worker dead
-
రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
తాండవ నదిలో ఇసుక కార్మికుడి మృతి
తుని రూరల్ : తుని మండలం మరువాడ వద్ద శుక్రవారం తాండవ నదిలో ఇసుక తవ్వకానికి దిగిన కార్మికుడు ప్రమాదవశాస్తు నీట మునిగి మృతి చెందాడు. సహచరుల కథనం మేరకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కురందాసు నాని (చెల్లారావు–32) రోజులాగే తాండవ నదిలో ఇసుక తీసేందుకు వెళ్లాడు. నదీలో పది అడుగుల నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో ఇసుక తీయడం చేపట్టాడు. కొద్దిసేపటికే నీటి మునిగిపోతూ రక్షించండి అంటు కేకలు వేశాడు. సమీపంలోనే ఉన్న సహచరులు వచ్చి ప్రయత్నించినా కనిపించకపోవడంతో గల్లంతైనట్టుగా తుని అగ్నిమాపక, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల అనంతరం నాని మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసి తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు బందువులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. ప్రమాదమని తెలిసినా ఉపాధి కోసం తాండవ నదీలో దిగి ఇసుక తవ్వకాలు చేస్తున్నామని పి.కృష్ణ, ఉరుకూటి రాము తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
తిరువూరు : స్థానిక గణేశ్ సెంటర్లోని ఒక షోరూం వద్ద బోర్డు ఏర్పాటు కోసం గురువారం కొలతలు తీస్తున్న వెల్డింగ్ పని చేసే కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.... బైపాస్ రోడ్డులో ఫౌండ్రీ పనులు చేసే సుతారి రామబ్రహ్మాచారి(35) ఒక షోరూం బోర్డు ఏర్పాటుకు కొలతలు తీసేందుకు వచ్చాడు. ఆ షోరూం భవనాన్ని ఆనుకుని హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి. అతను బోర్డు ఏర్పాటు కోసం కొలతలు తీసే క్రమంలో హైటెన్షన్ విద్యు™Œ వైరు చేతికి తగిలి కింద పడిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రామబ్రహ్మాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే పరామర్శ రామబ్రహ్మాచారి భౌతికకాయం వద్ద ఎమ్మెల్యే రక్షణనిధి, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామబ్రహ్మాచారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, ఏరువ ప్రకాష్‌రెడ్డి, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి తదితరులు కూడా రామబ్రహ్మాచారి మృతదేహానికి ఏరియా ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. -
నూనె మిల్లులో ప్రమాదం: కార్మికురాలు మృతి
పాల్వంచ టౌన్ (ఖమ్మం) : ఆయిల్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఓ కార్మికురాలు మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెంలో వాసవి ఆయిల్ మిల్లులో దేశబోయిన కవిత (25) కార్మికురాలిగా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం మిల్లులో పల్లీలను పోస్తున్న సమయంలో ఆమె చీర కొంగు మిషన్‌కు చుట్టుకోవడంతో అది ఆమె మెడకు ఉచ్చులా బిగుసుకుంది. దీంతో ఊపిరాడక కవిత ప్రాణాలు కోల్పోయింది. కవితకు భర్త కన్నస్వామి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అధికారుల వేధింపులు తాళలేక
కార్మికుడి మృతి మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కార్మికులు ఇన్చార్జి కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చైర్పర్సన్ హామీతో ఆందోళన విరమణ సంగారెడ్డి మున్సిపాలిటీ: అధికారుల వేధింపుల తాళలేకనే కాంట్రాక్ట్ కార్మికుడు కల్వకుంట కుమార్(32) మృతి చెందాడని, అందుకు బాధ్యుడైన ఇన్చార్జి కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 9 గంటలకే కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపాలిటీకి చేరుకున్నారు. రెండు నెలల క్రితం విధులకు సమయానికి హాజరు కాలేదని ఇన్చార్జి కమిషనర్ మధు ఇచ్చిన నివేదిక ఆధారంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కల్వకుంట కుమార్(32)ను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. అయితే కుమార్‌పైనే అతడి కుటుంబం ఆధారపడి ఉందని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. అయినా అతడిని విధుల్లోకి తీసుకోలేదు. గురువారం సైతం కుమార్ రాజంపేట పంప్‌హౌస్‌కు వచ్చిన జిల్లా అధికారిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. తాను మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేనని సదరు అధికారి సమాధానం ఇచ్చారు. దీంతో కుమార్ అక్కడి నుంచి ఆవేదనగా తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి చాతిలో నొప్పి వస్తోందని కుమార్ తెలపడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కమిషనర్ వేధింపుల వల్లే కుమార్ మృతి చెందాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 4గంటల పాటు కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకొని మృతి చెందిన కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ మృతికి కారణమైన జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జి కమిషనర్‌పై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్ దహన సంస్కారాల కోసం చైర్పర్సన్ విజయలక్ష్మి రూ.10వేలు అందజేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇన్చార్జి కమిషనర్ రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
