ఈ సారీ మిత్రపక్షానికే టికెట్ కేటాయించే అవకాశం
పొత్తు కుదిరిన ప్రతిసారీ ఆ పార్టీ నేతల ఆశలు గల్లంతు
బీజేపీకి కేటాయించే అవకాశం
స్పష్టం చేసిన టీడీపీ, జనసేన అధిష్టానాలు?
అమరావతి నుంచి నిరాశతో వెనుదిరిగిన నేతలు
నేడు అనుచరులతో సమావేశం కానున్న గిడ్డి ఈశ్వరి
తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసే అవకాశం
పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా ఎమ్మెల్యే లేని టీడీపీ ఈసారి ఎన్నికల్లో కూడా కనుమరుగు కానుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ స్థానం కేటాయిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు స్థానికంగా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్‌నాయుడు, కొట్టగుళ్లి సుబ్బారావు, జనసేనకు చెందిన వంపూరు గంగులయ్య అమరావతిలో మకాం వేశారు. టికెట్ బీజేపీకి కేటాయించినట్టు వారికి టీడీపీ, జనసేన అధిష్టానాలు చెప్పడంతో నిరాశకు గురైనట్టు తెలిసింది. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ జెండాలు మోస్తున్నామని ఈసారి ఎలాగైనా టికెట్ కేటాయించాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో అమరావతి వెళ్లిన నాయకులంతా నిరాశతో వెనుదిరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
20 ఏళ్లుగా దక్కని అధికారం..
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో చివరిసారిగా 1999 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలిచి 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడేరు నియోజకవర్గంలో ఏకధాటిగా 20 ఏళ్లుగా టీడీపీకి అధికారం దక్కలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినప్పటికి అప్పట్లో బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టడంతో టీడీపీ తరఫున ఎవ్వరు పోటీ చేయలేదు. సీపీఐ తరఫున దివంగత గొడ్డేటి దేముడు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పసుపులేటి బాలరాజు చేతిలో ఓటమి చెందారు.
2014 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా సీపీఐకి నియోజకవర్గ టికెట్ కేటాయించగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికి వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి పాలైంది. ఈసారి ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. పొత్తుల్లో భాగంగా ఈసారి పాడేరు అసెంబ్లీ స్థానంతో పాటు అరకు పార్లమెంట్ స్థానం కోసం బీజేపీ తీవ్రంగా పట్టుబడుతోంది. అరకు పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థికి ఇచ్చేందుకు దాదాపుగా ఖరారైంది. పాడేరు అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ ఇచ్చేందుకు టీడీపీ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
రెబల్‌గా గిడ్డి ఈశ్వరి?
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి కొన్నాళ్ళ తర్వాత 2018లో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆమె పోటీ చేసినప్పటికి వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఆమెకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించడంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. చాలా సందర్భాల్లో పార్టీ పెద్దలు పాడేరు వచ్చినప్పుడు ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తామని బహిరంగంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయిస్తున్నారని తెలియడంతో ఆమె టీడీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని అనుచర వర్గంతో ఈనెల 14న పాడేరులోని తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు పంపించారు.
చక్రం తిప్పుతున్న కొత్తపల్లి గీత
గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం వద్ద గట్టి పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అరకు ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కొత్తపల్లి గీత, గిడ్డి ఈశ్వరి మధ్య గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పటి నుంచి విబేధాలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఆమె పట్టుబట్టి మరి పాడేరు అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ కేటాయించాలని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని వినికిడి. మాజీ ఎమ్మెల్యే దివంగత ఎంవీఎస్ సత్యనారాయణ కుమారుడు, మాజీ జీసీసీ చైర్మన్, టీడీపీ నేత ఎంవీఎస్ ప్రసాద్‌ను పాడేరు అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎంవీఎస్ ప్రసాద్‌ను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల నుంచి కొత్తపల్లి గీత, ఎంవీఎస్ ప్రసాద్ టచ్‌లో ఉన్నారని కొంతమంది బీజేపీ, టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
టికెట్ రేసులో ఉన్నామని ‘కురుసా’ ఫ్యామిలీ లీకులు
అరకు పార్లమెంట్ స్థానంతో పాటు పాడేరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తమకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు కురుసా ఉమామహేశ్వరావు బహిరంగంగానే చెబుతున్నారు. తమ కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి కృషి చేసిందని వారంటున్నారు. పార్టీకి ఎన్నో సేవలు అందించామని, ఈ సారి తమ పార్టీ తరఫున అరకు పార్లమెంట్ లేదా పాడేరు అసెంబ్లీ స్థానానికి తాను లేదా తన సోదరి మాజీ జీసీసీ డీఎం కురుసా పార్వతమ్మ పోటీ చేస్తారని చెబుతున్నారు. జనసేన ఉనికి కరువైంది. కొసమెరుపు ఏంటంటే ఇతర పార్టీలతో టీడీపీ జత కట్టిన ప్రతీసారి పాడేరు అసెంబ్లీ స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించి, పోటీ నుంచి తప్పుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment