పండక్కి ఊరెళుతున్నారా?  | Stop Social Media Promotion For Security Matters For SafeSide | Sakshi
Sakshi News home page

పండక్కి ఊరెళుతున్నారా? 

Published Thu, Jan 13 2022 1:05 AM | Last Updated on Thu, Jan 13 2022 1:07 AM

Stop Social Media Promotion For Security Matters For SafeSide - Sakshi

‘అవును, మా ఇంట్లో అందరం కలిసి మా అమ్మమ్మగారి ఊరెళుతున్నాం. భలే ఆనందంగా ఉంది..’ అంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌.. వంటి యాప్‌ల వేదికగా ఔత్సాహికులు చెబుతుంటారు. సన్నిహితులు, స్నేహితుల మధ్య తమ ఆనందాలను పంచుకోవాలనుకోవడం బాగానే ఉంటుంది. కానీ, ఈ విధానాల ద్వారా ‘ఫలానా వారి ఇంట్లో ఎవరూ లేరు’ అనే సందేశం పంపి, దొంగలకు మీ ఇంటి ‘కీ’ మీరే ఇచ్చినట్టవుతుంది. 

ఎంగేజ్‌మెంట్, విడాకులు, గర్భం దాల్చడం.. వంటివన్నీ సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మంది సోషల్‌ నెట్‌వర్క్‌లలో రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లను ప్రకటించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, తప్పులను అంగీకరించడం వరకే కాదు ‘స్వలింగ సంపర్కులం’ అంటూ లైంగిక గుర్తింపునూ ప్రకటిస్తున్నారు.

అడ్డుకట్ట అవసరం
పై వ్యక్తికరణలతో ఆన్‌లైన్‌ పరువు నష్టం, ట్రోలింగ్‌ భావప్రకటనా స్వేచ్ఛపై స్వల్ప, దీర్గకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్‌లైన్‌ దుర్వినియోగం మానసిక, శారీరక ఒత్తిడులను కలిగిస్తుంది. వ్యక్తిగత బ్రాండ్‌ గుర్తింపు. విశ్వసనీయత, ఆర్థికపరమైనవే కాకుండా ఇతర విపరిణామాలకూ దారితీసే అవకాశాలే ఎక్కువున్నాయి. ఇటీవలి కాలంలో పోస్ట్‌లకు ప్రత్యుత్తరాలు, వ్యాఖ్యల ద్వారా సాంకేతిక దుర్వినియోగం అమితంగా జరుగుతోంది. మన ప్రొఫైలింగ్‌పై మన అదుపు ఉండటం లేదు. భావవ్యక్తీకరణకు హద్దులే లేనట్టుగా సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తుంటే ఈ ప్రవాహాలకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి అని స్పష్టం అవుతుంది.

అతి అనర్థమే! 
మన రెజ్యూమ్‌ చూసి జాబ్‌ ఎలా ఇస్తారో.. ప్రస్తుత రోజుల్లో మీ సోషల్‌ ప్రొఫైలింగ్‌ చూసి కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఎంచుకుంటున్నారనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. మనదైన సృజనను, ఉత్పత్తిని నలుగురితో పంచుకోవడానికి, ప్రోత్సాహం లభించడానికి సోషల్‌ మీడియా మంచి మార్గం. ప్రజలు కూడా మన గురించి సానుకూలంగా ఆలోచించేలా చేయడానికి ఇది గొప్ప మార్గంగా ఎంచుకుంటున్నారు. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి సరైన మార్గమైంది సోషల్‌ మీడియా. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. సోషల్‌ మీడియాలో పరస్పర చర్యల ఆధారంగా వ్యక్తి ప్రతి ప్రవర్తనా అంశాన్ని డాక్యుమెంట్‌ చేస్తుంది. దీనివల్ల సాంకేతిక సంస్థలు గతంలో మీరు వాడిన మీ వ్యక్తిగత పదాలు, చర్యలు, సంభాషణలు, ఫొటోలను దొంగిలించి, ఆ పై వాటిని పబ్లిక్‌ చేసే అవకాశాలు లేకపోలేదు. వాటిని తిరిగి నలుగురిలో పంచి, అవమానించే సందర్భాలూ కూడా ఉంటాయి. ఈ రోజుల్లో క్లిక్‌ల ద్వారా డబ్బు సంపాదన ఓ మార్గమైంది. ఎన్ని ఎక్కువ క్లిక్‌లు వస్తే ప్రకటనల ఆదాయం అంత పెరుగుతుంది.. కాబట్టి ‘ఫేమస్‌’ జాబితాలో ఉండాలనుకొని అడ్డూ ఆపు లేకుండా భావ వ్యక్తీకరణ జరుగుతోంది. 

