
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర రోడ్లపై విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులు పరుగులు పెట్టే రోజులు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి నుంచి కొండపైకి విద్యుత్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే నెల్లూరు–తిరుపతిల మధ్య ఇవి నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన పెద్ద నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కొన్నాళ్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తొలిదశలో వెయ్యి విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
విశాఖ నగరానికి 200 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ జిల్లా అధికారులు యాజమాన్యానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపారు. ఈ–బస్సుల కొనుగోలు మొదలవుతున్న నేపథ్యంలో.. మరో మూడు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమే కాదు.. త్వరలోనే కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖకు తొలి విడతలో వీటిలో కనీసం వంద బస్సులనైనా కేటాయిస్తారని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. మలి దశలో మరో వంద విద్యుత్ బస్సులను ఇస్తారని ఆశాభావంతో ఉన్నాయి.
సిటీ సర్వీసులుగానే..
విశాఖకు కేటాయించే ఎలక్ట్రిక్ బస్సులను తొలుత సిటీ సర్వీసులుగానే నడపనున్నారు. బ్యాటరీతో నడిచే ఈ–బస్సులు గతంలో 150 కిలోమీటర్లు తిరగడానికి మాత్రమే చార్జింగ్ సరిపోయేది. క్రమంగా వీటిలో సాంకేతికతకను అభివృద్ధి చేస్తుండడంతో ఇప్పుడు వాటి మైలేజి మరింత పెరిగే అవకాశం ఉంది. నగర పరిధిలో ప్రస్తుతం సిటీ బస్సులు రోజుకు 250 నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. తొలుత వచ్చే విద్యుత్ బస్సులను తక్కువ కిలోమీటర్ల రూటుల్లో తిప్పాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. మలి విడతలో రానున్న ఎలక్ట్రిక్ బస్సులను అప్పటి పరిస్థితులకనుగుణంగా వివిధ సిటీ రూట్లలో నడపనున్నారు. కొన్నాళ్ల తర్వాత సమీపంలోని పట్టణాలకు రెగ్యులర్ సర్వీసులుగా నడపాలని వీరు భావిస్తున్నారు.
సింహపురి, గాజువాక డిపోలు ఎంపిక
విద్యుత్ బస్సుల కోసం నగర పరిధిలోని సింహపురి, గాజువాక, వాల్తేరు డిపోలను తొలుత సిఫార్సు చేశారు. చివరకు వీటిలో సింహపురి, గాజువాకలను దాదాపు ఖరారు చేశారు. ఈ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమయ్యే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. విశాఖలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ కోసం సింహపురి లేఅవుట్‌లో డిపోతో పాటు గ్యారేజీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్సులు
విశాఖ నగర పరిధిలోని ఏడు డిపోల్లో ప్రస్తుతం 525 సిటీ బస్సులున్నాయి. వాహనాల తుక్కు విధానంలో భాగంగా 15 ఏళ్లు దాటిన బస్సులను సేవల నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన డీజిల్ బస్సుల స్థానంలో దశల వారీగా ఈ–బస్సులను సమకూరుస్తారు. విశాఖ జిల్లా ప్రజా రవాణా విభాగంలో ఈ సంవత్సరం 35 ఆర్టీసీ సిటీ బస్సులను తొలగించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి మరో 150 వరకు సిటీ బస్సులు 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోనుండడంతో వీటిని కూడా సేవల నుంచి తప్పించనున్నారు. విశాఖకు కేటాయించే ఎలక్ట్రిక్ బస్సులను తొలగించిన డీజిల్ బస్సుల స్థానంలో దశల వారీగా భర్తీ చేస్తామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. డీజిల్ బస్సులు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే నగరంలో కొంతవరకు కాలుష్య నియంత్రణకు వీలు పడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment