సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యాలయంలో శుక్రవారం(నవంబర్29) కారుమూరి మీడియాతో మాట్లాడారు.
‘రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.నేరుగా రైతుల ఖాతాలోనే నగదు వేశాం. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్ళీ దళారులు,మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారు.
అసలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.ఈక్రాప్,ఇన్సూరెన్స్ అనేవి లేనే లేవు.ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనపడుతోంది.మా హయాంలో జియోట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళ్తుందో గమనించేవాళ్లం.
ఇప్పుడు ఆ జియోట్యాగ్ తీసేయటం వెనుక ఉద్దేశం ఏంటి?టీవీల్లో షోలు చేయటం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదు.ప్రభుత్వం కనీసం ఒక్క మీటింగ్ కూడా రైతుల కోసం పెట్టలేదు.ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? జగన్ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 అందేవి.ఇన్‌పుట్ సబ్సిడీ అందేది.ఇప్పుడు ఏ ఒక్క పథకమూ అందడం లేదు.రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.రేషన్ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోంది.
షిప్పులలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?చౌకడిపోల ద్వారా మా హయాంలో చాలా రకాల సరుకులు అందించాం.ఇప్పుడు బియ్యం,పంచదార తప్ప మరేమీ ఇవ్వడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి’అని కారుమూరి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment