గుక్కెడు నీటికి అరిగోస
● మూడు గూడేలకు ఒకే చేతిపంపు ● సరఫరా కాని మిషన్ భగీరథ నీరు ● అధికారులకు పట్టని నీటి సమస్య ● గిరిజన బిడ్డలకు తప్పని నీళ్ల గోస
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా తాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. దీంతో బిందెడు నీటి కోసం ఇప్పటికీ ఆదివాసీలు కాలినడకన కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. నీటి సమస్య ఉన్న గ్రామాల యువకులకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదని ఆయా గ్రామాల గిరిజనులు ఆందోళన్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులకు సమస్య తెలిపినా పరిష్కరించడంలేదని ఆ రోపిస్తున్నారు. ఓట్లప్పుడే హామీలు ఇస్తూ ఆ తర్వాత కనిపించడంలేదని వాపోతున్నారు. 40 ఏళ్లుగా నీటి కోసం అరిగోస పడుతున్నామని, ఇంకెన్నాళ్లు ఈ బాధలు పడాలని ప్రశ్నిస్తున్నారు. నార్నూ ర్ మండలం సుంగాపూర్ పంచాయతీ పరిధిలో మూడు అనుబంధ గ్రామాలైన లంబాడీతండా, కొలాంగూడ, గొండుగూడకు తాగునీటి సమస్య తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం వెళ్లింది. ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
గొండుగూడవాసుల గోస తీరేనా?
సుంగాపూర్ పంచాయతీ పరిధిలో 250 కుటుంబాలుండగా 1,500 మంది జనాభా ఉన్నారు. గొండుగూడలో 100 కుటుంబాలుండగా 400 జనాభా ఉంది. గొండుగూడలో గతేడాది ఐటీడీఏ ద్వారా బో రు వేసినా నీళ్లు అడుగంటాయి. మిషన్ భగీరథ నీ రు సరఫరా అంతంతే. దీంతో బిందెడు నీటి కోసం ఉదయం 4గంటలకే చిన్నాపెద్దా లేచి రెండు కిలో మీటర్ల దూరం నడిచి చేతిపంపు, బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కొందరు నీటి కోసం ఎడ్లబండిని వినియోగిస్తున్నారు. వేసవిలో వీరి బా ధలు నిత్యకృత్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు.
కొలాంగూడ కష్టాలు గట్టెక్కేనా?
కొలాంగూడలో 70 కొలాం గిరిజన కుటుంబాలు ని వాసముంటున్నాయి. పీటీజీల సంక్షేమానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు తీ సుకోవాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వారికి శా పంగా మారుతోంది. మిషన్ భగీరథ నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా గ్రామంలోని ఏకైక చేతిపంపు నీటితోనే మూడు గూడేల ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు.
లంబాడీతండా.. సమస్యల అడ్డా
లంబాడీ తండాలో 100 గిరిజన కుటుంబాలుండగా, 400కు పైగా జనాభా ఉంది. గ్రామంలో మిష న్ భగీరథ నీళ్ల ట్యాంకున్నా ఉపయోగం లేదు. చేతి లో బిందెలు పట్టుకుని కొలాంగూడకు లేదా సమీ పంలోని బావి వద్దకు వెళ్లాల్సిన దుస్థితి. గ్రామంలో ఎలాంటి నీటి సౌకర్యం లేదు. వేసవి ప్రారంభంలోనే గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
పరిష్కారం చూపుతాం
సుంగాపూర్‌లో నీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. సమస్యను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రతిపాదనలు కూడా పంపించాం. నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నం. త్వరలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
– రోడ్డ శ్రీనివాస్, డీఈఈ, ఉట్నూర్
గుక్కెడు నీటికి అరిగోస
Comments
Please login to add a commentAdd a comment