తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ప్రయత్నం ఆపలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. అదే విశ్వాసంతో, సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కొనసాగించి, సివిల్స్‌లో 315 ర్యాంకు సాధించింది. ఆమె మరెవరో కాదు. నగరానికి చెందిన నౌపడ ఆశ్రిత. విశాఖపట్నంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆశ్రిత ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉన్న హరగోపాల్ స్కూల్లో జరిగింది. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది.
తరువాత ఆదిత్య డిగ్రీ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. 2019లో ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. అక్కడి నుంచి సివిల్స్ ర్యాంక్ సాధన వరకు తన ప్రయాణాన్ని సాక్షికి ఆశ్రిత తెలిపింది. ఆమె మాటల్లోనే.. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నపుడే సోషల్ వర్క్ పట్ల ఆసక్తి పెరిగింది. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లా. కోవిడ్ కారణంగా కోచింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నా. ఇంటి దగ్గరే చదివి, రెండు సార్లు సివిల్స్ రాశాను. కానీ ప్రిలిమ్స్ కూడా అర్హత సాధించలేకపోయా. ఈసారి పట్టుదల పెరిగింది. మరోసారి రాసేందుకు కోచింగ్ తీసుకున్నా.
2022లో సివిల్స్ మూడో అటెంప్ట్ చేశా. తాజాగా విడుదలైన ఫలితాల్లో 315వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు. అందుకే మరోసారి ర్యాంకు మెరుగుగైన ర్యాంకు కోసం 28న జరిగే ప్రిలిమ్స్‌కు హాజరుకానున్నట్టు ఆశ్రిత పేర్కొంది. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గృహిణి. తల్లితండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళిక, అధ్యాపకులు శిక్షణ తననీ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment