
ఈదురు గాలులు.. భారీ వర్షం
సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి:
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరులో రాత్రి ఏడు గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో గంటపాటు జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.రోజూ వర్షాలు కురుస్తుండడంతో మామిడిపంటకు నష్టం ఏర్పడుతుందని గిరిజన రైతులు వాపోతున్నారు. కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెంతో పాటు పది గ్రామాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో మండల వాసులు ఆందోళన చెందారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.