సర్కారు కినుక | - | Sakshi
Sakshi News home page

సర్కారు కినుక

Published Sat, Apr 5 2025 1:37 AM | Last Updated on Sat, Apr 5 2025 1:37 AM

సర్కా

సర్కారు కినుక

● కరెంట్‌ ఇష్యూ
కోర్టు ఆదేశించినా

సాక్షి, విశాఖపట్నం : ఏ సంస్థలోనైనా చేసిన సర్వీస్‌ ప్రకారం సీనియారిటీని పరిగణిస్తుంటారు. కానీ.. విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో మాత్రం విచిత్రంగా పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్యోగి వయసు 40 సంవత్సరాలై సర్వీసు 15 ఏళ్లున్నప్పటికీ.. యాభై ఏళ్ల ఉద్యోగికి ఐదేళ్ల సర్వీసు ఉంటే.. సదరు ఉద్యోగినే సీనియర్‌గా పరిగణించారు. ఇలా 2008లో డిస్కం అధికారులు అడ్డగోలుగా పదోన్నతుల జాబితా తయారుచేశారు. దీనిపై కొందరు అప్పట్లోనే హైకోర్టుని ఆశ్రయించారు. సర్వీసు ప్రకారం పదోన్నతుల జాబితా సిద్ధంచెయ్యాలంటూ 2024 జూన్‌లో న్యాయస్థానం ఆదేశించినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. నిజానికి 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కరెంట్‌ పోతే ఫ్యూజులు బిగించేందుకు రైతులే వెళ్లి మృత్యువాత పడేవారు. దీంతో డిస్కంలలో లైన్‌మెన్ల కొరత వేధిస్తోందని తెలుసుకున్న వైఎస్సార్‌.. ఉమ్మడి రాష్ట్రంలో వెంటనే 7,114 పోస్టుల్ని భర్తీచేశారు. ఈ సమయంలో ఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు ఉమ్మడి సర్కిల్స్‌ పరిధిలో 1,220 పోస్టులు భర్తీఅయ్యాయి.

సీనియారిటీ లిస్టుల్లో అధికారుల నిర్లక్ష్యం..

2008లో కొత్తగా రిక్రూట్‌ చేసిన లైన్‌మెన్ల గత అనుభవాన్ని అనుసరించి.. సీనియారిటీ లిస్టులు తయారుచెయ్యాలని అప్పటి ప్రభుత్వం డిస్కంలని ఆదేశించింది. అయితే.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జాబితా సిద్ధంచేసేశారు. పనిచేసిన అనుభవం బట్టి కాకుండా.. వయసు బట్టి జాబితా తయారుచేశారు. దీనిపై అప్పట్లోనే అధికారులపై నాటి సీఎం వైఎస్‌ మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన మృతిచెందడం.. తర్వాత ప్రభుత్వాలు విస్మరించడంతో నేటికి కూడా సీనియర్లు జూనియర్లుగానే మిగిలిపోయారు. జూనియర్లు మాత్రం ప్రమోషన్లు తీసుకుని సీనియర్లుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బాధిత లైన్‌మెన్‌లు హైకోర్టుని ఆశ్రయించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించినా..

సీనియారిటీ జాబితా విషయంలో అన్యాయం జరిగిందంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టికి బాధిత లైన్‌మెన్‌లు తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే కోర్టులో కేసు నడుస్తుండటంతో ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకూ సీనియారిటీ జాబితాలో మార్పులు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో.. గతేడాది జూన్‌ 21న హైకోర్టు తీర్పు వెలువరించింది. పనిదినాల ఆధారంగా మాత్రమే కొత్తగా సీనియారిటీ జాబితా తయారుచేయాలని.. వయసు ఆధారంగా చేసిన జాబితాని వెంటనే రద్దుచేసి.. కొత్తగా తయారుచేయాలని డిస్కంలని ఆదేశించింది. అయినా, కూటమి ప్రభుత్వం న్యాయస్థానం తీర్పుని పెడచెవిన పెట్టింది. 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. పలుమార్లు అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు లైన్‌మెన్‌లు వినతులు సమర్పించినా.. సీనియారిటీ లిస్టుని మార్చడంలేదు. ఇటీవల ఎస్పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లో ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఈపీడీసీఎల్‌ అధికారులు మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే, 2007లో జూనియర్‌ లైన్‌మెన్‌లుగా ఎంపికై న 138 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈపీడీసీఎల్‌ అధికారులు అడ్డుపుల్ల వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా.. 138 మందికి ఉద్యోగాలివ్వాలని 2011లో న్యాయస్థానం ఆదేశించింది. వీరు విధుల్లో చేరినా సీనియారిటీని కోల్పోయారు. ఇలా.. ఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్‌లో 118 మంది, విజయనగరం సర్కిల్‌లో 136, విశాఖపట్నంలో 198, రాజమండ్రిలో 549, ఏలూరులో 353 మంది కలిపి మొత్తం 1,354 జూనియర్‌ లైన్‌మెన్‌లు పదోన్నతులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పుని తక్షణమే అమలుచేస్తే.. ఈపీడీసీఎల్‌ సహా మూడు డిస్కంల పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

ఏపీఈపీడీసీఎల్‌లో 1,354 మంది జూనియర్‌ లైన్‌మెన్‌ పదోన్నతుల్లో విచిత్రం

18 ఏళ్ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు

ఫలితంగా సీనియర్లు సైతం

జూనియర్లుగా మిగిలిపోయిన పరిస్థితి

హైకోర్టు ఆదేశించినా అమలుచేయని డిస్కంలు

కోర్టు కేసుల కారణంగా క్రమబద్ధీకరించలేకపోయిన గత ప్రభుత్వం

సీనియార్టీ ప్రకారం జాబితా సిద్ధంచేయాలని 10 నెలల క్రితం హైకోర్టు ఆదేశాలు

అయినా పాత జాబితానే కొనసాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం

సర్కారు కినుక1
1/1

సర్కారు కినుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement