్రముఖుల మార్ఫింగ్, అభ్యంతరకర, నకిలీ కంటెంట్ విషయంలో త్వరగతిన స్పందించాలని కోరింది. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నిరంతర పర్యవేక్షణ ద్వారా చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. టెక్నాలజీ(ఫేక్, మార్ఫింగ్) కట్టడికి టెక్నాలజీనే విరుగుడుగా ఉపయోగించాలని సూచిస్తోంది. వీపీఎన్ల నిషేధం! ట్విటర్, టెలిగ్రామ్ లాంటి అకౌంట్లతో పాటు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్)లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అశ్లీల, అభ్యంతరకర, నిషేధిత కంటెంట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీపీఎన్ అకౌంట్ల నిషేధంపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రత్యేక టూల్స్ ద్వారా అకౌంట్లపై నిఘా కొనసాగించాలంటూ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒత్తిడి తెస్తోంది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇది వరకే హోం మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అశ్లీల సైట్ల డొమైన్ల(ఎప్పటికప్పుడు మారుస్తూ ఇంటర్నెట్లో దర్శనమివ్వడం!) విషయంలోనూ కఠిన నియంత్రణ ద్వారా కట్టడి చేయాలని అనుకుంటోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ వేసవి లోపే అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కట్టడిపై కేంద్రం పట్టు సాధించే అవకాశం ఉంది. చదవండి: 20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు -
దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్ కానుందా..?
సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్లైన్లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ హైలైట్ చేసింది. భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో దేశంలో వీపీఎన్ సేవలను శాశ్వతంగా నిషేదించాలని కమిటీ సీఫారసు చేస్తుందని నివేదిక వెల్లడించింది. వీపీఎన్‌లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది. వీపీఎన్ అంటే ఏమిటి? వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ అని కూడా అంటారు. సాధారణంగా మనం ఇంటర్నెట్ లో ఏ పనిచేసిన.. ఫేస్బుక్ చూసిన, యూట్యూబ్ చూసిన, వెబ్సైట్లను సందర్శించినా.. ఇతర ఏవైనా పనులు చేసినా హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన డేటా సురక్షితంగా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. అంటే, మనకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సురక్షితమైన కనెక్షన్ సృష్టిస్తుంది. మీ ట్రాఫిక్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డ ఛానల్ ద్వారా రూట్ చేస్తుంది. ఇది మీ ఐపీ చిరునామాను దాచిపెడుతుంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!) ముఖ్యంగా, వీపీఎన్ యాప్స్ వినియోగదారులు తమ గుర్తింపును దాచేటప్పుడు తమ నెట్ వర్క్ వేరే భౌగోళిక ప్రదేశంలో ఉన్నట్లు చూపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఉన్నట్లు చూపిస్తుంది. వీపీఎన్ వల్ల మన ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్‌క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు హ్యాకర్ల నుంచి కాపాడుకోవడం కోసం తమ కార్యకలాపాలకు గాను వీపీఎన్‌లను ఉపయోగిస్తుంటాయి. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ కోసం ఇంటి పనిచేసినప్పుడు లాక్ డౌన్ సమయంలో ఇవి చాలా భాగ ఉపయోగపడాయి. -
భీమ్ యాప్‌లో లోపం?
ముంబై: యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను యాప్ నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొట్టేసింది. 13.6 కోట్ల డౌన్లోడ్లు ఉన్న ఈ యాప్‌లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్ మెంటర్ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదన్నారు. భీమ్ మొబైల్ పేమెంట్ యాప్ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్కు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రొఫైల్స్, లావాదేవీలు, ఆధార్, పాన్, కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇతర ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదం బారిన పడినట్లు చెప్పారు. అయితే భీమ్ యాప్ సురక్షితమేనని, ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ఎన్పీసీఐ స్పష్టంచేసింది. -
ప్రత్యేక ఫీచర్లతో ఒపెరా బ్రౌజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లోని నెట్ యూజర్ల వాడకానికి అనుగుణంగా త్వరలో తమ బ్రౌజర్లో వీపీఎన్ తదితర ప్రత్యేక ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్లు ఒపెరా సంస్థ డిప్యుటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బ్రూస్ లాసన్ తెలిపారు. ఒపెరా మినీ మొబైల్ బ్రౌజర్లో తాము ఉపయోగిస్తున్న టెక్నాలజీ.. డేటాను 90 శాతం మేర కుదించేస్తుందని వివరించారు. ఫలితంగా దేశీ యూజర్లకు గత ఏడాది వ్యవధిలో సుమారు 36 వేల టెరాబైట్ల డేటా, రూ. 690 కోట్ల మేర డేటా చార్జీలు ఆదా అయ్యాయని గురువారమిక్కడ లాసన్ తెలిపారు. ప్రస్తుతం తమ బ్రౌజర్‌కు భారత్‌లో సుమారు 5 కోట్ల మంది పైచిలుకు యూజర్లు ఉన్నారని చెప్పారు. బ్రౌజర్లో తెలుగు సహా 13 భాషల్లో తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశీయంగా మినీ యూజర్లలో సింహభాగం సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వార్తల సంబంధిత సైట్లను సందర్శిస్తున్నట్లు లాసన్ చెప్పారు. అధిక డేటా చార్జీలు, కవరేజీ నాణ్యత మోస్తరుగా ఉండటం వంటి అంశాల వల్ల భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం తక్కువగానే ఉందని, ఇప్పుడిప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందని ఆయన తెలిపారు.