
ఇంటర్ చదువులకు వేళాయె
● నేటి నుంచి సెకెండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ● ఈ నెల 23 వరకు పనిచేయనున్న జూనియర్ కాలేజీలు ● ఫస్టియర్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
విశాఖ విద్య: జిల్లాలోని జూనియర్ కళాశాలలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు బోధనకు అంతా సిద్ధమైంది. ఇటీవలనే పరీక్షలు రాసి, వేసవి సెలవుల మూడ్‌లోకి వెళ్లిన విద్యార్థులంతా కళాశాలలకు తిరిగి రావాల్సిందే. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో సంస్కరణ పేరిట తీసుకొచ్చిన విధానంతో 2025–26 విద్యా సంవత్సరం మంగళవారం నుంచే మొదలుకానుంది. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 2 నుంచి ఇంటర్మీడియెట్ కళాశాలలు పనిచేయనున్నాయి.
జిల్లాలో కళాశాలలు ఇలా..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 211 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది వరకు 188 కళాశాలల్లో అడ్మిషన్లు జరిగాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు –10 , ఎయిడెడ్ కళాశాల–1, ఏపీ సాంఘిక సంక్షేమ–3, ఏపీ గిరిజన సంక్షేమ–1, కేజీబీవీలు–3, బీసీ సంక్షేమ–1, హైస్కూల్ ప్లస్ –9, ప్రైవేటు కళాశాలలు 183 ఉన్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 42,257 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరందరికీ మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు రాక
జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు రెట్టింపు స్థాయిలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఇక్కడ ప్రవేశాలు జరుగుతాయి. ప్రతీ ఏటా పదో తరగతి సుమారుగా 28 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. వీరిలో 80 శాతం మేర ఉత్తీర్ణులౌతారు. అయితే 2024–25లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చేరారు. విశాఖలో ఉన్న సౌలభ్యం, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు నగరంలోని జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్మిషన్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.
ప్రైవేటుకు పగ్గాలు
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఈ నెల 7 నుంచి చేసుకోవచ్చని ప్రభుత్వం విడుదల చేసిన విద్యా క్యాలెండర్‌లో స్పష్టం చేసింది. మే 31 వరకు అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 7 నుంచి మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభానికి అనుమతినివ్వటంతో జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు పగ్గాలు వచ్చినట్లైంది. ఇప్పటికే అడ్మిషన్ల వేట మొదలుపెట్టిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు మరింత జోష్ నింపాయి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముందని విద్యావేత్తలు అంటున్నారు.
నిబంధనలు పాటించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఇంటర్మీడియెట్‌బోర్డు జారీ చేసిన నిబంధనలను కాలేజీ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరించే కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్పాట్ వాల్యూయేషన్ పక్రియను మరో రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేస్తాం. కాలేజీల నిర్వహణపై దృష్టి సారిస్తాం.
– పి. మురళీధర్, ఆర్‌ఐవో

ఇంటర్ చదువులకు వేళాయె