చెత్త వాహనాల డ్రైవర్లకూ ఓనర్లయ్యే యోగం
డ్రైవర్ కమ్ ఓనర్ తరహా మరో పథకానికి జీహెచ్ఎంసీ కసరత్తు
బ్యాంకు రుణం ద్వారా భారీ వాహనాలను సమకూర్చే సదుపాయం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చెత్త తరలించే వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ వాహనాల డ్రైవర్లనే సదరు వాహనాల యజమానులుగా చేసే మరో కొత్త కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెల్సిందే. 105 మందికి బ్యాంకు రుణాలు ఇప్పించి కారు ఓనర్లను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాల డ్రైవర్లనూ ఓనర్లను చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా భారీ వాహనాలను(5 టన్నులు, 10 టన్నులు, 25 టన్నుల సామర్థ్యం కలిగిన) సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించనున్నారు. సదరు వాహనాలను జీహెచ్ఎంసీ సేవలకే వినియోగిస్తారు. వారికి చెల్లించే అద్దె చార్జీల నుంచే బ్యాంకు రుణవాయిదాలు చెల్లిస్తారు. తద్వారా చెత్త తరలింపు వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్న వారే జీవితాంతం ప్రైవేటు యజమానుల వద్ద పనిచేయకుండా వారే ఓనర్‌గా మారుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
141 అద్దె వాహనాల ద్వారా చెత్త తరలింపు..
జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ వెలువడే 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు, ఇతరత్రా అవసరాలకు మొత్తం 914 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇందులో 773 వాహనాలు జీహెచ్‌ఎంసీవి కాగా మిగతా 141 వాహనాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. సదరు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కొత్తగా చేపడుతున్న పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. డ్రైవింగ్ లెసైన్సు తదితర అర్హతలుండి సదరు వాహనాలను నడపగల ఇతరులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండో దశలో 250 మందికి సొంతకార్లు..
డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా తొలిదశలో 105 మంది బ్యాంక్ ద్వారా రుణసదుపాయం కల్పించిన విషయం తెల్సిందే. రెండో దశలో మరో 250 మందికి ఈ అవకాశం లభించనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కమిషనర్ సోమేశ్‌కుమార్ గురువారం సంతకం చేశారు. ఈసారి కార్లు పొందేవారు జీహెచ్ఎంసీకి మాత్రమే కాకుండా ఇతర క్యాబ్ సర్వీసులకు సైతం తమ కార్లను నడపవచ్చు. కాగా వాటి డ్రైవర్లుగా మాత్రం వారే ఉండాలి. బ్యాంకు రుణాలు పొందేందుకు తగిన గ్యారంటీనిచ్చే క్యాబ్ సర్వీసులకు ఈ కార్లను వినియోగించనున్నారు. గ్రీన్క్యాబ్, టాక్సీ ఫర్ ష్యూర్, మెరు, సిటీట్యాక్సీ తదితర క్యాబ్స్ నిర్వాహకులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది.
ఈ పథకం కింద మారుతీ స్విఫ్ట్‌డిజైర్ కారును రుణంపై అందించనున్నారు. లబ్ధిదారు తనవంతు వాటాగా రూ.1.38 లక్షలు చెల్లించాలి. వాహన ధర రూ.7.05 లక్షలుగా కాగా, మారుతీ సంస్థ రూ.67 వేలు రాయితీ ఇస్తుంది. రూ.5 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. నెలకు రూ.10,500 వంతున ఆరేళ్లపాటు ఈఎంఐ చెల్లించాలి. ఎస్సీలు, మైనార్టీలకు ఆయా సంస్థల నుంచి గ్రాంట్స్ లభిస్తాయి. ఈ కార్లను అధికారుల ప్రయాణానికి వాడుకుంటే జీహెచ్ఎంసీ నెలకు రూ.25 వేలు అద్దెగా చెల్లిస్తోంది. ఈ మొత్తం సరిపోవడం లేదని డ్రైవర్లనుంచి వస్తున్న విజ్ఞప్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి ఆ అద్దె మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.