కార్మికుడి కాల్చివేత
Published Tue, Mar 18 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
సాక్షి, చెన్నై : కడలూరు జిల్లా నైవేలిలో కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇక్కడి సిబ్బంది తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా తరచూ ఆందోళనలకు దిగడం, ఇటీవల సమ్మె బాట సైతం పట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ యాజమాన్యానికి, కార్మికుల మధ్య డిమాండ్ల సాధనపై చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో నైవేలి భద్రతకు నియమించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)ను వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌ను యాజమాన్యానికి కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి. ఈ దళం తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని, వీరిని వెనక్కు పంపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదే ఫోర్స్ ఓ కార్మికుడిని కాల్చి చంపడం నైవేలిలో రణరంగానికి దారి తీసింది. పేలిన తూటా: సోమవారం మధ్యాహ్నం కాంట్రాక్టు కార్మికుడు ఒకరు నైవేలి ప్రధాన మార్గం గుండా సొరంగం వైపు వెళ్లేందుకు యత్నించి నట్టు సమాచారం. అయితే, అతడిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది తుపాకీతో కాల్చారు. దీంతో ఆ పరిసరాల్లోని ఇతర సిబ్బంది ఉలిక్కి పడి, పరుగున బయటకు వచ్చారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని కాంట్రాక్టు కార్మికుడు రాజాగా గుర్తించారు. దీంతో నైవేలి కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబికింది.
ఉద్రిక్తత: ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిం చేందుకు సీఐఎస్‌ఎఫ్ వర్గాలు ప్రయత్నించడంతో కార్మికులు తిరగబడ్డారు. సీఐఎస్‌ఎఫ్ దళాలు మరింతగా రెచ్చి పోయాయి. కనిపించిన కార్మికులందరినీ తరిమి తరిమి కొట్టారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. నైవేలిలోని వాహనాల మీద తమ ప్రతాపం చూపించారు. ద్విచక్ర వాహనాలనూ వదిలి పెట్టలేదు. రాళ్లు రువ్వారు. రాస్తారోకోలకు దిగడంతో వాహనాలు బారులు తీరారుు. దీంతో ఆ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. సమాచారం అందుకున్న కడలూరు ఎస్పీ రాధిక నేతృత్వంలో సిబ్బంది నైవేలి కార్పొరేషన్ వద్దకు ఉరకలు తీశారు. ఎన్నికల విధులకు పోలీసు సిబ్బంది వెళ్లడంతో ఉన్న వాళ్లతో పరిస్థితిని కట్టడి చేయడానికి ఎస్పీ యత్నించారు. కార్మికులు అడ్డుకోవడంతో గం టల తరబడి మృతదేహం అక్కడే పడి ఉన్నది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రప్పించి, ఆ పరిసరాల్లో పరిస్థితి అదుపు తప్పకుండా మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాజాను కాల్చి చంపిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఎవరోనని విచారిస్తున్నారు.
ఆగ్రహం: సీఐఎస్‌ఎఫ్ తీరుపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సిబ్బందిని ఎందుకు కాల్చారని ప్రశ్నిస్తే తమ మీద లాఠీలు ఎక్కుబెట్టారని, కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని జీవా ఒప్పంద కార్మిక సంఘం నాయకుడు వెంకటేష్ , సీఐటీయూ నాయకుడు వేల్ మురుగన్ పేర్కొన్నారు. జీతం తీసుకునే నిమిత్తం రాజా నైవేలికి వచ్చాడని వివరించారు. గుర్తింపుకార్డు ఉన్నా, అనుమతించక పోవడంతో లోనికి వెళ్లేం దుకు రాజా ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాజా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాల్సి ఉందన్నారు. నేరుగా కాల్చి చంపడం ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. మూడు రౌండ్ల కాల్పులతో రాజా తల ఛిద్రమయ్యిందని, సీఐఎస్‌ఎఫ్‌ను ఇప్పటికైనా వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. రాజా కుటుంబానికి న్యాయం చేయాలని, నష్ట పరిహారంతో పాటు, ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం నిరంతర ఆందోళనకు సిద్ధం అవుతున్నామన్నారు.
Advertisement