క్వారీలో కార్మికుడి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో క్వారీలో పనిచేసే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వెలగట్టూరు స్టోన్ క్వారీలో పనిచేస్తున్న ఎల్లయ్య(45) అనే కార్మికుడు రాళ్లకు కంప్రెషర్ ద్వారా రంధ్రాలు వేస్తుండగా జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన ఎల్లయ్యను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఎల్లయ్య స్వస్థలం వెలగట్టూరు మండలం పైడిపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ ధరించకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెప్పుతున్నారు. -
కార్మికుడి కాల్చివేత
సాక్షి, చెన్నై : కడలూరు జిల్లా నైవేలిలో కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇక్కడి సిబ్బంది తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా తరచూ ఆందోళనలకు దిగడం, ఇటీవల సమ్మె బాట సైతం పట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ యాజమాన్యానికి, కార్మికుల మధ్య డిమాండ్ల సాధనపై చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో నైవేలి భద్రతకు నియమించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)ను వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌ను యాజమాన్యానికి కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి. ఈ దళం తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని, వీరిని వెనక్కు పంపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదే ఫోర్స్ ఓ కార్మికుడిని కాల్చి చంపడం నైవేలిలో రణరంగానికి దారి తీసింది. పేలిన తూటా: సోమవారం మధ్యాహ్నం కాంట్రాక్టు కార్మికుడు ఒకరు నైవేలి ప్రధాన మార్గం గుండా సొరంగం వైపు వెళ్లేందుకు యత్నించి నట్టు సమాచారం. అయితే, అతడిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది తుపాకీతో కాల్చారు. దీంతో ఆ పరిసరాల్లోని ఇతర సిబ్బంది ఉలిక్కి పడి, పరుగున బయటకు వచ్చారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని కాంట్రాక్టు కార్మికుడు రాజాగా గుర్తించారు. దీంతో నైవేలి కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్రిక్తత: ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిం చేందుకు సీఐఎస్ఎఫ్ వర్గాలు ప్రయత్నించడంతో కార్మికులు తిరగబడ్డారు. సీఐఎస్ఎఫ్ దళాలు మరింతగా రెచ్చి పోయాయి. కనిపించిన కార్మికులందరినీ తరిమి తరిమి కొట్టారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. నైవేలిలోని వాహనాల మీద తమ ప్రతాపం చూపించారు. ద్విచక్ర వాహనాలనూ వదిలి పెట్టలేదు. రాళ్లు రువ్వారు. రాస్తారోకోలకు దిగడంతో వాహనాలు బారులు తీరారుు. దీంతో ఆ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. సమాచారం అందుకున్న కడలూరు ఎస్పీ రాధిక నేతృత్వంలో సిబ్బంది నైవేలి కార్పొరేషన్ వద్దకు ఉరకలు తీశారు. ఎన్నికల విధులకు పోలీసు సిబ్బంది వెళ్లడంతో ఉన్న వాళ్లతో పరిస్థితిని కట్టడి చేయడానికి ఎస్పీ యత్నించారు. కార్మికులు అడ్డుకోవడంతో గం టల తరబడి మృతదేహం అక్కడే పడి ఉన్నది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రప్పించి, ఆ పరిసరాల్లో పరిస్థితి అదుపు తప్పకుండా మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాజాను కాల్చి చంపిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఎవరోనని విచారిస్తున్నారు. ఆగ్రహం: సీఐఎస్ఎఫ్ తీరుపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సిబ్బందిని ఎందుకు కాల్చారని ప్రశ్నిస్తే తమ మీద లాఠీలు ఎక్కుబెట్టారని, కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని జీవా ఒప్పంద కార్మిక సంఘం నాయకుడు వెంకటేష్ , సీఐటీయూ నాయకుడు వేల్ మురుగన్ పేర్కొన్నారు. జీతం తీసుకునే నిమిత్తం రాజా నైవేలికి వచ్చాడని వివరించారు. గుర్తింపుకార్డు ఉన్నా, అనుమతించక పోవడంతో లోనికి వెళ్లేం దుకు రాజా ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాజా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాల్సి ఉందన్నారు. నేరుగా కాల్చి చంపడం ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. మూడు రౌండ్ల కాల్పులతో రాజా తల ఛిద్రమయ్యిందని, సీఐఎస్ఎఫ్ను ఇప్పటికైనా వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. రాజా కుటుంబానికి న్యాయం చేయాలని, నష్ట పరిహారంతో పాటు, ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం నిరంతర ఆందోళనకు సిద్ధం అవుతున్నామన్నారు.