
వైఎస్సార్‌సీపీ నేతకు బెయిల్
నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. శ్రీనివాసరావును నంద్యాల జిల్లా, జలదుర్గం పోలీసులు ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారంలో మూడు రోజులు పోలీసుల ఎదుట హాజరు కావాలని, 60 రోజులపాటు నంద్యాల పరిధి దాటి వెళ్లవద్దంటూ శ్రీనివాసరావుకు కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. జలదుర్గం పోలీసు స్టేషన్ నుంచి శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడుతూ రాజకీయ కక్షలతో తన ఆస్తులను ధ్వంసం చేస్తున్న సమయంలో ఆవేశంతో మాట్లాడితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలోనే పని చేస్తానన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన స్థాయికి తగిన వారితో రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నారు. సామాన్య నాయకుడైన తనపై కేసులు పెట్టించి వేధించటం స్పీకర్‌కు భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు.