
‘కుపి’్ట ముందడుగు పడేనా..!
● గత బడ్జెట్‌లో నిధులు కేటాయించినా పైసా విదల్చని వైనం ● భూసేకరణలో పురోగతి నిల్ ● పెరుగుతున్న అంచనా వ్యయం ● తాజాగా మళ్లీ సవరించేందుకు సిద్ధం ● ఇకనైనా అడ్డంకులు తొలిగేనా
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతిపాదిత కుప్టి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఆ తర్వాత ఒక్క పైసా కూడా విదల్చలేదు. భూసేకరణలోనూ అడుగు కూడా ముందుకు పడలేదు. ఏటా ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం పెరుగుతూనే పోతోంది. తాజాగా మళ్లీ సవరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ఆటంకాలు తొలుగుతాయా అనేది వేచి చూడాల్సిందే.
మళ్లీ సవరణ..?
నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ముందడుగు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గతేడాది బడ్జెట్‌లో రూ.234 కోట్లు మంజూరు ఇచ్చింది. దీంతో అప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగు పడినట్టేనని అంతా భావించారు. తదనుగుణంగా సాగునీటి, రెవెన్యూ అధికారులు రంగంలోకి కూడా దిగారు. ప్రాజెక్టు అమరిక కోసం భూమిని పరిశీలించారు. అప్పట్లో ముంపు భూములకు పరిహారం తేల్చిన తర్వాతే ఏదైనా అని నిర్వాసితులు స్పష్టం చేయడంతో కొంత వివాదం తలెత్తింది. నేరడిగొండ మండలంలోని కుమారి, గాజిలి, గాంధారి, కుప్టి గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురికానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదట 2018లో రూ.794 కోట్ల వ్యయంతో నిర్మించాలని అప్పట్లో బీఆర్‌ఎస్ సర్కార్ అంచన వేసింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తర్వాత పలుమార్లు ప్రాజెక్టు అంచనా వ్యయం సవరించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడుగు వేస్తుందనేదే ఆసక్తికరం. ఇదిలా ఉంటే వచ్చే జూలైలో దీనికి సంబంధించి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం మరోసారి అంచనా వ్యయం పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.
పూర్తి ఆయకట్టు స్థిరీకరించేందుకు..
బచావత్ అవార్డు ప్రకారం కడెం రిజర్వాయర్‌కు 68,150 ఎకరాల ఆయకట్టుకు 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని ఉంది. అయితే ఈ ప్రాజెక్టు వానాకాలంలో మాత్రమే నీటిని స్వీకరిస్తుంది. అది కూడా 7.20 టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది. ఆయకట్టుకు నీటి డిమాండ్ ప్రధానంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ప్రతీ పంట కాలం ముగిసే సమయానికి నీటి కొరత ఏర్పడుతుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 42,883 ఎకరాలకు మాత్రమే కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మిగతా 25,267 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ ప్రాజెక్టు ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతమైన కుప్టి వద్ద ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని పదేళ్ల కిందట.. అంటే 2015లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కడెం ఆయకట్టుకు అనుబంధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటుంది.
బహుళార్థసాధక ప్రాజెక్ట్..
కడెం ప్రాజెక్టును 1958 సంవత్సరంలో నిర్మించా రు. 7.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ జి ల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్యలో ఉన్న కుప్టి గ్రామం నుంచి నీటి పరీవాహకం ఉంది. ఈ నీరే కడెం ప్రాజెక్టుకు చేరుతుంది. బచావత్ అవా ర్డు ప్రకారం 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కడెం వద్ద అటవీ సంపద దృష్ట్యా ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచే అవకా శాలు లేవు. దీంతోనే ప్రభుత్వం ఎగువన ఉన్న కుప్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి బీజం వేసింది. ఇందులో భాగంగానే కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఆయకట్టు స్థిరీకరణ, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సదుపాయం అందించడం వంటి ప్రయోజనాలతో దీన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో కుప్టి ప్రా జెక్టుకు అనుసంధానంగా చుట్టుపక్కలా గ్రామాల కు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయకట్టుకు కూడా సాగునీరు అందించవచ్చనే ఆలోచన ఉంది.
కుప్టి ప్రాజెక్టు స్వరూపం ఇలా..
నీటి నిల్వ సామర్థ్యం:5.30 టీఎంసీలు
నీటిమట్టం : 394.00 మీటర్లు
జలమార్గం : 7 రేడియల్ గేట్లు
సిల్ప్‌వేతో నిర్మాణం
సంవత్సరం డీపీఆర్ అంచనా వ్యయం
2020–21 రూ.846.737 కోట్లు
2021–22 రూ.900 కోట్లు
2022–23 రూ.1100 కోట్లు
2023–24 రూ.1323 కోట్లు
ప్రధాన ప్రయోజనాలు..
మూడు మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి
బోథ్ నియోజకవర్గంలో భవిష్యత్తులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా కొత్త నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించేందుకు అవకాశాలు
నీటి ప్రవాహం కొనసాగడంతో కుంటాల జలపాతం సహజ సౌందర్యం చాలా కాలం పాటు ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి పర్యాటకుల ద్వారా ఆదాయం లభిస్తుంది.
కడెం ఆయకట్టు నుంచి గోదావరినదిలో పునరుత్పత్తి నీటి కారణంగా గూడెం, ధర్మపురి వద్ద గోదావరి నదికి నీరు చేరడం ద్వారా సమీపంలో ఉన్న దేవాలయాలకు ఎక్కువ మంది యాత్రికులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.
నిధులు మంజూరైతే భూసేకరణ చేస్తాం..
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన పక్షంలో భూసేకరణ చేపడతాం. నాలుగు గ్రామాల్లో 2500 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటా సవరించడం జరుగుతుంది. ఆ ప్రకారం త్వరలో మళ్లీ కొత్త వ్యయం రూపొందించనున్నాం.
– భీంరావు, మైనర్ ఇరిగేషన్ డీఈ,
ఇచ్చోడ డివిజన్
Comments
Please login to add a commentAdd a comment