‘హస్తం’లో గ్రేడ్‌లు!
● కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల గుర్తింపు ● ఏ,బీ,సీ గ్రేడ్‌లుగా విభజన ● పార్టీలో మారుతున్న సమీకరణాలు ● స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలో హాట్‌టాపిక్
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలో పాత, కొత్త నాయకుల పరంగా గ్రేడ్‌లు చేపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గాంధీభవన్‌లో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత అనే సంకేతాలు ఇచ్చేలా ప్రక్రియ నడుస్తున్నట్లు సమాచారం. మొత్తంగా త్వరలో జిల్లా పరంగా ప్రత్యేక కమిటీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను అధిష్టానం నియమించిన తర్వాత అనేక సంచనాలకు కేంద్ర బిందువవుతున్నారు. ప్రధానంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, మధ్యలో వచ్చిన వారికి ఇది మింగుడుపడని వ్యవహారంలా మారింది. దీంతో ఏం జరుగుతుందో చూద్దామనే భావనలో వారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ప్రధానంగా క్షేత్రస్థాయిలో పాత , కొత్త నాయకులకు టికెట్ల విషయంలో ఇప్పటికే వివాదం నెలకొంది. ఈ గ్రేడ్‌ల విభజన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
గ్రేడ్‌లుగా విభజన..
ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని ‘ఏ గ్రేడ్‌గా, ఎన్నికల ముందు వచ్చిన వారిని ‘బి’ గ్రేడ్‌గా, అధికారంలోకి వచ్చాక వచ్చిన వారిని ‘సి’ గ్రేడ్‌లో చేర్చనున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి సమావేశం గాంధీభవన్‌లో నిర్వహించగా వాడీవేడిగా సాగినట్లు ఆ రోజు నుంచి నాయకులు, కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఏ విషయాన్నైనా దాగుడుమూతలు లేకుండా సమావేశంలో స్పష్టంగా చెప్పాలని సూచించడం నాయకులకు ధైర్యాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశంలో అనేక అంశాల పరంగా ఆదిలాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఇవే కారణాలంటూ పలువురు నాయకులు ఆమె ఎదుట ఓపెన్‌గా పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఆమె ఏకంగా నియోజకవర్గం వారీగా కమిటీలను నియమిస్తూ, జిల్లాకు మరో ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొనడం సంచలనం కలిగించింది. మొత్తంగా త్వరలో జిల్లాలో పర్యటించే ఆ కమిటీలో పలు విధాన పరమైన నిర్ణయాలు అమలులోకి వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment