కార్మికుడి మృతి మున్సిపల్ కార్యాలయం
గేటుకు తాళం వేసిన కార్మికులు
ఇన్‌చార్జి కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు
చైర్‌పర్సన్ హామీతో ఆందోళన విరమణ
సంగారెడ్డి మున్సిపాలిటీ: అధికారుల వేధింపుల తాళలేకనే కాంట్రాక్ట్ కార్మికుడు కల్వకుంట కుమార్(32) మృతి చెందాడని, అందుకు బాధ్యుడైన ఇన్‌చార్జి కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 9 గంటలకే కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపాలిటీకి చేరుకున్నారు. రెండు నెలల క్రితం విధులకు సమయానికి హాజరు కాలేదని ఇన్‌చార్జి కమిషనర్ మధు ఇచ్చిన నివేదిక ఆధారంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కల్వకుంట కుమార్(32)ను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. అయితే కుమార్‌పైనే అతడి కుటుంబం ఆధారపడి ఉందని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది.
అయినా అతడిని విధుల్లోకి తీసుకోలేదు. గురువారం సైతం కుమార్ రాజంపేట పంప్‌హౌస్‌కు వచ్చిన జిల్లా అధికారిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. తాను మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేనని సదరు అధికారి సమాధానం ఇచ్చారు. దీంతో కుమార్ అక్కడి నుంచి ఆవేదనగా తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి చాతిలో నొప్పి వస్తోందని కుమార్ తెలపడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కమిషనర్ వేధింపుల వల్లే కుమార్ మృతి చెందాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 4గంటల పాటు కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకొని మృతి చెందిన కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ మృతికి కారణమైన జిల్లా పరిషత్ సీఈవో, ఇన్‌చార్జి కమిషనర్‌పై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్ దహన సంస్కారాల కోసం చైర్‌పర్సన్ విజయలక్ష్మి రూ.10వేలు అందజేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇన్‌చార్జి కమిషనర్ రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అధికారుల వేధింపులు తాళలేక
Published Sat, Dec 5 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM
Advertisement
Advertisement