yv avinash reddy
-
మనోళ్లు 553 మంది క్షేమం
సాక్షి, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 553 మంది క్షేమంగా ప్రమాదం నుంచి బయట పడ్డారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 485 మంది, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది వెరసి 696 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 92 మంది ప్రయాణించలేదని చెప్పారు. మిగతా వారిలో 553 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, 21 మంది స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృత్యువాత పడ్డారన్నారు. మిగతా 28 మంది ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వారి మొబైల్ నంబర్ల ఆధారంగా చిరునామా తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖలో 309, రాజమండ్రిలో 31, ఏలూరులో 9, విజయవాడలో 135 మంది దిగాల్సిన వారు ఉన్నారన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి 33, రాజమండ్రి నుంచి ముగ్గురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి 41, బాపట్ల, తెనాలి నుంచి ఎనిమిది, గుంటూరు నుంచి ఇద్దరు, ఒంగోలు నుంచి 11 మంది, నెల్లూరు నుంచి ముగ్గురు, తిరుపతి నుంచి 107 మంది ఎక్కారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరిని విశాఖ కేజీహెచ్, ఇద్దరిని సెవెన్‌హిల్స్, ఒకరిని ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని, నలుగురిని ఒడిశా నుంచి ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పారు. మిగతా వారు వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. రాష్ట్రం నుంచి 50 అంబులెన్సులను కటక్, భువనేశ్వర్‌లకు పంపించామన్నారు. ఇంకా తమ వారి ఆచూకీ తెలియ లేదని కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు. రైళ్ల ప్రమాదం నుంచి బయటపడి వాహనాల్లో విశాఖ చేరుకున్న ఏడుగురికి రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ.30 వేల చెక్కును బాధితుడు ఎం.సత్యంకు మంత్రి అందజేశారు. రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన బృందం ఘటన స్థలం నుంచి.. విశాఖ నుంచి తాను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఒడిశాలోని బహనాగబజార్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను స్వస్థలాలకు పంపించేందుకు భాద్రాక్ స్టేషన్ నుంచి చెన్నైకు ఆదివారం ప్రత్యేక రైలు(13863) నడిపారు. చెన్నై–హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైనందున.. ఈ నెల 5న దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై సెంట్రల్ నుంచి బహనాగబజార్‌కు ప్రత్యేక రైలు(02842)ను అదే షెడ్యుల్‌లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో చెన్నై సెంట్రల్–హౌరా(12840) రైలును ఆదివారం కూడా రద్దు చేశారు. సికింద్రాబాద్–గౌహతి ఎక్స్‌ప్రెస్(12513)ను ఖరగ్‌పూర్, టాటానగర్, రూర్కేలా, జార్సుగూడ స్టేషన్ల మీదుగా మళ్లించి నడుపుతున్నారు. -
హోదా వచ్చే దాకా పోరాటం
పడమర అనంతపురం (చాపాడు): రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక హోదా అత్యంత కీలకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. హోదా సాధించే వరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పోరాడతామని ప్రకటించారు. బుధవారం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం పడమర అనంతపురం గ్రామంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఐదు కాదు.. 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించారని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని, ఇప్పటివరకు 25 ఉద్యమాలు, ధర్నాలు, యువభేరి సభలు నిర్వహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో మార్చి 1న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 5 నుంచి బడ్జెట్‌పై రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని, ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏప్రిల్ 6న వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పారు. అన్యాయాన్ని జనం గమనిస్తున్నారు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గ్రామాల్లో ఎక్కడా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేయటం లేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్లుగా చాపాడు – నక్కలదిన్నె రోడ్డు పనులు చేపట్టటంలేదని విమర్శించారు. కేవలం తన సొంత గ్రామం అనే కారణంతో నిధులు మం జూరు కాకుండా టీడీపీ ఇన్చార్జి అధి కారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇరుకైన రోడ్డులో పలు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధి కారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటలక్ష్మమ్మ, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, నాయకులు లక్ష్మయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ అధికార ప్రతినిధి జ్వాలా నరసింహశర్మ, మం డల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, దండురాజు పాల్గొన్నారు. -