గోప్యత తప్పనిసరి
సోషల్‌ మీడియాలో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం వల్ల సైబర్‌స్టాకింగ్, లైవ్‌ లొకేషన్‌ డిస్‌క్లోజర్, సోషల్‌ ప్రొఫైలింగ్, ఫిషింగ్, ఐడెంటిటీ థెప్ట్, బ్లాక్‌మెయిలింగ్, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం,సెర్చ్‌ వారెంట్‌ లేకుండా ప్రభుత్వం వారిని తమ అధీనంలోకి తీసుకోవడం వంటివి .. ఇటీవల సమస్యలకు దారితీస్తుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే అవి మన జీవితాలను నాశనం చేస్తాయి. సోషల్‌ మీడియాను అధికంగా వినియోగించడం కారణంగా డిజిటల్, వ్యక్తిగత, ఆరోగ్య శ్రేయస్సు సమస్యలపై ఆందోళన పెరుగుతుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను గందరగోళానికి గురి చేశాయి. సోషల్‌ మీడియా విధానం ఎలా ఉందంటే గోప్యతగా ఉండాల్సినదంతా బయటపెట్టాల్సిందే అన్నట్టుగా ఉంటోంది. వ్యక్తులను నిరోధించే మార్గం, ఇంటర్నెట్‌లో శాశ్వతంగా తొలగించేది లేదు. ఒకవేళ మీరు సెలబ్రిటీ లేదా వ్యాపారి లేదా రాజకీయ పార్టీ సభ్యుడు లేదా సామాజిక కార్యకర్త అయితే తప్ప మీ సోషల్‌ మీడియా ఖాతాలను ‘ప్రైవేట్‌’గా ఉంచడం తెలివైన పని. 

సోషల్‌ మీడియాలో మెరుగ్గా ఉండాలంటే..
►Google రివర్స్‌ ఇమేజ్‌ చెక్‌ చేయండి. లేదా ఫొటో వెరిఫికేషన్‌ కోసం www.tineye.com ని ఉపయోగించండి. 
►ఫొటో లేదా వీడియో ((https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) బ్రౌజింగ్‌ కోసం ఇన్‌విడ్‌ టూల్‌ కిట్‌ ఎక్స్‌టెషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 
►సమాచారాన్ని పంచుకోవడం నియంత్రించడానికి కుకీలను బ్లాక్‌ చేయాలి. లేదంటే గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్‌ చేయాలి. 
►సోషల్‌మీడియాలో షేర్‌ చేసే వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయాలి. అజ్ఞాత లేదా ప్రైవేట్‌ మోడ్‌లో బ్రౌజ్‌ చేయాలి. 
►అవసరమైతే వర్చువల్‌ ప్రైవేట్‌నెట్‌వర్క్‌ (VPN)ని ఉపయోగించాలి.
►వెబ్‌సైట్, రూటర్‌ యాడ్‌–బ్లాక్‌లను ఉపయోగించాలి.
►ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో మెసేజ్‌ అప్లికేషన్‌లను ఉపయోగించాలి.
►పెద్ద అక్షరం, ప్రత్యేక అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి.
►రెండు కారకాల ప్రమాణీకరణ, సురక్షిత క్లౌడ్‌ను సెటప్‌ చేసుకోవాలి. 
►మీరు క్లిక్‌ చేసే లింక్‌ విషయంలో జాగ్రత్త అవసరం.https:// (ప్యాడ్‌లాక్‌ సింబల్‌)మాత్రమే ఉపయోగించి వెబ్‌సైట్‌లను సెర్చ్‌ చేయండి. – ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఇతర యాప్స్‌ను సైన్‌ ఔట్‌ చేయండి. 
►హానికరమైన దాడులను నిరోధించాలంటే ప్రతి లింక్‌నూ క్లిక్‌ చేయకుండా ఉండటమొక్కటే ఉత్తమ మార్గం. 
►ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసెంజర్‌లను ఉపయోగించవచ్చు.
►ఆన్‌లైన్‌లో సున్నితమైన సమాచారాన్ని అంటే ఆర్థిక, లాగిన్‌ ఆధారాలు మొదలైన వాటిని ఎప్పుడూ షేర్‌ చేయవద్దు. 
►నిజ జీవితంలో మీకు తెలిసిన వ్యక్తులు, నమ్మకం కలిగిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్‌ అవ్వడం మంచిది. 
►ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ పరస్పర చర్యలు ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తపడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement