ప్రమాద బాధితుడు సత్యానికి చెక్కు అందిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 553 మంది క్షేమంగా ప్రమాదం నుంచి బయట పడ్డారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 485 మంది, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది వెరసి 696 మంది ఉన్నారని తెలిపారు.
వీరిలో 92 మంది ప్రయాణించలేదని చెప్పారు. మిగతా వారిలో 553 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, 21 మంది స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృత్యువాత పడ్డారన్నారు. మిగతా 28 మంది ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వారి మొబైల్ నంబర్ల ఆధారంగా చిరునామా తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖలో 309, రాజమండ్రిలో 31, ఏలూరులో 9, విజయవాడలో 135 మంది దిగాల్సిన వారు ఉన్నారన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి 33, రాజమండ్రి నుంచి ముగ్గురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి 41, బాపట్ల, తెనాలి నుంచి ఎనిమిది, గుంటూరు నుంచి ఇద్దరు, ఒంగోలు నుంచి 11 మంది, నెల్లూరు నుంచి ముగ్గురు, తిరుపతి నుంచి 107 మంది ఎక్కారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
క్షతగాత్రుల్లో ఇద్దరిని విశాఖ కేజీహెచ్, ఇద్దరిని సెవెన్‌హిల్స్, ఒకరిని ఐఎన్‌ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని, నలుగురిని ఒడిశా నుంచి ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పారు. మిగతా వారు వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. రాష్ట్రం నుంచి 50 అంబులెన్సులను కటక్, భువనేశ్వర్‌లకు పంపించామన్నారు. ఇంకా తమ వారి ఆచూకీ తెలియ లేదని కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు.
రైళ్ల ప్రమాదం నుంచి బయటపడి వాహనాల్లో విశాఖ చేరుకున్న ఏడుగురికి రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ.30 వేల చెక్కును బాధితుడు ఎం.సత్యంకు మంత్రి అందజేశారు. రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన బృందం ఘటన స్థలం నుంచి.. విశాఖ నుంచి తాను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు.
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఒడిశాలోని బహనాగబజార్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను స్వస్థలాలకు పంపించేందుకు భాద్రాక్ స్టేషన్ నుంచి చెన్నైకు ఆదివారం ప్రత్యేక రైలు(13863) నడిపారు.
చెన్నై–హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైనందున.. ఈ నెల 5న దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై సెంట్రల్ నుంచి బహనాగబజార్‌కు ప్రత్యేక రైలు(02842)ను అదే షెడ్యుల్‌లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో చెన్నై సెంట్రల్–హౌరా(12840) రైలును ఆదివారం కూడా రద్దు చేశారు. సికింద్రాబాద్–గౌహతి ఎక్స్‌ప్రెస్(12513)ను ఖరగ్‌పూర్, టాటానగర్, రూర్కేలా, జార్సుగూడ స్టేషన్ల మీదుగా మళ్లించి నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment