సర్టిఫికెట్ల టైం..
● ‘రాజీవ్ యువ వికాసం’ ఎఫెక్ట్ ● రెవెన్యూ కార్యాలయాల్లో సందడి ● పెరిగిన దరఖాస్తుదారుల తాకిడి ● ఇదే అదునుగా దళారుల దోపిడీ
కై లాస్‌నగర్: జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలకు దరఖాస్తుదారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.4లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేస్తామని ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం తాజాగా పొందినదై ఉండాలనే నిబంధనతో ఆశావహులు వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల నుంచి ఆ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉండటంతో దరఖాస్తుదారులంతా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు పరుగు పెడుతున్నారు. ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సాధారణ సమయంలో రోజుకు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల కోసం 50 వరకు దరఖాస్తులు అందేవని, ప్రస్తుతం మూడు రోజుల్లోనే 700 వరకు అందాయని అక్కడి అధికారులు చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఒక్క కార్యాలయమే కాదు.. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్ని మండలాల్లో కలిపి రోజుకు వెయ్యికి పైగానే దరఖాస్తులు అందుతున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు సర్వర్ సమస్య కూడా వేధిస్తోంది. కుప్పలు తెప్పలుగా అందుతున్న దరఖాస్తుల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వివరాల నమోదులో జాప్యం అవుతుందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
దళారుల జోరు
ప్రభుత్వ సాయం కోసం చేసే దరఖాస్తుకు రెవెన్యూ సర్టిఫికెట్లు అవసరముండటంతో ఇదే అదునుగా కొంతమంది దళారుల అవతారమెత్తుతున్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఇస్తామని చెబుతూ ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. చేసేదిలేక కొంతమంది వారడిగినంత ముట్ట జెబుతున్నారు. ఇలా దళారులు ఒక్కొక్కరు పదుల సంఖ్యలో మీసేవ దరఖాస్తు రశీదులతో రెవెన్యూ కార్యాలయాల్లో వాలిపోతున్నారు. అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకుని సర్టి ఫికెట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అధికారులు ఇప్పటికై నా ఆ దిశగా దృష్టి సా రించి దళారుల జోక్యం కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.