శాశ్వత పరిష్కారం చూపుతాం
వేముల : టెయిలింగ్ పాండ్ వ్యర్థ పదార్థాలు సాగు, తాగునీటిలో కలుషితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఈ విషయంపై సీఎండీ హస్నానితో చర్చిం చానని.. అప్పటి వరకు కె.కె.కొట్టాల, కనంపల్లెకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గ్రామస్తులకు భరో సా ఇచ్చారు. కె.కె.కొట్టాల, కనంపల్లెలో యురేనియం ప్రాజెక్టు ఈడీ ఏఆర్ ఘడే, అధికారులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి శనివారం పర్యటించారు. ఎంపీ మాట్లాడుతూ టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో సాగు, తాగునీరు కలుషి తమై పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్‌కు వివరించామన్నా రు. స్పందించిన ఆయన జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న అధ్యక్షతన అధికారులతో కమిటీ వేశారని.. వారు నివేదిక ఇచ్చిన వెం టనే కలెక్టర్ దెబ్బతిన్న పంటలను పరిశీ లిస్తారన్నారు. శాశ్వత పరిష్కారం వచ్చేవరకు పోరాడుతామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. కలుషిత నీరు తాగి చిన్నారులలో దద్దర్లు, దురద వచ్చాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టెయిలింగ్ పాండ్‌వల్ల తీవ్ర ప్రభావం.. : యురేనియం వ్యర్థాలను వేస్తున్న టెయిలింగ్ పాండ్‌వల్ల ప్రభావం తీవ్రంగా ఉంటుం దని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి యురేనియం అధికారులకు సూచించారు. భూమయ్యగారి పల్లె, రాచకుంటపల్లె, తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాలలో కూడా దీని ప్రభావం ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. యూసీఐఎల్ సీఎండీ రాక .. ఈనెల 15, 16వ తేదీలలో యూసీఐఎల్ సీఎండీ హస్నాని కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాలలో పర్యటిస్తారని వైఎస్ అవినాష్ రెడ్డి గ్రామస్తులకు చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో కలుషిత సాగునీటితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, ప్రాజెక్టు జీఎంలు ప్రాణేష్. ఎంఎస్ రావు, ఆర్‌డబ్లు్యఎస్ డీఈ పురుషోత్తం, ఎంపీడీఓ శివరామప్రసాద్‌రెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఏఈ శివారెడ్డి, కె.కె.కొట్టాల గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, కనంపల్లె సర్పంచ్ దేవదాసు పాల్గొన్నారు. -
‘విప్లవ సూర్యుడు’ను ఆవిష్కరించిన అవినాష్ రెడ్డి
యలహంక : ప్రవాసాంధ్రుడు తక్కెడశీల జానీ తాను రాసిన ‘విప్లవ సూర్యుడు’ రెండో కవితల పుస్తకాన్ని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జానీ తన కుటుంబ సభ్యులతో కలిసి అవినాష్ రెడ్డిని కలిశారు. కవితల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి రచయిత జానీని అభినందించారు. పులివెందుల పట్టణానికి చెందిన జానీ బెంగళూరులోని కోరమంగళలో ప్రతి లిపి వెబ్సైట్లో తెలుగు విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు కవితలపై చిన్నప్పటినుంచి మక్కువ పెంచుకుని ఎన్నో కవితలు రాశారు. కార్యక్రమంలో జానీ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. -
'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?'
కడప: వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు హామీలపై వైఎస్ జగన్‌తో చర్చించే స్థాయి సతీష్ రెడ్డికి లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనతో పులివెందులలో చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు...రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆయన అన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు మోసాలపై పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. అనంతరం పులివెందుల పీఎస్ లో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. నేడు చంద్రబాబు మోసాలపై ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పులివెందులలో ఆ పార్టీ కీలక నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. -
లోక్‌సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎల్ కే అద్వానీ, సోనియాగాంధీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుట్టా రేణుకా, వెలుగపల్లి వరప్రసాద్ రెడ్డి ఆంగ్లంలో, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు అశోక్ గజపతిరాజు ఆంగ్లంలో, జేసీ దివాకర్ రెడ్డి తెలుగులో, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణం చేశారు. కాగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనుంది.